రైతులను మోసం చేస్తున్నారు 

Narendra Modi Comments On Opposition Parties About Farmers - Sakshi

ప్రతిపక్షాలపై ప్రధాని ధ్వజం

భూమి కోల్పోతారని రైతులను భయపెడ్తున్నారు 

కొత్త సాగు చట్టాలు చరిత్రాత్మకం,ప్రయోజనకరం 

ప్రధాని మోదీ పునరుద్ఘాటన 

ధోర్డొ(గుజరాత్‌): నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. రైతులను గందరగోళ పరిచే కుట్రకు విపక్షాలు తెర తీశాయని ఆరోపించారు. స్వార్థ ప్రయోజనాల కోసం రైతులను వాడుకుంటున్నారని మండిపడ్డారు. కొత్త సాగు చట్టాలు చరిత్రాత్మకమైనవని, రైతుకు ప్రయోజనం చేకూర్చేవని స్పష్టం చేశారు. చట్టాల్లో రైతులకున్న అన్ని అభ్యంతరాలను తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఇప్పడు ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీలన్నీ వ్యవసాయ సంస్కరణలకు మద్దతిచ్చినవేనని పేర్కొన్నారు. అయితే, వారు అప్పుడు ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నో రైతు సంఘాలు ఈ సంస్కరణలను అమలు చేయాలని కోరాయని గుర్తు చేశారు.

సొంత రాష్ట్రం గుజరాత్‌లో మంగళవారం ప్రధాని పర్యటించారు. కచ్‌ జిల్లాలో మూడు అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ప్రభుత్వ జోక్యం లేకుండా.. గుజరాత్‌లో పాడి, మత్స్య రంగాలు అభివృద్ధి చెందిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు. సహకార రంగం, రైతులే స్వయంగా ఈ రంగంలో వ్యాపారం సాగించారన్నారు. అలాగే, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ పాడి పరిశ్రమ ప్రభుత్వ జోక్యం లేకుండానే అభివృద్ధి చెందిందని ప్రధాని తెలిపారు. పాల ఉత్పత్తిదారులు, సహకార రంగం కలిసి అద్భుతమైన పంపిణీ వ్యవస్థను రూపొందించుకున్నాయన్నారు. అలాగే, పండ్లు, కూరగాయల విషయంలోనూ ప్రభుత్వ జోక్యం ఉండదని గుర్తు చేశారు.

రైతులను గందరగోళపర్చి, ఆందోళన బాట పట్టించే కుట్ర జరుగుతోందన్న విషయం వివరించడానికే ఈ ఉదాహరణలన్నీ చెబుతున్నానన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు అమలైతే.. తమ భూములను ఎవరో లాక్కుంటారన్న భయాన్ని రైతుల మనసుల్లో చొప్పిస్తున్నారని విమర్శించారు. ‘మీ భూమిలో పండే పండ్లు, కూరగాయల కొనుగోలుకు కాంట్రాక్ట్‌ తీసుకున్నవారు.. మీ భూమిని కానీ, ఆస్తులను కానీ ఎప్పుడైనా స్వాదీనం చేసుకున్నారా?.. పాలు అమ్ముతున్నారని మీ పాడి పశువులను పాడిపరిశ్రమ యజమానులు తీసుకువెళ్లారా!?’ అని ప్రశ్నించారు. పాడి రైతులు అనుభవిస్తున్న స్వేచ్ఛ ఇతర సన్న, చిన్నకారు రైతులకు ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నానన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ వేలాదిగా రైతులు గత 20 రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. గుజరాత్‌ పర్యటనలో భాగంగా ప్రధాని అక్కడి రైతులతో, స్వయం సహాయ బృందాలతో సమావేశమయ్యారు. కచ్‌ జిల్లాలో ఉంటున్న పంజాబీలు కూడా ఆ రైతుల్లో ఉన్నారు. పాక్‌ సరిహద్దుల్లోని కచ్‌ జిల్లాలో సుమారు 5 వేల పంజాబీ కుటుంబాలు వ్యవసాయం చేస్తున్నాయి.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top