దొంగతనాలకు సంబంధించిన వార్తలు మనం తరచుగా మీడియాలో చూస్తుంటాం. మనం ఇప్పుడు చెప్పుకోబోయే చోరీ ఘటన గురించి బహుశా ఎప్పుడు విని ఉండకవపోచ్చు. ఇదో విచిత్రమైన ఘటన. సాధారణంగా చీరల దుకాణాల్లో చోరీలు జరగడం, ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడం.. వైరల్ అవడం ఈ రోజుల్లో సర్వసాధారణ వ్యవహారంగా మారింది. మన చెప్పుకోబోయే చోరీ ఉదంతం కూడా ఇక్కడ వరకు ఇలాగే జరిగింది. కానీ తర్వాత జరిగిన పరిణామాలే విచిత్రంగా ఉన్నాయి.
వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని అంగుల్ జిల్లా కేంద్రంలో ఉన్న బోయనికా హాండ్లూమ్స్ అవుట్‌లెట్‌కు ఈనెల 2న నీట్‌గా ప్యాక్ చేసిన పార్సిల్స్ వచ్చాయి. వాటిని ఓపెన్ చేయగానే అక్కడున్న సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వాటిలో 7 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే 24 చీరలు ఉన్నాయి. బోయనికా సిబ్బంది అవాక్కాయింది వాటి విలువ చూసి కాదు. ఈ 24 చీరలు గత నెలలో తమ దుకాణం నుంచే చోరీకి గురైనవని తెలుసుకుని ముక్కున వేలేశుకున్నారు. దొంగతనం చేసిన వారే ఈ చీరలను తమకు తిరిగి పంపించారని తెలుసుకుని మరింత ఆశ్చర్యపోయారు. ఇలా కూడా జరుగుతుందా అని అవాక్కయ్యారు!
అసలేం జరిగింది?
టిప్‌టాప్‌గా తయారైన కొందరు మహిళలు బట్టలు కొనేందుకు ఏప్రిల్ 11న అనగుల్‌లో ఉన్న బోయనికా హాండ్లూమ్స్ అవుట్‌లెట్‌కు వచ్చారు. చాలా చీరలు చూశారు. చివరకు 1400 రూపాయలకు కుర్తా మాత్రమే కొని వెళ్లిపోయారు. తర్వాత పరిశీలిస్తే దుకాణంలో 25 చీరలు మాయమయినట్టు తేలింది. దీంతో సీసీ కెమెరాలు చెక్ చేయడంతో చీరల చోరీ బయటపడింది. అదే రోజు స్థానిక పోలీస్ స్టేషన్‌లో బోయనికా ఫిర్యాదు చేసి, సీసీ ఫుటేజీని పోలీసులకు అందజేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సీసీ ఫుటేజీని విడుదల చేయగా, ఇందులోని దృశ్యాలు వైరల్‌గా మారాయి.
ఈ నేపథ్యంలో చోరీ అయిన 25 చీరల్లో 24 శారీలు కొరియర్‌లో శనివారం బోయనికా హాండ్లూమ్స్ అవుట్‌లెట్‌కు అందాయి. చోరీ అయిన చీరలు తిరిగి రావడం పట్ల అవుట్‌లెట్ మేనేజర్ రష్మి రంజిత పట్నాయక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు నిందితులు తమ సిబ్బందిలో ఒకరికి ఫోన్ చేసి క్షమాపణ కూడా చెప్పారని వెల్లడించారు. ''తెలంగాణ చెందిన నిందితురాలు బిల్లు మీద ఉన్న నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని కోరారు. చీరల చోరీ వీడియో వైరల్ కావడంతో తమ ప్రాంతంలో తలెత్తుకుని తిరగలేపోతున్నామని వాపోయింద''ని తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతోనే నిందితులు తాము దొంగిలించిన చీరలను వెనక్కి పంపివుంటారని అన్నారు.
తిరిగిచ్చినా చర్యలు తప్పవు
కాగా, దొంగతనం చేసిన వస్తువులను తిరిగి ఇచ్చినంత మాత్రాన నేరం మాసిపోదని, కేసు నుంచి తప్పించుకోలేరని అంగుల్ పోలీసు అధికారి ప్రకాశ్ చంద్ర మాఝీ తెలిపారు. వారు చీరలను తిరిగి ఇచ్చినప్పటికీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఉదంతం గురించి విన్నవాళ్లందరూ.. అడుగు తొక్కనేల, కాళ్లు కడనేల సామెతను గుర్తు చేసుకుంటున్నారు.
If you remember the incident where a gang of women stole expensive sarees from Boyanika in Angul, Odisha…there is now a twist in the tale 🙂
The gang has couriered the sarees back to the showroom, fearing arrest.
Looks like police have identified the accused and traced their… pic.twitter.com/2k1EiCtv3o— Manas Muduli (@manas_muduli) May 5, 2026
బోయనికా గురించి..
బోయనికా అవుట్‌లెట్లను ఒడిశా ప్రభుత్వ చేనేత, వస్త్ర, హస్తకళల శాఖ నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని నైపుణ్యం గల నేత కార్మికులకు, వినియోగదారులకు వారధిగా నిలవాలనే లక్ష్యంతో 1956లో బోయనికాను ఒడిశా నెలకొల్పింది. నాణ్యమైన ఉత్పత్తులను ఇది పేరుగాంచింది. దీంతో బోయనికాలో దుస్తులు, హస్తకళల ఉత్పత్తులు కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రఖ్యాత సంబల్పురి, బొంకై చేనేత చీరలు, డ్రెస్ మెటీరియల్స్, షర్టులు, కుర్తాలతో పాటు గృహోపకరణాలు ఇందులో విక్రయిస్తుంటారు.
చదవండి: తమిళనాడులో విజయ్ గెలుపు.. ట్రెండింగ్‌లో అన్నామలై!


