
బెంగళూరు: దక్షిణాదికి మరిన్ని వందేభారత్ రైళ్లు రానున్నాయి. ఇవి కర్నాటకలోని బెలగావితో పూణే, హైదరాబాద్‌లను అనుసంధానించనున్నాయి. ఈ కొత్త రైళ్లు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలోని ప్రధాన నగరాలకు రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనున్నాయి.
భారతీయ రైల్వే పూణే నుండి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇది బెలగావి, షెగావ్, వడోదర, సికింద్రాబాద్ (హైదరాబాద్) లకు కనెక్టివిటీని పెంచనున్నాయి. ప్రస్తుతం రెండు వందే భారత్ రైళ్లు పూణే నుండి నడుస్తూ, కొల్హాపూర్ హుబ్బళ్లి మార్గాలకు సేవలు అందిస్తున్నాయి. త్వరలో మరో నాలుగు అదనపు రైళ్లను ప్రవేశపెట్టాక పూణే నుండి బయలుదేరే మొత్తం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య ఆరుకు చేరనుంది.
కర్నాటకలోని కలబుర్గి నుంచి పూణే- హైదరాబాద్ మధ్య నడిచే కొత్త వందే భారత్ రైలు మహారాష్ట్ర, కర్ణాటక తెలంగాణలోని ప్రధాన నగరాలను కలపనుంది. కర్నాటకలోని బెలగావి ప్రజలు చాలా కాలంగా హుబ్బళ్లి-బెలగావి-పుణే మార్గంలో రోజువారీ సెమీ-హై-స్పీడ్ రైలును నడపాలని కోరుతున్నారు. ప్రస్తుతం వారానికి మూడుసార్లు నడపబోయే ఈ కొత్త వందే భారత్ రైలు ఈ డిమాండ్‌ను తీర్చనుంది. పూణే-షెగావ్ వందే భారత్ రైలు దౌండ్, అహ్మద్‌నగర్, ఛత్రపతి సంభాజీనగర్ జల్నాలలో ఆగనుంది. మహారాష్ట్రలోని ప్రసిద్ధ గజానన్ మహారాజ్ ఆలయాన్ని సందర్శించే పర్యాటకులకు ఈ రైలు సౌకర్యవంతంగా ఉండనుంది.
అలాగే పూణే-వడోదర మధ్య నడవబోయే రైలు మహారాష్ట్ర గుజరాత్ మధ్య వేగవంతమైన కనెక్టివిటీని ఏర్పరుస్తుంది. ఈ రైలు మహారాష్ట్ర, గుజరాత్ మధ్య వాణిజ్యం, పర్యాటకాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. వందేభారత్ రైళ్లలో సౌకర్యవంతమైన సీటింగ్, ఆటోమేటిక్ డోర్లు, వైఫై యాక్సెస్, ఆధునిక టాయిలెట్లు మెరుగైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. కాగా ఈ కొత్త వందేభారత్ రైలు సేవల అధికారిక షెడ్యూల్‌ను రైల్వే శాఖ ఇంకా ధృవీకరించలేదు. త్వరలోనే దీనిపై ప్రకటన రావచ్చని సమాచారం.