పాక్‌ సైన్యం కవ్వింపులు.. ఎల్‌వోసీలో భారత ఆర్మీ అలర్ట్‌ | India-Pakistan Tensions Flare at LoC After Operation Sindoor | Sakshi
Sakshi News home page

పాక్‌ సైన్యం కవ్వింపులు.. ఎల్‌వోసీలో భారత ఆర్మీ అలర్ట్‌

Sep 21 2025 9:26 AM | Updated on Sep 21 2025 11:09 AM

Pak Army ceasefire violations At Jammu Kashmir LOC

శ్రీనగర్‌: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాకిస్తాన్‌ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. తాజాగా భారత్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కుప్వారాలోని నౌగామ్‌ సెక్టార్‌లో పాక్‌ సైన్యం కవ్వింపులకు దిగింది. దీంతో భారత సైన్యం ఎదురు కాల్పులు చేసి పాక్‌ను సమర్థంగా తిప్పికొట్టింది.

వివరాల ప్రకారం.. ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం దాయాది దేశం పాకిస్తాన్‌ సైలెంట్‌ అయ్యింది. భారత్‌తో ఎలాంటి చర్యలకు పాల్పడలేదు. కానీ, తాజాగా సెప్టెంబర్‌ 20న సాయంత్రం 6.15 గంటల సమయంలో పాక్‌ ఆర్మీ.. మళ్లీ కవ్వింపు చర్యలకు దిగింది. నియంత్రణ రేఖ(Loc) వెంట కాల్పులకు తెగబడింది. దీంతో, అప్రమత్తమైన భారత సైన్యం.. ఎదురు కాల్పులు జరిపింది. సుమారు గంట పాటు కాల్పులు కొనసాగాయి. ఇందులో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు చెబుతున్నారు.

అయితే, తాజాగా కవ్వింపు చర్యల నేపథ్యంలో పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ చేసిన వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఇటీవల పాకిస్తాన్‌-సౌదీ అరేబియా మధ్య ఓ రక్షణ ఒప్పందం  కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా రెండింటిపై దాడిగా భావించి ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో పాక్‌-సౌదీ మధ్య కుదిరిన ఒప్పందంపై పాకిస్తాన్‌ రక్షణ మంత్రి స్పందిస్తూ..‘ఒకవేళ పాకిస్తాన్‌, భారత్‌ మధ్య యుద్ధం తలెత్తే పరిస్థితులు ఎదురైతే.. మాకు సౌదీ అండగా పోరాడుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒప్పందంలో భాగంగా వ్యూహాత్మక పరస్పర సహాయం ఉంటుంది. ఈ ఒప్పందం కింద అణ్వాయుధాలు వాడకూడదన్న నిబంధన ఏమీ లేదు. మాకు ఉన్న అన్ని సామర్థ్యాలను వినియోగిస్తాం. ఇది కేవలం రక్షణాత్మక ఒప్పందం మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే పాక్‌ సైన్యం ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిందనే అనుమానం కలుగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement