ఎస్‌ఐఆర్‌పై దేశంలో ఒకపక్క దుమారం చెలరేగుతుండగా.. ఇంకోపక్క తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ఈ అంశంపై ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. బెంగళూరు (దక్షిణ) నియోజకవర్గ ఎంపీ తేజస్వీ సూర్యతో కలిసి ఆయన అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన చర్చలో శశిథరూర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ పేరుతో వివిధ రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లను తొలగించిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ కేరళలో తమకు లాభం చేకూర్చి ఉండవచ్చునని అన్నారు. బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఇటీవలే వెల్లడై ఓట్ల చోరీ అంశం మరోసారి చర్చనీయాంశమైన ప్రస్తుత తరుణంలో శశిథరూర్ వ్యాఖ్యలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.
బెంగాల్ ఎన్నికల ఫలితాలపై కూడా శశిథరూర్ వ్యాఖ్యానిస్తూ.. ‘అక్కడ సుమారు 91 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. వీరిలో 34 లక్షల మంది తాము ఓటింగ్‌కు అర్హులమని, జాబితాలో తమ పేర్లు చేర్చాలని అప్పీల్ చేశారు కూడా. అయితే ఒకొక్కరి వివరాలను పరిశీలించి చేర్చాల్సి ఉన్నందున వీరిలో కొన్ని వందల మందికి మాత్రమే మళ్లీ అవకాశం దక్కింది. ఫలితంగా సుమారు 31 నుంచి 32 లక్షల మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. బెంగాల్‌లో టీఎంసీ కంటే బీజేపీకి మధ్య ఓట్ల వ్యత్యాసం కూడా కొంచెం అటు ఇటుగా 30 లక్షలు కావడం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
#WATCH | San Francisco, USA: Speaking at the roundtable on 'India, That is Bharat: Growth Governance and Identity' at Stanford India Conference, Congress MP Shashi Tharoor says, "About the SIR... there are legitimate questions to answer. Look at the Bengal case. 91 lakh names… pic.twitter.com/QpysPZcVV1
— ANI (@ANI) May 10, 2026
ఓటర్ల జాబితాలో అవకతవకలను సవరించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ అభ్యంతరం పెట్టలేదని, డూప్లికేట్ ఓటర్లు, మరణించిన, వలస వెళ్లిన వారి పేర్లు తొలగించడం అవసరం కూడా అని ఆయన అన్నారు ఈ క్రమంలోనే కేరళలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ తమకు ఎలా ఉపయోగపడిందో వివరిస్తూ శశిథరూర్ ఏమన్నారంటే.. ‘వాస్తవానికి ఎస్‌ఐఆర్ అన్నది కేరళలో కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చి ఉండవచ్చు. ఎందుకంటే లెఫ్ట్ ప్రభుత్వం చాలాకాలంగా ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతోంది. ఒకే ఓటరు మూడు నాలుగు చోట్ల నమోదు చేసకోవడం, డూప్లికేట్ ఓటర్లు చాలామంది ఉన్నారు. వీరందరి తొలగింపు ఫలితంగా కాంగ్రెస్‌కు మెజార్టీ లాభించి ఉండవచ్చు’ అని అన్నారు.
కొందరిని ఒంటరి వాళ్లను చేశారు..
దేశంలో మైనార్టీ వర్గాలను ఒంటరులను చేయడం గత దశాబ్ద కాలంలో ఎక్కువైందని, బీజేపీ అగ్రనేతలు మొదలుకొని సామాన్యుల వరకూ మైనార్టీలను ఉగ్రవాదుల మాదిరిగా చూస్తూండటం దీనికి కారణమని శశిథరూర్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యతో తనకు వ్యక్తిగతంగా స్నేహం ఉన్నప్పటికీ బీజేపీ మార్కు రాజకీయాల విషయంలో మాత్రం తన వైఖరి నిక్కచ్చిగానే ఉంటుందని స్పష్టం చేశారు. గత దశాబ్ద కాలంలో ఈ దేశంలోని మైనార్టీలు తమ పట్ల ఎందుకింత వివక్ష ఏర్పడిందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. ‘మా పూర్వీకులు ఈ మట్టిలోనే కలిసిపోయారు. అయినా మమల్ని వేరుగా ఎందుకు చూస్తున్నారు’ అని వారు భావిస్తున్నారని, విభజన గాయాలను రెచ్చగొడుతూ మైనార్టీలను అణచివేసే ప్రయత్నం చేయడం ద్వారా బీజేపీ తప్పు చేస్తోందని వ్యాఖ్యానించారు.


