బిహార్‌ రాజకీయాల్లో పుకార్లు... రాష్ట్రపతిగా నితీశ్‌?

Nitish Kumar Opposition Candidate For President - Sakshi

నవాబ్‌ మాలిక్‌ వ్యాఖ్యలతో ఊహాగానాలు

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌ భారత రాష్ట్రపతి కాబోతున్నారా? అసలు ఆ పదవికి నితీశ్‌ సరిపోతారా? అనే ప్రశ్నలు మంగళవారం బిహార్‌ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. ప్రస్తుత రాష్ట్రపతి కోవింద్‌ పదవీ కాలం కొద్ది నెలల్లో ముగియబోతున్న నేపథ్యంలో రాష్ట్రపతిగా నితీశ్‌ అనే వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీలోని రాష్ట్రపతి పదవికి పట్నాలోని నితీశ్‌ కుమార్‌ను ముడివేయడానికి ముంబైలో బీజం పడింది.

నితీశ్‌ రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తే తమ పార్టీ మద్దతునిస్తుందని ఎన్‌సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ వ్యాఖ్యానించారు. అయితే ముందుగా నితీశ్‌ బీజేపీతో మైత్రి వదులుకోవాలని సూచించారు. దీంతో నిప్పు లేనిదే పొగరాదన్నట్లు నితీశ్‌ను రాష్ట్రపతిగా చేసే యత్నాలు ఆరంభమయ్యాయని బిహార్‌ నేతలు భావిస్తున్నారు. ఈ విషయమై నితీశ్‌ను మీడియా ప్రశ్నించగా, అసలు అలాంటి ఆలోచనే తనకు లేదని చెప్పారు. నితీశ్‌ మిత్రపక్షం బీజేపీ కూడా ఈ విషయమై ఎలాంటి కామెంట్లు చేయలేదు. కోవింద్‌ పదవీ కాలం జూలైలో ముగుస్తుంది. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజీలో పార్లమెంట్‌ ఉభయసభల సభ్యులతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు కూడా ఉంటారు. లోక్‌సభలో బీజేపీకి భారీ మెజార్టీ ఉన్నా, రాష్ట్రపతిగా తనకు నచ్చిన అభ్యర్ధిని ఎన్నిక చేయాలంటే బీజేపీకి ఇతర పార్టీల మద్దతు అవసరం. అందుకే నితీశ్‌ లాంటి క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న వ్యక్తిని బీజేపీ నిలబెట్టవచ్చని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. 

మిశ్రమ స్పందన 
నితీశ్‌ సొంతపార్టీ నేతలు తాజా ఊహాగానాలపై సంతోషం ప్రకటించగా, బద్ద శత్రువైన లాలూకు చెందిన ఆర్‌జేడీ నేతలు ఈ విషయమై మిశ్రమ స్పందన వెలిబుచ్చారు. హత్యకేసులో నిందితుడిని రాష్ట్రపతి కుర్చీలో ఎలా కూర్చోబెడతారని లాలూ పెద్ద కొడుకు తేజ్‌ ప్రతాప్‌ ప్రశ్నించారు. ఎప్పటికైనా తన తండ్రి లాలూ ప్రధాని అవుతాడన్నారు. అయితే ఒక బిహారీగా నితీశ్‌ రాష్ట్రపతి అయితే సంతోషిస్తామని ఆర్‌జేడీ నేత మృత్యంజయ్‌ తివారీ చెప్పారు. గత రెండు దఫాల రాష్ట్రపతి ఎన్నికల్లో నితీశ్‌ సొంత కూటమికి వ్యతిరేకంగా నిలబడిన అభ్యర్థులకు మద్దతునిచ్చాడని ఆర్‌జేడీ నేత శక్తియాదవ్‌ గుర్తు చేశారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన నితీశ్‌ను రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కలిసి చర్చించడాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తూ, పీఆర్‌ ఏజెన్సీ అండతో ఎవరైనా రాష్ట్రపతి గద్దెనెక్కితే దేశ పరిస్థితి ఇబ్బందుల్లో పడుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి పదవికి నితీశ్‌ సరిపోతారని బిహార్‌ మాజీ సీఎం జితన్‌రామ్‌ మాంజీ అభిప్రాయపడగా, ఎల్‌జేపీ నేత చిరాగ్‌ పాశ్వాన్‌ మాత్రం నితీశ్‌పై నిప్పులు చెరిగారు.  

బీజేపీ వ్యతిరేక కూటమి? 
దేశంలోబీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసే యత్నాలు ఆరంభమయ్యాయని మాలిక్‌ అన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌తో సమావేశమయ్యారన్నారు. వీరితో అరవింద్‌ కేజ్రీవాల్, మమతా బెనర్జీలను కలిపి ఐక్య కూటమి నిర్మించాలన్నది ప్రతిపక్ష ప్రణాళిక అని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీరితో నితీశ్, నవీన్‌ పట్నాయక్‌ చేరితే కూటమి మరింత బలోపేతమవుతుందని వీరి విశ్లేషణ. కానీ కూటమిలో కాంగ్రెస్‌ను చేర్చుకోవడంపైనే ప్రతిపక్షాల్లో విబేధాలున్నాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top