Parliament Live Updates: తొలిరోజు ముగిసిన లోక్‌సభ సమావేశాలు | Parliament monsoon session live updates | Sakshi
Sakshi News home page

Parliament Live Updates: తొలిరోజు ముగిసిన లోక్‌సభ సమావేశాలు

Jul 21 2025 11:29 AM | Updated on Jul 21 2025 5:36 PM

Parliament monsoon session live updates

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తొలి రోజు ముగిసింది. ప్రతిపక్షాల ఆందోళనకు దిగడంతో లోక్‌సభ ఈరోజకి వాయిదా పడింది. తిరిగి రేపు ప్రారంభం కానుంది.  తొలిరోజే నాలుగులు సార్లు సభ వాయిదా పడగా.. ప్రతిపక్ష సభ్యులు ఆపరేషన్ సిందూర్, ఇతర ముఖ్య అంశాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.

మూడవ వాయిదా అనంతరం మధ్యాహ్నం 4 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత, చైర్‌లో ఉన్న దిలీప్ సయికియా గోవా అసెంబ్లీ స్థానాల పునఃనిర్వచన బిల్లును తీసుకోవాలని సభ్యులను కోరారు. అయితే, ప్రతిపక్ష సభ్యులు ఆపరేషన్ సిందూర్‌పై చర్చను కొనసాగించాలంటూ నినాదాలు చేశారు.దీంతో లోక్‌సభ ఈరోజుకు వాయిదా వేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. 

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌ -పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్లు ట్రంప్ చేసిన వాదనలపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే- బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మధ్య రాజ్యసభలో వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం ఆపరేషన్‌ సింధూర్‌పై చర్చను తప్పించుకుంటోందని ఖర్గే ఆరోపించారు. దీనికి స్పందించిన నడ్డా ఆపరేషన్ సిందూర్‌పై పూర్తి చర్చకు ప్రభుత్వం అనుమతిస్తుందన్నారు. 

ఈరోజు (సోమవారం) ప్రధాని మోదీ ప్రసంగంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభలో గందరగోళం నెలకొంది. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ అంశంపై ప్రతిపక్షం చర్చకు పట్టుపట్టింది. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. లోక్‌సభలో విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌, బీహార్‌ ఓటర్‌ జాబితాలపై తీర్మానాలు ఇచ్చారు. ఇంటెలిజెన్స్‌ వైఫల్యాలు, టెర్రరిస్ట్‌లను ఇంత వరకూ అరెస్ట్‌ చేయకపోవడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ గందరగోళం మధ్య లోక్‌సభ స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.

లోక్‌సభ, రాజ్యసభ ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశమయ్యాయి. పహల్గామ్ ఉగ్ర దాడి, ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారికి నివాళులు అర్పించడంతో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అనంతరం స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు అనుమతించారు. అయితే, ప్రతిపక్ష సభ్యులు ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు డిమాండ్ చేస్తూ, నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరుగుతుందని ఓం బిర్లా తెలిపినా, ఎంపీలు తమ నిరసనలు కొనసాగించారు.

ఆపరేషన్ సిందూర్ పై ఎంపీల గందరగోళం మధ్య రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్‌ సభను వాయిదా వేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో పహల్గామ్ ఉగ్రవాద దాడి అంశాన్ని లేవనెత్తారు. కాల్పుల విరమణలో జోక్యంపై డొనాల్డ్ ట్రంప్ 24 సార్లు తన వాదన వినిపించారన్నారు. ప్రభుత్వం పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణకు సంబంధించిన వివరాలను అందించాలని పట్టుబట్టారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం, ఆ విమాన భద్రతపై రాజ్యసభలో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు సమాధానం ఇవ్వనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement