ఆమె ఒక్కరే! | Parliamentary panel on marriage age has only one woman MP | Sakshi
Sakshi News home page

ఆమె ఒక్కరే!

Jan 3 2022 5:56 AM | Updated on Jan 3 2022 4:42 PM

Parliamentary panel on marriage age has only one woman MP - Sakshi

న్యూఢిల్లీ: అమ్మాయిల కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన చారిత్రక బిల్లును లోతుగా పరిశీలించే స్టాండింగ్‌ కమిటీ (స్థాయీ సంఘం)లో ఒకే ఒక్క మహిళా ఎంపీ ఉన్నారనే విషయం తాజాగా వెలుగులో వచ్చింది. విప్లవాత్మకమైన, మహిళల జీవితాలకు సంబంధించిన అత్యంత కీలకాంశంపై చర్చ జరిగే సమయంలో అతివలకు ఇంత తక్కువ భాగస్వామ్య ఉండటంపై విస్మయం వ్యక్తమవుతోంది.

విద్య, మహిళలు, పిల్లలు, యువత, క్రీడలపై... ఉన్న శాఖాపరమైన స్టాండింగ్‌ కమిటీలో మొత్తం 31 మంది సభ్యులుండగా దీంట్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ (రాజ్యసభ) సుస్మితా దేవ్‌ ఒక్కరే మహిళ. బీజేపీ సీనియర్‌ నేత వినయ్‌ సహస్రబుద్ధే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తుండగా... రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నరసారావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు (వైఎస్సార్‌సీసీ) ఒక్కరికే దీంట్లో ప్రాతినిధ్యం ఉంది.

అమ్మాయిల కనీసం వివాహ వయసు పెంపుపై సమతా పార్టీ మాజీ ఎంపీ జయా జైట్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహ నిషేధ చట్టం–2006కు మార్పులు తలపెట్టింది. యువతుల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్ల పెంచడానికి ఉద్దేశించిన బాల్య వివాహ నిషేధ (సవరణ) చట్టం–2021 బిల్లును కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో డిసెంబరు 21న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. హడావుడిగా బిల్లు తెచ్చారని, లోతైన పరిశీలన అవసరమని విపక్షాలు కోరడంతో ప్రభుత్వం దీనిని స్టాండింగ్‌ కమిటీకి పంపింది.  

కమిటీలోని 31 సభ్యుల్లో మీరొక్కరే మహిళ అనే విషయాన్ని సుస్మితా దేవ్‌ దృష్టికి తీసుకెళ్లగా ‘ఈ బిల్లును పరిశీలించేటపుడు మరింత మంది మహిళా ఎంపీలు ఉంటే బాగుండేది. అయితే ఇదివరకే చెప్పినట్లు భాగస్వామ్యపక్షాల అందరి వాదనలూ వింటాం’ అని ఆమె ఆదివారం స్పందించారు. ఈ బిల్లు చట్టం రూపం దాలిస్తే...  అమ్మాయి కనీస వివాహ వయసు విషయంలో ఏ మతానికి చెందిన ‘పర్సనల్‌ లా’ కూడా వర్తించదు. కనీస వివాహ వయసు 21 ఏళ్లు అన్ని మతాలకూ సమానంగా వర్తిస్తుంది.

ఏకరూపత వస్తుంది. మతపరమైన ‘పర్సనల్‌ లా’ల్లో ఏం నిర్దేశించినా అది ఇక చెల్లుబాటు కాదు. ద ఇండియన్‌ క్రిస్టియన్‌ మ్యారేజ్‌ యాక్ట్, ద పార్సీ మ్యారేజ్‌ అండ్‌ డైవోర్స్‌ యాక్ట్, ద ముస్లిం పర్సనల్‌ లా (షరియత్‌) అప్లికేషన్‌ యాక్ట్, ద స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్, ద హిందూ మ్యారేజ్‌ యాక్ట్, ద ఫారిన్‌ మ్యారేజ్‌ యాక్ట్‌లకు... బాల్య వివాహ నిషేధ (సవరణ)–2021 సవరణలు చేస్తుంది. ఏకరూపత ఉండేలా కనీస వివాహ వయసును 21 ఏళ్లుగా నిర్దేశిస్తుంది. స్టాండింగ్‌ కమిటీలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేకపోవడం గమనార్హం.  

కొత్తగా నియమించలేదు
నిజానికి ఈ స్టాండింగ్‌ కమిటీ బిల్లును పరిశీలించేందుకు ప్రత్యేకంగా నియమించిన కమిటీ కాదు. పార్లమెంటులో మొత్తం 24 శాఖాపరమైన కమిటీలు ఉన్నాయి. ఇవి శాశ్వత కమిటీలు. వీటిల్లో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలిద్దరూ సభ్యులుగా ఉంటారు. ఆయా పార్టీలు తమకు పార్లమెంటులో ఉన్న బలానికి అనుగుణంగా  స్టాండింగ్‌ కమిటీలకు సభ్యుల పేర్లను సిఫారసు చేస్తాయి. కొన్నింటిని లోక్‌సభ, మరికొన్నింటిని రాజ్యసభ పర్యవేక్షిస్తుంది.

సెలక్ట్‌ కమిటీ, జాయింట్‌ (సంయుక్త) కమిటీలను ఏదైనా అంశంపై చర్చించాల్సిన వచ్చినపుడు ప్రత్యేకంగా దాని కోసమే ఏర్పాటు చేస్తారు. మహిళల వివాహ వయసును పెంచే బిల్లును పరిశీలించనున్న కమిటీలో 2021 సెప్టెంబరులో రెండు విడతలుగా సభ్యులను నియమించారు. 10 లోక్‌సభ ఎంపీలు, 21 మంది రాజ్యసభ ఎంపీలు దీనిలో సభ్యులుగా ఉన్నారు. కమిటీలో నియామకాలు జరిగిన తర్వాత మహిళలకు సంబంధించిన ఈ కీలక బిల్లును డిసెంబరు 21 లోక్‌సభ స్టాండింగ్‌ కమిటీకి సిఫారసు చేయడం గమనార్హం.

సమంజసం కాదు
ప్రతిపాదిత బిల్లును పరిశీలించే స్టాండింగ్‌ కమిటీలో 50 శాతం మంది మహిళలు లేకపోతే అది సమంజసం అనిపించుకోదు. నిబంధనలు అనుమతిస్తే.. ఈ ప్యానెల్‌లోని తమ పురుష ఎంపీలను మార్చి వారి స్థానంలో మహిళా ఎంపీలను నామినేట్‌ చేయాలని నేను అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా. అలా కుదరని పక్షంలో ఈ కీలకమైన బిల్లుపై చర్చించేటపుడు తమ పార్టీలోని మహిళా ఎంపీలను సంప్రదించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని
కోరుతున్నా.                 

– జయా జైట్లీ


మరింత మంది ఉండాలి
నారీమణులకు సంబంధించిన అంశాలపై చర్చించే ఈ స్టాండింగ్‌ కమిటీలో మరింత మంది మహిళా ఎంపీలకు ప్రాతినిధ్యం ఉండాలి. సభ్యులు కాని వారినీ చర్చకు పిలిచే అధికారం కమిటీ ఛైర్మన్‌కు ఉంటుంది. భాగస్వామ్యపక్షాలందరినీ కలుపుకొని పోతూ, విస్తృత చర్చ జరగాలంటే ఛైర్మన్‌ మహిళా ఎంపీలను ఆహ్వానించవచ్చు.  ఈ కీలక చర్చలో మహిళా ఎంపీల భాగస్వామ్యం మరింత ఉండాలని కోరుకుంటున్నాను. 

– సుప్రియా సూలే, లోక్‌సభ ఎంపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement