నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు? | Sakshi
Sakshi News home page

నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు?

Published Sat, Oct 9 2021 4:04 AM

Not satisfied with UP govt probe in Lakhimpur Kheri case - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్‌ ఖేరి ఘటనపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నిందితులను ఇప్పటివరకూ ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీసింది. ఇతర హత్యల కేసుల్లోనూ నిందితుల పట్ల ఇలాగే వ్యవహరిస్తున్నారా? సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అని ఘాటుగా ప్రశ్నించింది. ఈ ఘటనపై వేరే దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలా వద్దా అనేది తర్వాత నిర్ణయిస్తామని, అప్పటిదాకా ఆధారాలను భద్రంగా ఉంచాలని డీజీపీకి కోర్టు మాటగా చెప్పాలని యూపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదికి సూచించింది. లఖీమ్‌పూర్‌ ఖేరి ఘటనను సుమోటోగా స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమా కోహ్లీతో ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.

యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే వాదనలు వినిపించారు. ప్రధాన నిందితుడికి సమన్లు జారీ చేశామని చెప్పారు.  8 మంది మృతికి కారణమైన ఘటనలో సాధారణంగా నిందితులను వెంటనే అరెస్టు చేయాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. బాధితుల శరీరాల్లో బుల్లెట్‌ గాయాలు లేవని పోస్టుమార్టం నివేదికలో తేలినట్లు హరీష్‌ సాల్వే చెప్పగా..  ఇదే కారణంతో అరెస్టు చేయలేదా? అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.   సున్నితమైన అంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని సీజేఐ తెలిపారు. దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ చేపడతామంటూ అక్టోబర్‌ 20కి ధర్మాసనం వాయిదా వేసింది.  కాగా, లఖీపూర్‌ ఖేరి ఘటన మృతుల కుటుంబాలను జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కలుస్తారంటూ ఓ ఆంగ్ల పత్రిక ట్వీట్‌ చేయడంపై సీజేఐ స్పందిస్తూ.. మీడియా స్వేచ్ఛను తాము గౌరవిస్తామని, అదేసమయంలో ఈ రకంగా చేయడం సరికాదని  హితవు పలికారు. ప్రస్తుతం కోర్టులో ఉన్న తాను లక్నోకు ఎలా వెళ్లగలని ప్రశ్నించారు.

మిశ్రాను తొలగించకపోతే 18న రైల్‌ రోకో: కిసాన్‌మోర్చా
లఖీమ్‌పూర్‌ ఖేరి ఘటనలో నిందితుడైన ఆశిష్‌ మిశ్రా తండ్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్రాను ఈ నెల 11వ తేదీలోగా పదవి నుంచి తొలగించకపోతే 18న రైల్‌ రోకో చేపడతామని సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) ప్రకటించింది. లఖీమ్‌పూర్‌ ఖేరి ఘటనలో నిందితులను వారం రోజుల్లోగా అరెస్టు చేయకపోతే ప్రధాని మోదీ నివాసాన్ని దిగ్బంధిస్తామని దళిత నేత, ఆజాద్‌ సమాజ్‌ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ హెచ్చరించారు. ఆశిష్‌ను అరెస్టు చేసేదాకా నిరాహార దీక్ష కొనసాగిస్తానని పంజాబ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ చెప్పారు. ఆయన శుక్రవారం నిరాహార దీక్ష ప్రారంభించారు.

సమన్లకు స్పందించని ఆశిష్‌
శుక్రవారం విచారణకు హాజరు కావాలంటూ యూపీ పోలీసులు జారీ చేసిన సమన్లకు ప్రధాన నిందితుడు ఆశిష్‌ మిశ్రా స్పందించలేదు. దీంతో శనివారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ పోలీసులు తాజాగా నోటీసు జారీ చేశారు.  ఆశిష్‌  అనారోగ్యం కారణంగా శుక్రవారం పోలీసుల విచారణకు రాలేకపోయాడని అజయ్‌కుమార్‌ మిశ్రా చెప్పారు.  కాగా, లఖీమ్‌పూర్‌ ఖేరిని ప్రతిపక్ష నేతలు సందర్శిస్తుండడం పట్ల యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ వ్యంగ్యంగా స్పందించారు. వారిది రాజకీయ పర్యాటక కార్యక్రమం(పొలిటికల్‌ టూరిజం) అని ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement