నితీశ్‌ కుమార్ రాజీనామా.. కొత్త సీఎం ఆయనేనా? | NDA party to elect Bihar CM | Sakshi
Sakshi News home page

నితీశ్‌ కుమార్ రాజీనామా.. కొత్త సీఎం ఆయనేనా?

Apr 14 2026 7:22 AM | Updated on Apr 15 2026 4:32 PM

NDA party to elect Bihar CM

పాట్నా: బిహార్‌ సీఎం ఎవరు అనే అంశం నేడు తేలనుంది. ఈ రోజు ఏన్డీఏ కూటమి అధికారిక సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ఈ అంశమై ఇదివరకే కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్ ‍చౌహాన్‌ని పరిశీలకుడిగా బీజేపీ పార్టీ నియమించింది. అయితే ఆ రాష్ట్రానికి ఎంతో కాలంగా ముఖ్యమంత్రిగా సేవలందించిన నితీశ్ కుమార్ ఈ రోజు సీఎం పదవికి  రాజీనామా చేయనున్నారు.

బిహార్‌ రాష్ట్రంలో నూతన శకం ఆవిష్కృతం కాబోతుంది. బీజేపీ నాయకుడు తొలిసారిగా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ అంశమై నేడు జరిగే ఎన్డీఏ సమావేశంలో శాసన సభ పక్ష నేతను ఎన్నుకుంటారు. అనంతరం రేపు (బుధవారం) కొత్త  పార్టీ ఎన్నుకున్న అభ్యర్థి  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 

తప్పుకోనున్న నితీశ్

బిహార్‌ రాజకీయాల్లో నితీశ్ కుమార్ తనదైన ముద్ర వేశారు. సీఎంగా దాదాపు 10 సార్లు ప్రమాణ స్వీకారం చేసి ఆ రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సాధించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా వెళ్లనున్నారు. దీంతో జేడీయూ నేతలు ఒకింత భావోద్వేగానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. అయితే గతేడాది జరిగిన ఎన్నికల్లో ఆరాష్ట్రంలోని 243 సీట్లకు 202 స్థానాలు సాధించి ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ 89 సీట్లు, జేడీయూ 85 స్థానాలు సాధించింది. దీంతో బిహార్‌ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ ప్రస్తుతం రాజీనామా చేయనున్నారు.

ముఖ్యమంత్రి రేసులో?

బిహార్ ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి  బీజేపీ నేత సామ్రాట్‌ చౌదరి. 1990లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన సామ్రాట్ చౌదరి.. 2000లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో పర్బత్తా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై రబ్రీ దేవి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు. అనంతరం ప్రభుత్వ విఫ్‌గా 2014లో ఆర్జేడీ పార్టీ తిరుగుబాటు వర్గంలో చేరి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని జనతా దళ్(యూ)లో చేరి 2 జూన్ 2014న పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2023లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు.  చాలా వరకూ సామ్రాట్‌ చౌదరినే సీఎంగా ఎన్నుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరోవైపు దళిత నేతను సీఎంగా ఎన్నుకునే అవకాశాలు లేకపోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement