న్యూఢిల్లీ: అత్యాధునిక ఆయుధాలు, సైనిక ఉపకరణాలతో త్రివిధ దళాలను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా రక్షణ శాఖ మరో భారీ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. మొత్తంగా రూ.79,000 కోట్ల విలువైన ఆయుధాలు, మిలటరీ హార్డ్‌వేర్ కొనుగోలుకు సంబంధించిన సమీకరణ ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలోని రక్షణ కొనుగోళ్ల మండలి తమ సమావేశంలో ఆమోదముద్ర వేసింది.
నాగ్ క్షిపణులు, బహుళచర ఆయుధ నౌకలు, ఎల్రక్టానిక్ సహిత ఇంటెలిజెన్స్, నిఘా వ్యవస్థలను సైతం కొనుగోలుచేయనున్నారు. సైనిక హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంక్‌లు, ఆయుధాలు, సైనిక బలగాలను తరలించేందుకు ఉపయోగించే ల్యాండింగ్ ప్లాట్‌ఫామ్ డాక్స్(ఎల్‌పీడీ), 30 ఎంఎం నావల్ సర్ఫేస్ గన్స్(ఎన్‌ఎస్‌జీ), అడ్వాన్స్‌డ్ లైట్ వెయిట్ టార్పెడో(ఏఎల్‌డబ్ల్యూటీ), ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్ సెర్చ్ అండ్ సిస్టమ్‌తోపాటు 76 ఎంఎం సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ ఆయుధం కోసం మందుగుండును కొనుగోలుచేయనున్నారు.
ఆర్మీ, వాయుసేన తరహాలో ఇకపై నావికాదళం సైతం భూతల, గగనతలాల్లో ఆపరేషన్లు చేసేలా ఎల్‌పీడీలను సమీకరించి నేవీకి అందజేయనున్నారు. కనీసం నాలుగు ఎల్‌పీడీలను సమీకరించనున్నారు. ఏఎల్‌డబ్ల్యూటీను రక్షణపరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ)లోని నేవల్ సైన్స్, టెక్నాలజికల్ లే»ొరేటరీ దేశీయంగా తయారుచేసింది. ఎన్‌ఎస్‌జీతో సముద్రజలాల్లో చిన్నపాటి అత్యయక సేవల్లో పాల్గొనవచ్చు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారీ స్థాయిలో ఆయుధాల సమీకరణ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయడం ఇది రెండోసారి కావడం విశేషం.


