పల్లెపల్లెకూ మొబైల్‌

Over 7000 villages across 5 states to get 4G mobile services - Sakshi

ఏపీలో 1,218 గ్రామాలకు 4జీ

దేశవ్యాప్తంగా 7,287 గ్రామాలకు

యూఎస్‌ఓఎఫ్‌ పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం

సాక్షి, న్యూఢిల్లీ: తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్‌ సేవలు లేని గ్రామాలకు 4జీ సేవలు అందించడానికి కేంద్రం సన్నద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లో 1,218 గ్రామాలు సహా దేశవ్యాప్తంగా 44 ఆకాంక్ష (యాస్పిరేషనల్‌) జిల్లాల్లోని 7,287 గ్రామాలకు 4జీ సేవలు అందించడంలో భాగంగా యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ (యూఎస్‌ఓఎఫ్‌) పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్, ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీలు బుధవారం సమావేశమయ్యాయి. అనంతరం కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు.

యూఎస్‌ఓఎఫ్‌ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ , ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశాల్లోని 44 ఆకాంక్ష జిల్లాల్లో 7,287 గ్రామాల్లో సుమారు రూ.6,466 కోట్ల అంచనా వ్యయంతో 4జీ ఆధారిత మొబైల్‌ సేవలు అందించనున్నట్లు తెలిపారు. కేంద్ర కేబినెట్‌ నిర్ణయాల అనంతరం ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ మీడియాతో మాట్లాడుతూ... ఏపీలోని ఆకాంక్ష జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, కడపల్లోని మారుమూల గ్రామాలకు మొబైల్‌ సేవలు విస్తరించనున్నట్లు తెలిపారు. విశాఖ జిల్లాలో 1,054, విజయనగరంలో 154, కడప జిల్లాలో 10 గ్రామాల్లో మొబైల్‌ సేవల విస్తరణకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు.మొత్తంగా 18 నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. సాధ్యసాధ్యాలు పరిగణనలోకి తీసుకొని  పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత ఎక్కువగా సోలర్‌ పవర్‌ బ్యాటరీలు ద్వారా టెలికాం టవర్స్‌ ఏర్పాటు చేస్తామని అన్నారు.  

2022 వరకు పీఎంజీఎస్‌వై పథకం   
ప్రధాన మంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై) పథకం ఫేజ్‌ 1, 2 లను సెప్టెంబరు 2022 వరకూ కొనసాగించనున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలను ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. రూ.33,822 కోట్లతో గిరిజన, మారుమూల ప్రాంతాల్లో 32,152 కి.మీ.ల మేర రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. మైదాన ప్రాంతాల్లో 500 పైగా, ఈశాన్య, పర్వత ప్రాంతాల్లో 250పైగా జనాభా ఉన్న గ్రామాలకు రహదారుల అనుసంధానం నిమిత్తం కేంద్రం పీఎంజీఎస్‌వైను ప్రారంభించింది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు రహదారుల అనుసంధానం (ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఏ) ద్వారా 9 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో 4,490 కిలోమీటర్ల మేర రహదారిలో 105 వంతెనలు ఇప్పటికే పూర్తిచేశామన్నారు. 5,714 కిలోమీటర్ల రహదారి, 358 వంతెనలు పూర్తి కావాల్సి ఉండగా మరో 1,887 కిలోమీటర్ల రహదారి, 40 వంతెనల నిర్మాణాలకు అనుమతులు వచ్చినట్లు తెలిపారు. ఈ పథకాన్ని మార్చి 2023 వరకు కొనసాగించడం ద్వారా ఈశాన్య రాష్ట్రాలు, పర్వత ప్రాంతాల రాష్ట్రాల్లోని మిగిలిన పనులు
పూర్తి కానున్నాయని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌  తెలిపారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top