
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇదే సమయంలో కొండచరియలు విరిగిపడుతూ కొన్ని కుటుంబాలను సమాధి చేశాయి. ఇక్కడి కుంటారి లగాఫాలిలో కొండచరియలు విరిగిపడిన దరిమిలా రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఈ నేపధ్యంలో వారికి హృదయాలను కలచివేసే దృశ్యం కనిపించింది.
శిథిలాల కింద కూరుకుపోయిన కాంత దేవి(38) తన పదేళ్ల కవల పిల్లలను చేతులతో గట్టిగా పట్టుకుని అలానే ప్రాణాలు వీడింది. ఆ చిన్నారులు కూడా తల్లిని గట్టిగా పట్టుకున్నారు. దుర్ఘటన సమయంలో వారు ఒక చోట చిక్కుకుని కన్నుమూశారు. ఆ తల్లి చివరి క్షణం వరకూ తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చిందని ఈ హృదయవిదారక దృశ్యం తెలియజేస్తోంది.
కాంత దేవి భర్త కున్వర్ సింగ్ తమ ఇంటి శిథిల అవశేషాల కింద 16 గంటలపాటు విలవిలలాడి, తర్వాత రెస్క్యూ సిబ్బంది సాయంతో సజీవంగా బయటపడ్డాడు. ఇప్పుడు అతనికి కుటుంబమూ లేదు. ఇల్లూ లేదు. దుఃఖం ఒక్కటే మిగిలింది. అతని పరిస్థితి తెలుసుకున్న వారంతా కంటతడి పెట్టుకుంటున్నారు. కొండచరియలు విరిగిపడిన ఈ ప్రాంతంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్)లు కట్టర్ యంత్రాలతో టన్నుల కొద్దీ శిథిలాలను తవ్వుతూ 32 గంటలపాటు శ్రమించాయి.
గ్రామంలోని కొన్న కుటుంబాలు శిథిలాల కింద సమాధి అయ్యాయి. స్థానికంగా ఉంటున్న సుబేదార్ మేజర్ దిల్బార్ సింగ్ రావత్ తన భార్య కళ్ల ముందే మృతిచెందాడు. ప్రమాదం గురించి తోటివారిని హెచ్చరించిన నరేంద్ర సింగ్ కొండచరియలు విరిగిపడిన కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతని హెచ్చరిక చాలా మందిని కాపాడింది. ప్రణాళిక లేని నిర్మాణాల కారణంగా విపత్తు మరింతగా పెరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు.