భోపాల్: సుమారు 50 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల లక్కు లక్కలా అతుక్కుంది. కొన్నేళ్ల క్రితం యాభై మంది బ్యూరోక్రాట్లు ఒకే ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ భూమి విలువ పెట్టిన పెట్టుబడితో పోలిస్తే 11 రెట్లు పెరిగింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లోని కోలార్ ప్రాంతానికి సమీపంలో గురాడి ఘాట్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని 2022 ఏప్రిల్‌లో ఒకే రోజు 50 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రూ. 5.5 కోట్లకు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన భూమిని భవిష్యత్తులో ప్లాట్లుగా మార్చాలని నిర్ణయించారు.
భూమి కొనుగోలు చేసిన వారిలో ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానా కేడర్‌కు చెందిన అధికారులు ఉన్నారు. కొనుగోలు చేసిన 16 నెలల తర్వాత, అంటే 2023 ఆగస్టులో మధ్యప్రదేశ్ కేబినెట్ రూ. 3,200 కోట్లతో వెస్ట్రన్ బైపాస్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కీలక నిర్ణయం తీసుకుంది. కొనుగోలు సమయంలో ఆ భూమి వ్యవసాయ భూమి. కానీ బైపాస్ ఆమోదం వచ్చిన 10 నెలల్లోపే ఆ భూమి నివాస ప్రాంతంగా మార్చారు. ఫలితంగా వ్యవసాయ భూమి ధరతో పోలిస్తే నివాస ప్రాంతం ధర అనేక రెట్లు ఎక్కువగా ఉండటంతో ఆ భూమి విలువ దాదాపు 11 రెట్లు పెరిగింది.
భూమి నివాస ప్రయోజనాల కోసం విభజించినప్పటికీ, ఇప్పటివరకు అక్కడ ఎలాంటి హౌసింగ్ సొసైటీ అభివృద్ధి కాలేదు. సాధారణ ప్రక్రియ ప్రకారం, మొదట ప్లాట్లు కేటాయించాలి లేదా భూమిని రిజిస్టర్డ్ సొసైటీకి బదిలీ చేయాలి. కానీ ఇలాంటివి చేయకుండా నిబంధనలను ఉల్లంఘించి వ్యవసాయ భూమిని నివాస ప్రాంతంగా మార్చారు. 2022 ఏప్రిల్ 4న ఒకే రిజిస్ట్రేషన్ పత్రం ద్వారా 2.023 హెక్టార్ల వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ లావాదేవీలో 50 మంది షేర్‌హోల్డర్లు కలసి ఆస్తిని సొంతం చేసుకున్నారు. భూమి రూ. 5.5 కోట్లకు రిజిస్టర్ చేయబడింది. అయితే ఆ సమయంలో దాని మార్కెట్ విలువ రూ. 7.78 కోట్లుగా ఉందని దైనిక్ భాస్కర్ నివేదించింది.
ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంత, కుటుంబ సభ్యుల లేదా బినామీ పేర్లలో ఉన్న స్థిర ఆస్తుల (భూమి, ఇల్లు) వివరాలను ప్రతి సంవత్సరం జనవరి 31లోపు ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ ప్రక్రియలో (IPR) ఐదు ఎకరాల భూమిని 50 మంది బ్యూరోక్రాట్లు కొనుగోలు చేసినట్లు చూపించినా, ఆ భూమి మొత్తం 41 మంది పేర్లలోనే ఉందని రికార్డులు వెల్లడించాయి. పదహారు నెలల తర్వాత, 2023 ఆగస్టు 31న మధ్యప్రదేశ్ కేబినెట్ రూ. 3,200 కోట్ల వెస్ట్రన్ బైపాస్ ప్రాజెక్టును ఆమోదించింది. ప్రతిపాదిత మార్గం ఆ భూమి నుండి 500 మీటర్ల దూరంలోనే వెళ్లనుందని సమాచారం.
2022లో ఈ ఐదు ఎకరాల భూమి చదరపు అడుగుకు దాదాపు రూ. 81.75 రేటుకు కొనుగోలు చేశారు. 2024 జూన్‌లో భూమి వినియోగం మారిన తర్వాత రేటు చదరపు అడుగుకు రూ. 557కు పెరిగింది. 2026 నాటికి ప్రస్తుత మార్కెట్ రేటు చదరపు అడుగుకు రూ. 2,500 నుండి రూ. 3,000 మధ్య ఉంది. అందువల్ల ఆ భూమి మార్కెట్ విలువ రూ. 55 కోట్ల నుండి రూ. 65 కోట్ల మధ్యగా ఉందని అంచనా.


