breaking news
Vinay Sahasrabuddhe
-
స్త్రీలకు ఏ హక్కులుండాలో ఇంకా పురుషులే నిర్ణయిస్తారా?
ఢిల్లీ: అమ్మాయిల కనీస వివాహ వయసును 21కి పెంచే బిల్లుపై అధ్యయనం చేయనున్న స్టాండింగ్ కమిటీలో ఒక్కరే మహిళ ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. బీజేపీ నేత వినయ్ సహస్రబుద్దే నేతృత్వంలోని 31 మందితో కూడిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ ఒక్కరే మహిళ అనే విషయం విదితమే. దీనిపై డీఎంకే ఎంపీ కనిమొళి సోమవారం తీవ్రంగా స్పందించారు. ‘ప్రస్తుతం పార్లమెంటులో మొత్తం 110 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును 30 మంది పురుషులు, ఒక మహిళ ఉన్న ప్యానెల్ (కమిటీ)కి అప్పగించాలని నిర్ణయించింది. దేశంలోని ప్రతీ యువతిపై ప్రభావం చూపే కీలకాంశమిది. స్త్రీలకు ఏ హక్కులుండాలనేది ఇంకా మగవాళ్లే నిర్ణయిస్తున్నారు. మహిళలను మౌనప్రేక్షకుల్లా మార్చేస్తున్నారు’ అని ట్విట్టర్ వేదికగా కనిమొళి ధ్వజమెత్తారు. ‘స్రీలకు, భారత సమాజానికి సంబంధించిన అంశంపై మహిళల ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉన్న కమిటీ అధ్యయనం చేస్తుందనే విషయం తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తోంది. అందువల్ల ఈ బిల్లుపై జరిగే చర్చల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం, భాగస్వామ్యం ఉండేలా చూడాలని మిమ్మల్ని కోరుతున్నాను. భాగస్వామ్యపక్షాలందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం అత్యంత ముఖ్యం. అందరి వాదనలూ... ముఖ్యంగా మహిళల అభిప్రాయాలను స్టాండింగ్ కమిటీ వినాలి.. అర్థం చేసుకోవాలి’ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుకు రాసిన లేఖలో శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు. మహిళా ఎంపీల అందరి అభిప్రాయాలు వినండి: సుస్మితా దేవ్ కనీస వివాహ వయసు పెంపుపై మహిళా ఎంపీలు అందరి అభిప్రాయాలను స్టాండింగ్ కమిటీ వినాలని సుస్మితా దేవ్ కమిటీ చైర్మన్ సహస్రబుద్దేకు లేఖ రాశారు. ‘రాజ్యసభ నియమావళిలోని 84(3), 275 నిబంధనల కింద కమిటీ ఎదుట ప్రత్యక్షంగా హాజరయ్యి లేదా రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశాన్ని మహిళా ఎంపీలకు కల్పించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. దానికోసం కమిటీ ఛైర్మన్‌గా మీకున్న అధికారాలను ఉపయోగించండి. మహిళా ఎంపీలకు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు తగిన సమయాన్ని కేటాయించండి. రాజ్యసభలో 29 మంది, లోక్‌సభలో 81 మంది మహిళా ఎంపీలున్నారు’ అని సుస్మిత లేఖలో పేర్కొన్నారు. -
ఆమె ఒక్కరే!
న్యూఢిల్లీ: అమ్మాయిల కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన చారిత్రక బిల్లును లోతుగా పరిశీలించే స్టాండింగ్ కమిటీ (స్థాయీ సంఘం)లో ఒకే ఒక్క మహిళా ఎంపీ ఉన్నారనే విషయం తాజాగా వెలుగులో వచ్చింది. విప్లవాత్మకమైన, మహిళల జీవితాలకు సంబంధించిన అత్యంత కీలకాంశంపై చర్చ జరిగే సమయంలో అతివలకు ఇంత తక్కువ భాగస్వామ్య ఉండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. విద్య, మహిళలు, పిల్లలు, యువత, క్రీడలపై... ఉన్న శాఖాపరమైన స్టాండింగ్ కమిటీలో మొత్తం 31 మంది సభ్యులుండగా దీంట్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ (రాజ్యసభ) సుస్మితా దేవ్ ఒక్కరే మహిళ. బీజేపీ సీనియర్ నేత వినయ్ సహస్రబుద్ధే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తుండగా... రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నరసారావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు (వైఎస్సార్సీసీ) ఒక్కరికే దీంట్లో ప్రాతినిధ్యం ఉంది. అమ్మాయిల కనీసం వివాహ వయసు పెంపుపై సమతా పార్టీ మాజీ ఎంపీ జయా జైట్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహ నిషేధ చట్టం–2006కు మార్పులు తలపెట్టింది. యువతుల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్ల పెంచడానికి ఉద్దేశించిన బాల్య వివాహ నిషేధ (సవరణ) చట్టం–2021 బిల్లును కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో డిసెంబరు 21న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. హడావుడిగా బిల్లు తెచ్చారని, లోతైన పరిశీలన అవసరమని విపక్షాలు కోరడంతో ప్రభుత్వం దీనిని స్టాండింగ్ కమిటీకి పంపింది. కమిటీలోని 31 సభ్యుల్లో మీరొక్కరే మహిళ అనే విషయాన్ని సుస్మితా దేవ్ దృష్టికి తీసుకెళ్లగా ‘ఈ బిల్లును పరిశీలించేటపుడు మరింత మంది మహిళా ఎంపీలు ఉంటే బాగుండేది. అయితే ఇదివరకే చెప్పినట్లు భాగస్వామ్యపక్షాల అందరి వాదనలూ వింటాం’ అని ఆమె ఆదివారం స్పందించారు. ఈ బిల్లు చట్టం రూపం దాలిస్తే... అమ్మాయి కనీస వివాహ వయసు విషయంలో ఏ మతానికి చెందిన ‘పర్సనల్ లా’ కూడా వర్తించదు. కనీస వివాహ వయసు 21 ఏళ్లు అన్ని మతాలకూ సమానంగా వర్తిస్తుంది. ఏకరూపత వస్తుంది. మతపరమైన ‘పర్సనల్ లా’ల్లో ఏం నిర్దేశించినా అది ఇక చెల్లుబాటు కాదు. ద ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, ద పార్సీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్, ద ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్, ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ద హిందూ మ్యారేజ్ యాక్ట్, ద ఫారిన్ మ్యారేజ్ యాక్ట్‌లకు... బాల్య వివాహ నిషేధ (సవరణ)–2021 సవరణలు చేస్తుంది. ఏకరూపత ఉండేలా కనీస వివాహ వయసును 21 ఏళ్లుగా నిర్దేశిస్తుంది. స్టాండింగ్ కమిటీలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేకపోవడం గమనార్హం. కొత్తగా నియమించలేదు నిజానికి ఈ స్టాండింగ్ కమిటీ బిల్లును పరిశీలించేందుకు ప్రత్యేకంగా నియమించిన కమిటీ కాదు. పార్లమెంటులో మొత్తం 24 శాఖాపరమైన కమిటీలు ఉన్నాయి. ఇవి శాశ్వత కమిటీలు. వీటిల్లో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలిద్దరూ సభ్యులుగా ఉంటారు. ఆయా పార్టీలు తమకు పార్లమెంటులో ఉన్న బలానికి అనుగుణంగా స్టాండింగ్ కమిటీలకు సభ్యుల పేర్లను సిఫారసు చేస్తాయి. కొన్నింటిని లోక్‌సభ, మరికొన్నింటిని రాజ్యసభ పర్యవేక్షిస్తుంది. సెలక్ట్ కమిటీ, జాయింట్ (సంయుక్త) కమిటీలను ఏదైనా అంశంపై చర్చించాల్సిన వచ్చినపుడు ప్రత్యేకంగా దాని కోసమే ఏర్పాటు చేస్తారు. మహిళల వివాహ వయసును పెంచే బిల్లును పరిశీలించనున్న కమిటీలో 2021 సెప్టెంబరులో రెండు విడతలుగా సభ్యులను నియమించారు. 10 లోక్‌సభ ఎంపీలు, 21 మంది రాజ్యసభ ఎంపీలు దీనిలో సభ్యులుగా ఉన్నారు. కమిటీలో నియామకాలు జరిగిన తర్వాత మహిళలకు సంబంధించిన ఈ కీలక బిల్లును డిసెంబరు 21 లోక్‌సభ స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేయడం గమనార్హం. సమంజసం కాదు ప్రతిపాదిత బిల్లును పరిశీలించే స్టాండింగ్ కమిటీలో 50 శాతం మంది మహిళలు లేకపోతే అది సమంజసం అనిపించుకోదు. నిబంధనలు అనుమతిస్తే.. ఈ ప్యానెల్‌లోని తమ పురుష ఎంపీలను మార్చి వారి స్థానంలో మహిళా ఎంపీలను నామినేట్ చేయాలని నేను అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా. అలా కుదరని పక్షంలో ఈ కీలకమైన బిల్లుపై చర్చించేటపుడు తమ పార్టీలోని మహిళా ఎంపీలను సంప్రదించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నా. – జయా జైట్లీ మరింత మంది ఉండాలి నారీమణులకు సంబంధించిన అంశాలపై చర్చించే ఈ స్టాండింగ్ కమిటీలో మరింత మంది మహిళా ఎంపీలకు ప్రాతినిధ్యం ఉండాలి. సభ్యులు కాని వారినీ చర్చకు పిలిచే అధికారం కమిటీ ఛైర్మన్‌కు ఉంటుంది. భాగస్వామ్యపక్షాలందరినీ కలుపుకొని పోతూ, విస్తృత చర్చ జరగాలంటే ఛైర్మన్ మహిళా ఎంపీలను ఆహ్వానించవచ్చు. ఈ కీలక చర్చలో మహిళా ఎంపీల భాగస్వామ్యం మరింత ఉండాలని కోరుకుంటున్నాను. – సుప్రియా సూలే, లోక్‌సభ ఎంపీ -
రద్దుపై బీజేపీ నేత దారుణమైన వ్యాఖ్యలు!
పెద్దనోట్ల రద్దుతో పాత కరెన్సీని మార్చుకోవడానికి బ్యాంకుల ఎదుట ప్రజలు అష్ట కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. బ్యాంకుల ముందు పడిగాపులు పడుతూ కొందరు ప్రాణాలు కూడా విడుస్తున్నారు. ఇలా ప్రాణాలు విడువటంపై స్పందిస్తూ ఓ బీజేపీ నాయకుడు దురుసుగా వ్యాఖ్యలు చేశారు. బ్యాంకుల ముందే కాదు అప్పుడప్పుడు రేషన్ షాపుల ముందు క్యూలో నిలబడి కూడా ప్రజలు ప్రాణాలు విడుస్తారంటూ ఆయన పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ దారుణమైన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్ధే సోమవారం విలేకరులతో మాట్లాడారు. బ్యాంకుల ముందు ప్రజలు ప్రాణాలు విడువటంపై స్పందిస్తూ.. అప్పుడప్పుడు రేషన్ షాపుల మందు కూడా ప్రజలు చనిపోతారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, ప్రజల కష్టాలపై తామేమీ మొరటగా స్పందించడం లేదని ఆయన అన్నారు. భోపాల్‌లో వినోద్ పాండే (69) అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి బ్యాంకులో ముందు క్యూలో నిలుచొని ప్రాణాలు విడిచారు. అంతేకాకుండా మధ్యప్రదేశ్‌లో మరో మూడు మరణాలు కూడా బ్యాంకుల్లో నగదు బదిలీకి సంబంధించి చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేత వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి.