ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా తమిళనాట రాజకీయాలు ఆసక్తికరంగానే సాగుతున్నాయి. తప్పు చేయను, తప్పు చేయనివ్వను అంటూ సీఎంగా ప్రమాణం చేసేటప్పుడు విజయ్ ప్రకటించారు. మరోవైపు.. ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యతను నిర్వర్తిస్తామని డీఎంకే ఎంకే స్టాలిన్ హుందాగా ప్రకటించుకున్నారు. ఇంకోవైపు.. విజయ్ దెబ్బకు మరో విపక్షం అన్నాడీఎంకే మాత్రం వర్గపోరుతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
టీవీకేకు తగిన సంఖ్యా బలం లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటునకు నాలుగు రోజుల హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. ఈ గ్యాప్‌లో విజయ్‌ను దెబ్బ తీయాలని పళనిస్వామి తీవ్రంగా ప్రయత్నించినట్లు ఊహాగానాలు వినిపించాయి. కేవలం 47 మంది స్థానాలు నెగ్గిన అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు చేస్తోందని.. ఇందుకోసం బద్ధశత్రువు డీఎంకే మద్దతు తీసుకోనుందనే ప్రచారం ఉవ్వెత్తున సాగింది. చివరకు ఆ ఎపిసోడ్ తుస్సుమంది. గ్రూపు రాజకీయాలతో.. అదీ విజయ్‌కు మద్దతు ఇచ్చే విషయంలోనే మొదలైన సంక్షోభంతో అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఈ పళనిస్వామి తల పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
అన్నాడీఎంకేలో వర్గపోరు మునుపెన్నడూ లేనంత తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికల్లో వరుస పరాజయాల కారణంగా పళనిస్వామి నాయకత్వంపై ఆ పార్టీలో అసంతృప్తి పెరిగింది. ఆయన డీఎంకేతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించారని.. మరో సీనియర్ నేత సీవీ షణ్ముగం నేతృత్వంలోని వర్గం దీనిని వ్యతిరేకించిందని.. అదే సమయంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చర్చలు జరిపిందని జోరుగా ప్రచారం నడిచింది.
పళనిస్వామి ఎమ్మెల్యేల మద్దతు కోసం వారిని పుదుచ్చేరి రిసార్ట్‌కి తరలించినా ఈ విభేదాలు చల్లారలేదు. చివరకు తన నివాసంలో కూర్చోబెట్టి బుజ్జగించినా ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆయన ‘‘మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి..’’ అని తెగేసి చెప్పినట్లు సమాచారం. అటుపై మే 10 రాత్రి జరిగిన మరో సమావేశం తీవ్ర వాగ్వాదాలతో ముగియడంతో.. షణ్ముగం వర్గం విడిగానే ముందుకు సాగాలని నిర్ణయించుకుంది.
తాజాగా.. సోమవారం తమిళనాడు కొత్త అసెంబ్లీ సమావేశమైంది. దీనికి పళనిస్వామి నేతృత్వంలో 17 మంది ఎమ్మెల్యేలు, అలాగే షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఎమ్మెల్యేలు విడివిడిగా శాసనసభకు వచ్చి ప్రమాణం చేసి వెళ్లిపోయారు. పళని స్వామిని శాసనసభా పక్ష నేతగా గుర్తించాలని ఆయన మద్దతుదారులు.. లేదు ఎస్‌పీ వేలుమణిని గుర్తించాలని షణ్ముగం వర్గం ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శికి విడిగా లేఖలు ఇచ్చారు. దీంతో అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేత ఎంపికపై తీవ్ర సందిగ్ధత నెలకొంది.
విజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుతో అన్నాడీఎంకేలో మొదలైన విభేదాలు.. మరింత ముదిరి ఇంకో మలుపు తీసుకునే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా ఇవాళ జరగబోయే స్పీకర్ ఎన్నికలో షణ్ముగం వర్గం టీవీకేకు మద్దతు ఇవ్వవచ్చన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇది జరిగితే, పళనిస్వామికి సొంత పార్టీలోనే షాక్ తప్పదు.
విజయ్ ప్రభావం అన్నాడీఎంకేలోని అంతర్గత సమీకరణాలను గణనీయంగా మార్చేస్తోంది. పళనిస్వామి తన నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడం ఆయనను విలవిలాడే స్థితిలోకి నెట్టింది. మొత్తం మీద, అన్నాడీఎంకేలోని ఈ చీలిక పార్టీ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చింది. అయితే..
ఈ పరిణామాలతో సైలెంట్‌గా లాభపడేది టీవీకే, బీజేపీ అనే విశ్లేషణ నడుస్తోంది. అసెంబ్లీలో విజయ్ టీవీకే బలనిరూపణ ఎదుర్కొనుంది. అన్నాడీఎంకేలోని చీలిక వర్గం ఆ సమయంలో టీవీకేకు మద్దతు ప్రకటిస్తే పెనుసంచలనమే కానుంది. అయితే.. బయట మద్దతు తీసుకోవచ్చని.. మంత్రివర్గంలో స్థానం ఇవ్వకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు.. ఈ విబేధాలను అన్నాడీఎంకే కూటమి పార్టీ బీజేపీ తమ వ్యూహంలో భాగంగా ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదు. బలహీనమైన అన్నాడీఎంకే ద్వారా టీవీకేపై ప్రభావం చూపించే ప్రయత్నం చేయొచ్చని విశ్లేషకులు అంటున్నారు.
షణ్ముగం వర్గం బలపడితే, పళనిస్వామి నాయకత్వం కూలిపోవడం ఖాయం. ఇక స్పీకర్ ఎన్నికలో టీవీకే పార్టీ అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతు పొందితే, ఆ ప్రభావం తమిళనాడు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది.


