ట్రోలింగ్‌ చేయడం సరికాదు.. మంత్రి కీర్తన ఆవేదన | Minister Keerthana reacts to criticism of her response | Sakshi
Sakshi News home page

ట్రోలింగ్‌ చేయడం సరికాదు.. మంత్రి కీర్తన ఆవేదన

May 25 2026 7:06 AM | Updated on May 25 2026 8:27 AM

Minister Keerthana reacts to criticism of her response

సాక్షి, చైన్నె: ‘నేను సహజంగా నవ్విన నవ్వును కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు... దానికి రాజకీయ రంగు పూసి, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయడం తీవ్రంగా కలచివేసింది’ అని పరిశ్రమల శాఖ మంత్రి కీర్తనా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఆదివారం తన అధికారిక ఎక్స్‌ (ట్విట్టర్‌) ఖాతాలో ఒక సుదీర్ఘ వివరణను పోస్ట్‌ చేశారు.

ట్రోలింగ్‌ చేయడం సరికాదు
పరిశ్రమల శాఖ సమావేశం ముగిసిన తర్వాత ప్రెస్‌మీట్‌లో విలేకరుల ప్రశ్నలు–సమాధానాలు ముగిసిన తరుణంలో తాను సహజంగా నవ్వాననని, అది ఏ ఒక్క ప్రశ్నకో లేదా రాష్ట్రంలో జరిగిన ఏ ఒక్క ఘటనకో వ్యతిరేకంగా చేసిన ప్రతిబింబం కాదన్నారు. అయితే తన తాలూకు ఆ బాడీ లాంగ్వేజ్‌ను తప్పుగా చిత్రీకరిస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు నెగిటివ్‌గా ప్రచారం చేయడం బాధాకరం అని మంత్రి కీర్తనా పేర్కొన్నారు. 

ఇలాంటి సున్నితమైన పరిస్థితుల్లో కూడా వాస్తవాలు తెలుసుకోకుండా నిరాధారమైన విమర్శలు చేయడం, వ్యక్తిగత దాడులకు దిగడం , సామాజిక మాధ్యమాల్లో బాధ్యతారాహిత్యంగా ట్రోలింగ్‌ చేయడం ఆందోళనకరమని ఆమె అన్నారు. ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని విమర్శించడం ప్రజాస్వామ్యంలో భాగమే కావచ్చని, అయితే, ఒకరి వ్యక్తిగత క్షణాలను అస్త్రంగా మార్చుకుని నిజాన్ని వక్రీకరించడం సమాజానికి ఆరోగ్యకరమైన పద్ధతి కాదని హితవు పలికారు.

మరోవైపు.. మైనర్ హత్యాచారం కేసు వివరాలను మీడియాకు వివరించే సమావేశంలో తమిళనాడు పోలీస్ అధికారుల వ్యవహరించిన అమానవీయంపై నెటిజన్లు, ప్రజలు ఫైర్ అవుతున్నారు. ప్రెస్‌మీట్‌లో పోలీసుల అధికార నవ్వులాట వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా..పోలీసు అధికారుల తీరుపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. కోయంబత్తూరు వెస్ట్ జోన్ ఐజీ రమ్య భారతి సహా డీఐజీ, ఎస్పీ ముగ్గురు అధికారులు పదేళ్ల బాలిక హత్యాచారం కేసు ప్రెస్ మీట్‌లో నవ్వులాటలు సాగిస్తూ.. మీడియా ముందే నవ్వారు. సున్నితమైన ఈ కేసులో ఏమాత్రం సీరియస్‌నెస్ లేని అధికారులు వైఖరిపై జనాగ్రహం పెల్లుబికుతుంది. అధికారుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. పోలీసుల అమానవీయ చర్య విషయం సీఎం విజయ్ వరకు వెళ్లడంతో సంబంధిత అధికారుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

అసలు ఏం జరిగింది?
కోయంబత్తూర్‌లోని దుకాణానికి వెళ్లి అదృశ్యమైన 10 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైన ఘటన తమిళనాట కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే కార్తీక్‌, మోహన్ రాజ్‌ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నారి హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 రోజుల్లోనే రాష్ట్రంలో నేరాల గ్రాఫ్ పెరిగిందని డీఎంకే విమర్శలు గుప్పించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement