సాక్షి, చత్తీస్‌గఢ్: మావోయిస్టుల లొంగుబాటు యాత్ర చివరి అంకానికి చేరిందా?. ఆపరేషన్ కగార్‌లో సంచలన పరిణామం చోటు చేసుకోబోతోందా?. మావోయిస్టు పార్టీ కీలక నేత, మోస్ట్‌వాంటెడ్, మావోయిస్టు పార్టీ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మా(madavi Hidma) లొంగిపోబోతున్నారా??. ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఈ ప్రచారంపై స్పందించడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది.
మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా లొంగిపోతున్నారనే ప్రచారం తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సుమారు 200 మంది అనుచరులతో కలిసి హిడ్మా లొంగుబాటు కానున్నారనేది ఆ ప్రచార సారాంశం. ఈ ప్రచారంపై ఛత్తీస్‌గఢ్ పోలీసులు స్పందించారు. హిడ్మా లొంగుబాటు విషయంపై జరిగేదంతా ఉత్త ప్రచారమేనని కొట్టిపారేశారు. అయితే..
హిడ్మా లొంగిపోతే మంచి పరిణామమేనని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పునరావాస పధకం కింద ఆయనకు రావాల్సిన రివార్డ్ నగదును ఆయనకే అందజేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆశన్న తమ దళాలతో లొంగిపోయారు. దీంతో వాళ్లను ఉద్యమ ద్రోహులుగా మావోయిస్టు పార్టీ అభివర్ణిస్తూ ఓ లేఖ రాసింది. నిజంగానే.. హిడ్మా గనుక లొంగిపోతే మావోయిస్టు పార్టీ కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదు.
ఎవరీ హిడ్మా..
మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకమైన నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) కంపెనీ వన్ కమాండర్‌గా ఉన్నారు. ఆయన స్వస్థలం ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా పూవర్తి గ్రామం. ఇప్పుడున్న మావోయిస్టులలో.. అత్యధిక దళ సభ్యులు(మల్లా, నిషాద్ వర్గాల ప్రజలు) ఈ గ్రామ పరిధి నుంచే ఉన్నారనే అంచనా ఒకటి ఉంది.
గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుగాంచిన హిడ్మా పేరు మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉంది. గతంలో భద్రతా బలగాలపై జరిగిన అనేక దాడులకు హిడ్మా నాయకత్వం వహించినట్టు సమాచారం. 2023లో దండకారణ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన చనిపోయినట్లు ప్రచారం జరిగింది. ఆ వెంటనే ఫొటో రిలీజ్ చేసి పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టారు. అప్పటి నుంచి మావోయిస్టుల మూడంచెల భద్రతా వ్యవస్థ నడుమ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్‌లో భాగంగా భద్రతా బలగాలు హిడ్మా కోసం ప్రత్యేకంగా ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.
సంబంధిత కథనం: చదివింది ఐదో తరగతి! పాతికేళ్లకే తుపాకీ పట్టి..


