ఆ వ్యాపారంలో లేం: రిలయన్స్‌

No plans to buy agricultural land for corporate and contract farming - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కార్పొరేట్‌ లేదా కాంట్రాక్ట్‌ వ్యవసాయ వ్యాపారంలో తాము లేమని రిలయన్స్‌ సంస్థ స్పష్టం చేసింది. పంజాబ్‌లో తమ జియో సంస్థ టెలికం టవర్ల ధ్వంసం వెనుక స్వార్థ ప్రయోజనాలను ఆశిస్తున్న శక్తులున్నాయని ఆరోపించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు తమ టవర్లను ధ్వంసం చేయకుండా అడ్డుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతూ పంజాబ్, హరియాణా హైకోర్టులో రిలయన్స్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

‘మా గ్రూప్‌ సంస్థలు ఒప్పంద వ్యవసాయ రంగంలో లేవు. భవిష్యత్తులో ప్రవేశించాలన్న ఆలోచనా లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడా మేం  వ్యవసాయ భూమిని కొనలేదు’ అని పిటిషన్‌లో రిలయన్స్‌ పేర్కొంది. సంస్థకు చెందిన రిటెయిల్‌ యూనిట్లు ఆహార ధాన్యాలు సహా నిత్యావసరాలను అమ్ముతాయన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా రిలయన్స్‌ స్పష్టత ఇచ్చింది. తాము రైతుల నుంచి నేరుగా ఆహార ధాన్యాలను కొనుగోలు చేయమని వివరించింది. పంజాబ్‌లో ఉన్న 9 వేల జియో టవర్లలో దాదాపు 1,800 టవర్లు ధ్వంసమయ్యాయి. రైతుల పంటలకు న్యాయమైన, లాభదాయకమైన ధరలు లభించాలన్న డిమాండ్‌కు తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు రిలయన్స్‌ పేర్కొంది.   

ఆ అఫిడవిట్లో అన్నీ అబద్ధాలే
హైకోర్టులో రిలయన్స్‌ సమర్పించిన అఫిడవిట్లో అన్నీ అబద్ధాలే ఉన్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. వ్యాపార ప్రయోజనాలను కాపాడుకునేందుకే ఆ సంస్థ ఈ పిటిషన్‌ వేసిందని ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్‌‡్ష కోఆర్డినేషన్‌ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) విమర్శించింది. మహారాష్ట్రలో, దేశంలోని పలు ప్రాంతాల్లో రిలయన్స్‌ భూములను కొనుగోలు చేసిందని పేర్కొంది.  భూములను రైతులకు వెనక్కు ఇచ్చాక కోర్టును ఆశ్రయించాలని రిలయన్స్‌కు సూచించింది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top