
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ మొదలైన అరగంట తర్వాతే దాని గురించి పాకిస్తాన్‌కు సమాచారమిచి్చనట్టు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వెల్లడించారు. ఆయన సారథ్యంలో పార్లమెంటు సంప్రదింపుల కమిటీ సోమవారం సమావేశమైంది. పహల్గాం దాడికి తెగబడ్డ ఉగ్ర మూకల పీచమణచేందుకు చేపట్టిన ఆ ఆపరేషన్‌తో పాటు పాక్ సీమాంతర ఉగ్రవాదం తదితరాలపై చర్చించింది. అన్ని పారీ్టల ఎంపీలూ భేటీలో పాల్గొన్నారు.
‘‘సిందూర్ గురించి ఆపరేషన్ మొదలైన అరగంటకు పాక్‌కు సమాచారమిచ్చాం. కేవలం ఉగ్ర శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్టు స్పష్టం చేశాం’’అని మంత్రి వెల్లడించారు. సైనిక చర్య గురించి పాక్‌కు జైశంకర్ ముందే సమాచారమిచ్చారని విపక్ష నేత రాహుల్‌గాంధీ కొద్దిరోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇలా స్పష్టతనివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఏ మాత్రమూ లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. భారత డీజీఎంఓకు పాక్ డీజీఎంఓ విజ్ఞప్తి చేసిన కారణంగానే ఒప్పందం కుదిరిందని పునరుద్ఘాటించారు.
‘‘పాక్ భారీ దాడికి సిద్ధమవుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మనకు సమాచారమిచ్చారు. అదే జరిగితే అంతే స్థాయిలో వాళ్లకు బదులిస్తామని చెప్పాం’’అన్నారు. సిందూర్ అనంతర ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాక్ నడుమ అణుయుద్ధం తరహా పరిస్థితి నెలకొందన్న వాదన పూర్తిగా సత్యదూరమని జర్మనీ వార్తాపత్రిక ఫజ్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో జైశంకర్ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని పాక్ ఓ వ్యాపారంగా బాహాటంగా నిర్వహిస్తోందంటూ నిప్పులు చెరిగారు. పాక్ ప్రభుత్వం, సైన్యం ఉగ్రవాదానికి అన్నివిధాలా వెన్నుదన్నుగా నిలుస్తూ పెంచి పోషిస్తున్నాయని మండిపడ్డారు.