ట్రాఫిక్ ప్ర‌మాదాల్లో రోజుకు 546 మంది మృతి | NCRB data: 546 die every day in traffic accidents full details | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్ ప్ర‌మాదాల్లో రోజుకు 546 మంది మృతి

May 8 2026 7:08 PM | Updated on May 8 2026 7:39 PM

NCRB data: 546 die every day in traffic accidents full details

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్ల‌డి

న్యూఢిల్లీ: న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు అనే తేడా లేకుండా ప్ర‌తిచోట ఇప్ప‌డు ట్రాఫిక్ అనేది సాధార‌ణంగా మారిపోయింది. వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండ‌డంతో ట్రాఫిక్ స‌మ‌స్య కూడా ఎక్కువ అవుతోంది. దీంతో పాటు ప్ర‌మాదాలు కూడా అధిక‌వుతున్నాయి. దేశంలో సగటున ప్రతిరోజూ ట్రాఫిక్ సంబంధిత ప్రమాదాల్లో 546 మంది మరణిస్తున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తాజాగా వెల్ల‌డించింది. ఏటేటా ఎగ‌బాకుతున్న రోడ్డు ప్ర‌మాదాలతో పాటు ట్రాఫిక్ సంబంధ యాక్సిడెంట్లు కూడా ఎక్కువ కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

2024లో ట్రాఫిక్ ప్రమాదాల్లో 1.99 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్టు ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. 2023తో  పోలిస్తే మ‌ర‌ణాల సంఖ్య‌ 0.79 శాతం పెరిగిందిని వెల్ల‌డించింది. 2023లో 1.98 లక్షల మంది మ‌ర‌ణించారు. ట్రాఫిక్ ప్ర‌మాదాలు కూడా పెరిగాయి. 2024లో 4.95 లక్షల ప్ర‌మాదాలు జ‌ర‌గ్గా, 2023లో 4.91 లక్షల యాక్సిడెంట్లు న‌మోద‌య్యాయి. ట్రాఫిక్ ప్ర‌మాదాలు కార‌ణంగా 2024లో 4.52 లక్షల మంది క్ష‌త‌గాత్రుల‌య్యారు.

ఆ మూడు రాష్ట్రాల్లోనే ఎక్కువ‌
ట్రాఫిక్ ప్ర‌మాదాల మ‌ర‌ణాల్లో ఉత్తర ప్రదేశ్ (27,071), తమిళనాడు (20,390), మహారాష్ట్ర (19,475) మొద‌టి మూడు స్థానాల్లో ఉన్నాయి. మొత్తం మ‌ర‌ణాల్లో ఈ మూడు రాష్ట్రాల్లో 33.6 శాతం న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఉత్తర ప్రదేశ్‌లో 13.6 శాతం, తమిళనాడులో 10.2 శాతం, మహారాష్ట్రలో 9.8 శాతం మ‌ర‌ణాలు సంభ‌వించిన‌ట్టు ఎన్‌సీఆర్‌బీ త‌న నివేదికలో పేర్కొంది.  

ట్రాఫిక్ మ‌ర‌ణాలే అత్య‌ధికం
ప్ర‌మాదాల వివరాల సేక‌ర‌ణ‌లో భాగంగానే ట్రాఫిక్ ప్ర‌మాదాల స‌మాచారాన్ని కూడా ఎన్‌సీఆర్‌బీ సేక‌రించింది. దేశ‌వ్యాప్తంగా సంభ‌వించిన మొత్తం ప్ర‌మాదాల్లో ట్రాఫిక్ సంబంధిత దుర్ఘ‌ట‌న‌ల‌ మరణాలు అత్య‌ధికంగా 42.6 శాతంగా న‌మోద‌య్యాయి. ఆకస్మిక మరణాలు (16.2 శాతం), ఇతర కారణాలు (15.9 శాతం), నీటిలో మునిగిపోవడం (8.6 శాతం), కిందపడటం (5.7 శాతం), విషప్రయోగం (4.6 శాతం), విద్యుదాఘాతం (3.4 శాతం), ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం (1.3 శాతం), ప్రకృతి వైపరీత్యాలు (1.7 శాతం) త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పైవాటిలో ప్రకృతి విప‌త్తులు మిన‌హా మిగ‌తావి నివారించ‌దగినవి.

రైలు ప్ర‌మాదాలు లేవు
2024లో నమోదైన 1.99 లక్షల ట్రాఫిక్ సంబంధిత మరణాలలో 88 శాతం (1.75 లక్షలు) రోడ్డు ప్రమాదాల వల్లే సంభవించాయని ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడిస్తోంది. ఈ కాలంలో ఎలాంటి రైలు ప్రమాదం నమోదు కాలేదు. అయితే, రైళ్ల నుంచి పడిపోవడం లేదా రైల్వే ట్రాక్‌లపై ప్రజలను ఢీకొనడం వల్ల 17,029 మంది మరణించగా, రైల్వే ప్రాంగణంలో పేలుళ్లు, అగ్నిప్రమాదాలు వంటి ఘటనల్లో 5,384 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా, రైల్వే క్రాసింగ్‌ల వద్ద జరిగిన ప్రమాదాల్లో 1,888 మరణాలు నమోదయ్యాయి.

టూవీల‌ర్ ప్ర‌మాదాలే ఎక్కువ‌
రోడ్డు ప్ర‌మాదాల్లో ద్విచక్ర వాహనదారులు (84,599 మరణాలు) ఎక్కువ‌గా ప్రాణాలు కోల్పోయారు. 25,769 పాద‌చారులు మ‌ర‌ణించారు. కారు ప్ర‌మాదాల్లో 23,739 మరణాలు సంభ‌వించాయి. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో అత్య‌ధికంగా త‌మిళ‌నాడులో 11,786 మంది చ‌నిపోయారు. ఉత్తర ప్రదేశ్‌లో 8,575 మరణాలు నమోదయ్యాయి. ఎస్‌యూవీ, కారు లేదా జీపు ప్రమాదాల వల్ల యూపీలో అధిక సంఖ్యలో 4,575 మంది మృతి చెందారు.

చ‌ద‌వండి: చోరీ వీడియో వైర‌ల్‌.. క‌ట్ చేస్తే స‌ర్‌ప్రైజ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement