చెన్నై: నగరంలోని మనలీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆయిల్ పరిశ్రమలో మంటలు చెలరేగి, భారీగా ఎగిసిపడుతున్నాయి. ఎనిమిది ఫైరింజన్లు మంటలను అదుపుచేస్తున్నాయి. విచ్చూర్ లక్ష్మీ నగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆయిల్ గోదాం నుంచి భారీగా నల్లపొగ ఎగసిపడిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటల తీవ్రత అధికంగా ఉండడంతో ఆర్పడం కష్టతరమైంది.
మనలి పుదు నగర్, విచ్చూర్ రెండు ప్రాంతాల మధ్యలోనే శ్రీ సత్యసాయి లూబ్రికేషన్స్ అనే ఆయిల్ నిల్వ చేసే పరిశ్రమ ఉంది. అందులో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. 50కి మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చి మంటలను ఆర్పే పనిలో పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. ఈ పరిశ్రమ పదేళ్లకు పైగా నడుస్తోందని చెబుతున్నారు.
ముఖ్యంగా పాత ఆయిల్‌ను బారెళ్లలో నిల్వ చేసే గోదాముగా ఈ పరిశ్రమ పనిచేస్తోందని తెలిసింది. ముందుగా చిన్నస్థాయి అగ్నిప్రమాదం జరిగి, ఆ తర్వాత పరిశ్రమలో ఉన్న ఆయిల్ బారెళ్లు పేలి చెల్లాచెదురవడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. సుమారు 2000కు పైగా బ్యారెళ్లు అక్కడ నిల్వ ఉన్నాయి. అవి పేలిపోవడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నల్లపొగ ఆ ప్రాంతమంతా కమ్మేసి భయాందోళన కలిగిస్తోంది.
అంతా ఆయిల్ ఉండటంతో ఒకదాని తర్వాత ఒక బారెల్ పేలుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది కూడా దగ్గరకు వెళ్లి మంటలు ఆర్పలేని పరిస్థితి ఎదురైంది. ఆ బారెళ్లు పూర్తిగా పేలి మంటలు తగ్గిన తర్వాతే పూర్తిగా అదుపులోకి తేవచ్చని చెబుతున్నారు. అంతవరకు దగ్గర్లో ఉన్న ఇతర భవనాలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక శాఖ చర్యలు చేపడుతోంది. మంటలను పూర్తిగా ఆర్పే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.


