
భువనేశ్వర్: ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసినా చర్య తీసుకోలేదని ఆరోపిస్తూ, ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విద్యార్థినికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎనిమిది ప్రతిపక్ష పార్టీల మద్దతుతో కాంగ్రెస్ ఒడిశాలో ఈరోజు(గురువారం) బంద్ నిర్వహిస్తోంది. ఈ నేపధ్యంలో రాజధాని భువనేశ్వర్‌లోని దుకాణాలు మూతపడ్డాయి. రోడ్లపై వాహనాలు రాకపోకలు కూడా కనిపించలేదు.
రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపునకు మద్దతుగా పలువురు ప్రతిపక్ష నేతలు.. ఈ ఘటనలో మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ, పార్టీ జెండాలు, ప్లకార్డులను పట్టుకుని రోడ్లపై నిరసన తెలిపారు. బంద్ నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసు బృందాలను మోహరించడంతో పాటు గట్టి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఓపీసీసీ) అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ బంద్ రాజకీయాల కోసం కాదని, ఇక్కడి కుమార్తెలకు అండగా నిలిచేందుకేనని అన్నారు. ఇటువంటి నిరసన లేకపోతే ప్రతీ పాఠశాల, కళాశాలలో ఇటువంటి దుస్థితి ఏర్పడుతుందన్నారు. విద్యార్థిని ఫిర్యాదుపై చర్య తీసుకోవడంలో విఫలమైనందుకు రాష్ట్ర విద్యా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై న్యాయ విచారణకు సీపీఐ(ఎం) నేత సురేష్ పాణిగ్రాహి పిలుపునిచ్చారు.
🚨 🚨 #BreakingNews Odisha Bandh Today, Roads Empty In Protest Over Student's Self-Immolation https://t.co/txmxD08kwB
The 20-year-old student of Fakir Mohan Autonomous College in Balasore attempted self-immolation last week after allegedly facing prolonged sexual harassment b…— Instant News ™ (@InstaBharat) July 17, 2025
బాలసోర్‌లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాలకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని తాను కళాశాల విభాగాధిపతి నుంచి దీర్ఘకాలంగా లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడింది. తరువాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. కాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మృతురాలి తండ్రితో మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఈ ఘటన సమాజానికి అయిన గాయంగా రాహుల్ అభివర్ణించారు.