
ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వర్షాకాలంలో ముఖ్యంగా జూన్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో పాక్‌లో భారీ వరదలు సంభవిస్తుంటాయి. ఫలితంగా కొండచరియలు విరిగిపడుతూ, అపారనష్టం వాటిల్లుతుంటుంది.ఇటువంటి విపత్తుల కారణంగా ఇటీవలి కాలంలో 100 మంది పిల్లలతో సహా 200 మందికి పైగా జనం ప్రాణాలను కోల్పోయారని, 500 మందికి పైగా జనం గాయపడ్డారని పాకిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌ఎండీఏ) తెలిపింది.
అధికారిక డేటా ప్రకారం పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ అత్యధికంగా 123 మంది మృత్యువాత పడ్డారు. అలాగే ఖైబర్ పఖ్తుంఖ్వాలో 40, సింధ్‌లో 21, బలూచిస్తాన్‌లో 16,ఇస్లామాబాద్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్‌లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఫైసలాబాద్‌లో వర్షాల కారణంగా గణనీయమైన నష్టం వాటిల్లింది. రెండు రోజుల్లో చోటుచేసుకున్న 33 ఘటనలలో 11 మంది మృతి చెందారు. 450 మి.మీ కంటే అధిక వర్షపాతం నమోదైన చక్వాల్‌లో 32 రోడ్లు కొట్టుకుపోయాయి. మౌలిక సదుపాయాల నష్టంతో పాటు, కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయి. అనేక ప్రాంతాలలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదు.