చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే కూటమి ప్రభుత్వం పరాజయం పాలైంది. ద్వంద్వ పార్టీల సంప్రదాయానికి తమిళులు చరమగీతం పాడి మూడో ప్రత్యామ్నాయంగా వచ్చిన టీవీకే విజయ్‌వైపు మొగ్గుచూపారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు నిరాటంకంగా కొనసాగిన ద్రవిడ రాజకీయాలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ప్రత్యామ్నాయం కోసం తమిళ ప్రజలు ఎదురు చూస్తున్నారనే విషయాన్ని బీజేపీ నేత అన్నామలై ముందే పసిగట్టారని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఇదే అంశంపై ప్రముఖ జర్నలిస్ట్ స్మితా ప్రకాశ్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టడంతో చర్చ మొదలైంది.
“తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో అన్నామలై చెన్నైలో కాకుండా కొలంబోలో ఉండటం ఆసక్తికరంగా మారింది. విజయ్ ఈరోజు సాధించిన గెలుపు, 2024లో అన్నామలై ఊహించినదే. ఆయన దానిని ముందుగానే పసిగట్టారు, కానీ తమిళులు బీజేపీకి తమ విధేయతను మార్చుకోవడానికి సిద్ధంగా లేరు” అని ఎక్స్ పోస్ట్ పెట్టారు. దీనిపై అన్నామలై మద్దతుదారులు ఆయనకు సానుకూలంగా స్పందించారు. కాగా, ఆదివారం సాయంత్రం కొలంబోలో ఉన్న అన్నామలై.. సోమవారం ఎన్నికల ఫలితాల సమయానికి చెన్నైకు తిరిగి వచ్చినట్టు ఆమె మరో పోస్ట్ ద్వారా అప్‌డేట్ ఇచ్చారు.
బీజేపీ ఒంటరిగా పోటీచేసి వుంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని అన్నామలై మద్దతుదారులు వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలు మూడో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని రెండేళ్ల క్రితమే అన్నామలై పసిగట్టారని అంటున్నారు. డీఎంకే వ్యతిరేక ప్రచారాలు, పాదయాత్రలు, అవినీతి బట్టబయలు చేయడం ద్వారా తమిళనాడులో మార్పు కోసం ఉన్న ఆకాంక్షను అన్నామలై ముందుగానే గుర్తించారని చెబుతున్నారు. అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం.. క్షేత్రస్థాయి మద్దతు ఉన్న అన్నామలైని పక్కన పెట్టిందని ఆయన సానుభూతిపరులు అభిప్రాయపడ్డారు.
పొత్తుతో చిత్తు
'అన్నామలై గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే.. విజయ్ సక్సెస్ అయ్యారు' అన్నట్టుగా ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. ''తమిళనాడు ప్రజలు డీఎంకే, అన్నాడీఎంకేతో విసిగిపోయారని అన్నామలై ముందే చెప్పారు. ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయాలని సూచించారు. ఆయన మాటలను బీజేపీ అగ్రనాయకత్వం పెడచెవిన పెట్టింది. ఇప్పుడు విజయ్ సాధించిన విజయంతో అన్నామలై మాటలు నిజమయ్యాయ''ని ఒకరు పేర్కొన్నారు. అన్నామలై మూడేళ్లకు పైగా కష్టపడి డీఎంకే పార్టీకి వ్యతిరేకంగా సాగించిన పోరాటంతో విజయ్ ఫలితం పొందారని మరొకరు అభిప్రాయపడ్డారు. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని బీజేపీ తప్పు చేసిందని ఎక్కువ మంది పేర్కొన్నారు.
చదవండి: అన్నాడీఎంకే మాజీ నేతకు టీవీకే ప్రభుత్వంలో కీలక పదవి!
రిస్క్ తీసుకోవాలి
2024, ఫిబ్రవరి 16న జరిగిన పార్టీ సమావేశంలో అన్నామలై మాట్లాడిన వీడియోను తాజాగా వెలుగులోకి తెచ్చారు. 2026 ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాదు. కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుంది. తమిళనాడులో మొట్టమొదటి సారిగా ప్యూర్ అలయెన్స్ గవర్నమెంట్ ఏర్పడబోతోంది. ఈ రెండేళ్లలో పక్కా వ్యూహంతో ప్రణాళికాబద్దంగా పనిచేసి క్షేత్రస్థాయిలో నాయకులకు తయారు చేసి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడానికి 500 రోజుల ముందే 234 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలి. వారం, పది రోజుల అభ్యర్థులను ప్రకటిస్తే ప్రయోజనం ఉండదు. బీజేపీ రిస్క్ తీసుకుని ఈ విధంగా చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుందని అన్నామలై అప్పట్లో అన్నారు.
பிப்ரவரி 16, 2024.
சரியாக 2 வருடம் முன்பு அண்ணாமலை சொன்ன வார்த்தைகள் இன்று அச்சு பிசுறாமல் 200% அப்படியே நடந்துள்ளது.
பாஜகவின் வெற்றியை தடுத்து, ரிஸ்க் எடுக்கவும் உழைக்கவும் பயந்து இன்று தமிழக பாஜகவை ஒழித்தது யார்? @annamalai_k 🙇🏻🔥🔥 pic.twitter.com/FTFJERVEX9— ᴋᴀʀᴛʜɪ (@TwitzKarthi) May 5, 2026


