స్త్రీలకు ఏ హక్కులుండాలో ఇంకా పురుషులే నిర్ణయిస్తారా? | Sakshi
Sakshi News home page

స్త్రీలకు ఏ హక్కులుండాలో ఇంకా పురుషులే నిర్ణయిస్తారా?

Published Tue, Jan 4 2022 4:17 AM

DMK MP Kanimozhi asks why men continue to decide the rights of women - Sakshi

ఢిల్లీ: అమ్మాయిల కనీస వివాహ వయసును 21కి పెంచే బిల్లుపై అధ్యయనం చేయనున్న స్టాండింగ్‌ కమిటీలో ఒక్కరే మహిళ ఉండటంపై తీవ్ర అసంతృప్తి   వ్యక్తమవుతోంది. బీజేపీ నేత వినయ్‌ సహస్రబుద్దే నేతృత్వంలోని 31 మందితో కూడిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్‌ కమిటీలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుస్మితా దేవ్‌ ఒక్కరే మహిళ అనే విషయం విదితమే. దీనిపై డీఎంకే ఎంపీ కనిమొళి సోమవారం తీవ్రంగా స్పందించారు.

‘ప్రస్తుతం పార్లమెంటులో మొత్తం 110 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును 30 మంది పురుషులు, ఒక మహిళ ఉన్న ప్యానెల్‌ (కమిటీ)కి అప్పగించాలని నిర్ణయించింది. దేశంలోని ప్రతీ యువతిపై ప్రభావం చూపే కీలకాంశమిది. స్త్రీలకు ఏ హక్కులుండాలనేది ఇంకా మగవాళ్లే నిర్ణయిస్తున్నారు. మహిళలను మౌనప్రేక్షకుల్లా మార్చేస్తున్నారు’ అని ట్విట్టర్‌ వేదికగా కనిమొళి ధ్వజమెత్తారు.

‘స్రీలకు, భారత సమాజానికి సంబంధించిన అంశంపై మహిళల ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉన్న కమిటీ అధ్యయనం చేస్తుందనే విషయం తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తోంది. అందువల్ల ఈ బిల్లుపై జరిగే చర్చల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం, భాగస్వామ్యం ఉండేలా చూడాలని మిమ్మల్ని కోరుతున్నాను. భాగస్వామ్యపక్షాలందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం అత్యంత ముఖ్యం. అందరి వాదనలూ... ముఖ్యంగా మహిళల అభిప్రాయాలను స్టాండింగ్‌ కమిటీ వినాలి.. అర్థం చేసుకోవాలి’ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుకు రాసిన లేఖలో శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు.  

మహిళా ఎంపీల అందరి అభిప్రాయాలు వినండి: సుస్మితా దేవ్‌
కనీస వివాహ వయసు పెంపుపై మహిళా ఎంపీలు అందరి అభిప్రాయాలను స్టాండింగ్‌ కమిటీ వినాలని సుస్మితా దేవ్‌ కమిటీ చైర్మన్‌ సహస్రబుద్దేకు లేఖ రాశారు. ‘రాజ్యసభ నియమావళిలోని 84(3), 275 నిబంధనల కింద కమిటీ ఎదుట ప్రత్యక్షంగా హాజరయ్యి లేదా రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశాన్ని మహిళా ఎంపీలకు కల్పించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. దానికోసం కమిటీ ఛైర్మన్‌గా మీకున్న అధికారాలను ఉపయోగించండి. మహిళా ఎంపీలకు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు తగిన సమయాన్ని కేటాయించండి. రాజ్యసభలో 29 మంది, లోక్‌సభలో 81 మంది మహిళా ఎంపీలున్నారు’ అని సుస్మిత లేఖలో పేర్కొన్నారు. 

Advertisement
Advertisement