
న్యూఢిల్లీ: ఉరుకులు పరుగుల జీవితంలో నఖశిఖపర్యంతం మనిషికి ఎన్నో ఆరోగ్య సమస్యలు. అన్ని ఆరోగ్య సమస్యలు అవతలి వాళ్లకు చూడగానే కనిపించవు. కానీ జుట్టు సరిగాలేకపోయినా, జుట్టు ఊడిపోయినా ఎదుటి వాళ్లు ఇట్టే కనిపెడతారు. జుట్టు రాలిపోయే సమస్యకు ఇప్పుడు ఎంతో మంది వందల రూపాయలు ఖర్చుపెట్టి ఎన్నో రకాల ఖరీదైన షాంపూలు ఉపయోగిస్తున్నారు.
అయితే ప్రత్యేకంగా ఎలాంటి ఖర్చుపెట్టకుండానే జుట్టు రాలే సమస్యను గంజితో పరిష్కరించుకోవచ్చని పలువురు నిపుణులు చెబుతున్నారు. చైనా, జపాన్‌లలో శతాబ్దాలుగా గంజిని జుట్టు పోషణ కోసం విరివిగా ఉపయోగిస్తున్నా భారత్‌లో గంజి వినియోగం అంతంతే. ఈ నేపథ్యంలో గంజిని వృథాగా పారబోయకుండా ఒత్తయిన జుట్టు కోసం సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జుట్టు కుదుళ్లు బలంగా ఉండేందుకు జపాన్, చైనాలో గంజిని ఉపయోగిస్తారు.
గంజి వాడకంతో జుట్టు ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు వెంట్రుకల కొనలు పగిలిపోవడంలాంటివి బాగా తగ్గుతాయి. గంజి వినియోగంతో జుట్టు మరింతగా మెరుస్తూ, పొడవు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. గంజిలో బి–విటమిన్, ఇ–విటమిన్‌తోపాటు ఐనోసైటోల్, నియాసినమైడ్ వంటి కీలకమైన అమ్లాలు ఉంటాయి. ఇవన్నీ జుట్టు పోషణకు ఎంతో మేలుచేకూరుస్తాయి. పాడైన జుట్టును రిపేర్ చేయడంలో ఐనోసైటోల్, నియాసినమైడ్‌లు కీలకపాత్ర పోషిస్తాయి.
శతాబ్దాలుగా వినియోగం
గంజితోపాటు చాలా సేపు బియ్యాన్ని నానబెట్టడం ద్వారా వచ్చే నీరు కూడా జుట్టుకు ఎంతో మేలుచేస్తుంది. బియ్యాన్ని ఉడకబెట్టాక గిన్నెలోకి వొంపే గంజిలో అత్యావశ్యకమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, కొంతమేర అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఈ గంజిని జుట్టుకు పట్టిస్తే కేశనాళికలు బలంగా మారతాయి. అమైనో యాసిడ్‌లు, ప్రోటీన్ల కారణంగా జుట్టు బలంగా తయారవుతుంది. జుట్టు పట్టులాగా మృదువుగా మారుతుంది. జుట్టు రాలడం తగ్గిపోతుంది. వెంట్రుక మందం సైతం పెరుగుతుంది.
గంజిలో ఉండే ఐనోసైటోల్ అనే కార్బోహైడ్రేడ్ ఇందుకు చాలా దోహదంచేస్తుంది. ఐనోసైటోల్ కారణంగా కేశాలు మరింత దృఢంగా మారతాయి. కేశాల మరమ్మతు, పెరుగుదలకు ఐనోసైటోల్ బాగా పనికొస్తుంది. గంజిలోని సిసీŠట్‌న్, మిథియోనైన్‌లు జుట్టును బలంగాచేస్తాయి. దాంతో జుట్టు అంత త్వరగా కొనలు విరిగిపోవు. చిట్లిపోవడం వంటి సమస్యలు బాగా తగ్గుతాయి. ఆరోగ్యవంతమైన, అందమైన జుట్టుకు ఈ అమైనా యాసిడ్‌లు భరోసా ఇస్తాయి. ప్రాచీన జపాన్‌లోనూ మహిళలు గంజిని విరివిగా ఉపయోగించారని తెలుస్తోంది.
చైనాలోని హువాంగ్లూ గ్రామంలో యావో మహిళల జుట్టు పొడవుగా, బలంగా, అందంగా ఉంటుంది. గంజితో జుట్టును శుభ్రం చేసుకోవడం వల్లే తమ కేశాలు ఇలా ఆరోగ్యంగా ఉన్నాయని వాళ్లు చెప్పారు. గంజిలోని గొప్పదనాన్ని ఇప్పటికే కనిపెట్టిన కొన్ని బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తులను గంజి ఆధారంగా తయారుచేసి మార్కెట్లోకి తెస్తున్నాయి. హెయిర్ మాస్‌్కలు, కండీషనర్లు ఇలా కేశ సంబంధ ఉత్పత్తుల్లో ఇప్పుడు ప్రధాన సరుకు గంజే.
గంజిని ఎలా వాడాలి?
రోజూ వంటలోకి వండుకున్నట్లే బియ్యాన్ని ఏమాత్రం దుమ్ము, ధూళి, మట్టిలేకుండా చక్కగా జల్లెడ పట్టుకున్నాక నీళ్లుపోసి బియ్యాన్ని ఉడకబెట్టుకోవాలి. చిక్కని గంజిని తర్వాత గిన్నెలోకి ఒంపుకోవాలి. ఈ గంజిని వెంటనే జుట్టుకు పట్టించకూడదు. గది ఉష్ణోగ్రత వద్ద కనీసం 24 నుంచి 48 గంటలపాటు అలాగే పాత్రలోనే ఉంచాలి. పాత్రపై మూత బదులు వస్త్రంతో కప్పి కొనల వెంట రబ్బర్‌తో చుట్టాలి. ఇలా ఒకటి, రెండు రోజులు పులియబెట్టాక నేరుగా జుట్టుకు పట్టించండి. నెమ్మదిగా కుదుళ్ల వద్ద మసాజ్ చేయండి.
దీంతో గంజి జుట్టుకు సమంగా అంటుకుంటుంది. రక్తప్రసరణ సైతం సరిగా అవుతుంది. తలస్నానం చేశాక కూడా జుట్టు ఆరిన తర్వాత ఇలా గంజి పట్టించవచ్చు. ఒక 20 లేదా 30 నిమిషాల తర్వాత సాధారణ నీటితో జుట్టు కడుక్కుంటే సరిపోతుంది. వారానికి కనీసం రెండు సార్లు ఇలా చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. అతిగా వాడితే మాత్రం దురద వంటి కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాంటప్పుడు వైద్యుల సలహాతో ఈ చిట్కాను కొనసాగించవచ్చు.