
మంత్రిత్వ శాఖలు, సంస్థల మధ్య సమన్వయం కీలకం
ఉన్నతస్థాయి సమీక్షలో ప్రధాని నరేంద్ర మోదీ స్పషీ్టకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిస్థితుల నేపథ్యంలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య స్పష్టమైన సమాచార వ్యవస్థ, సంసిద్ధత అత్యంత కీలకమని స్పష్టం చేశారు. జాతీయ భద్రత పట్ల ప్రభుత్వం పూర్తి అంకితభావంతో ఉందని పునరుద్ఘాటించారు. గురువారం వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో ప్రధానమంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
కేబినెట్ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయ సీనియర్ అధికారులు, రక్షణ, హోం, విదేశాంగ వ్యవహారాలు, సమాచార, విద్యుత్, ఆరోగ్యం, టెలికమ్యూనికేషన్స్ వంటి కీలక మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. జాతీయ భద్రత, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలను ప్రధాని మోదీ సమీక్షించారు. పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ శాఖల సన్నాహాలు, ప్రణాళికలను ఆరా తీశారు. కార్యదర్శులు తమ మంత్రిత్వ శాఖల కార్యకలాపాలను సమగ్రంగా సమీక్షించాలని పేర్కొన్నారు.
అత్యవసర ప్రతిస్పందన, కమ్యూనికేషన్ ప్రొటోకాల్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. పౌర రక్షణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడంతోపాటు తప్పుడు సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తిని సమర్థంగా నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రాల అధికారులతో పాటు క్షేత్రస్ధాయి సంస్థలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. ఎలాంటి విపత్కర పరిణామాలు ఎదురైనా తగిన రీతిలో ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని పలువురు కార్యదర్శులు చెప్పారు.