లొంగిపోయేందుకు వస్తున్న.. 140 మంది మావోయిస్టులు | 140 Maoists: Senior Leaders Rupesh And Ranita To Surrender | Sakshi
Sakshi News home page

లొంగిపోయేందుకు వస్తున్న.. 140 మంది మావోయిస్టులు

Oct 16 2025 7:14 PM | Updated on Oct 16 2025 9:04 PM

140 Maoists: Senior Leaders Rupesh And Ranita To Surrender

బీజాపూర్: మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ రావు అలియాస్‌ అభయ్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఎదుట బుధవారం లొంగిపోగా... అదే బాటలో మరో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న కూడా ఇవాళ లొంగిపోయారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లో కీలక నేతలు రూపేష్, రనిత సహా 140 మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. రేపు(శుక్రవారం, అక్టోబర్ 17న జగదల్‌పూర్‌లో ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్, హోం మంత్రి విజయ్ శర్మ ఎదుట లొంగిపోనున్నారు.

కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్, మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత, ఇద్దరు DKSZC సభ్యులు, 15 మంది DVC సభ్యులు సహా మొత్తం 140 మంది మావోయిస్టులు లొంగిపోవడానికి భైరామ్‌గఢ్ వైపు వెళుతున్నారు. వారు ఇంద్రావతి నది అవతలి వైపుకు చేరుకుంటారు. నక్సలైట్లందరూ లొంగిపోవడానికి 70కి పైగా ఆయుధాలను తీసుకువస్తున్నట్లు సమాచారం. భైరామ్‌గఢ్ నుండి ఇంద్రావతి నదిపై ఉన్న ఉస్పారి ఘాట్ వరకు భద్రతా దళాలు గట్టి భద్రతను మోహరించాయి. దంతేవాడ, బీజాపూర్ సరిహద్దుల్లోని అడవుల నుంచి మావోయిస్టులు ఈ నదిని దాటి జగదల్‌పూర్‌కు చేరుకుంటున్నారు. ఉస్పారి ఘాట్ మార్గంలో బయటి వ్యక్తులెవరినీ ప్రయాణించడానికి అనుమతించడం లేదు.

రూపేష్.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ మావోయిస్టు నేత. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKZC) లోని మాడ్ డివిజన్‌లో లాజిస్టిక్స్, కమ్యూనికేషన్, శిక్షణ బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర కమిటీ మరియు స్థానిక జోనల్ నిర్మాణం మధ్య సంబంధాల వారధిగా పనిచేశారు. రనిత.. DKZC మాడ్ డివిజన్ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన సీనియర్ మహిళా కమాండర్. బస్తర్ జిల్లాల్లో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వరుస ఆపరేషన్‌లతో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. లొంగుపోక తప్పడం లేదు. కేంద్రంతో చర్చలు జరపాలని పదే పదే యత్నించినా అది విఫలం కావడంతో ఇక లొంగుబాటు ఒక్కటే సరైన మార్గమని ఎంచుకున్న వందల సంఖ్యలో మావోయిస్టులు.. జన జీవన స్రవంతిలోకి వచ్చేస్తున్నారు. గత రెండు రోజులుగా  అగ్రనేతలతో సహా 283 మంది మావోయిస్టులు తాము చేతపట్టిన తుపాకులను, నమ్ముకున్న అడవుల్ని వదిలి సాధారణ జీవితం గడపడానికి సిద్ధమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement