
స్తబ్దుగా ఉన్న తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సరిహద్దు గ్రామాలు తమవేనని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయా పంచాయతీల్లోని కొన్ని గ్రామాల ప్రజలు ఈ ప్రకటనను వ్యతిరేకిస్తుండగా, మరికొందరు మాత్రం సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆరు గ్రామాల ప్రజలు తెలంగాణలోనే కొనసాగుతామంటూ గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి కలెక్టరేట్‌లో వినతిపత్రం సైతం సమర్పించారు.
ముంబైలో ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జివితితోపాటు పలు సరిహద్దు గ్రామాలకు చెందిన 11 మంది నాయకులు ప్రజాప్రతినిధులను కలిశారు. సరిహద్దు గ్రామాల విషయంలో స్పష్టతనివ్వాలని కోరడంతోనే విలీన విషయం మళ్లీ తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.
అసలు వివాదం ఇదీ..
1955–56లో ఫజల్ అలీ కమిషన్ ద్వారా రాష్ట్రాల సరిహద్దులను నిర్ధారించారు. ఈ క్రమంలో భాషా ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న వివాదాస్పద 14 గ్రామాలు మహారాష్ట్రలోకి వెళ్లాయి. 1978లో మరోసారి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సరిహద్దులు నిర్ణయించగా, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఆర్టికల్–3 ద్వారా ఆయా గ్రామాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదీనంలో ఉంటాయని ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ముకదంగూడ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త రాందాస్ నర్వడే తెలిపిన వివరాల ప్రకారం.. 1980 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగబోమని, మహారాష్ట్రలో విలీనం చేయాలని ఉద్యమం ప్రారంభమైంది. దీంతో 1983లో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 1978లో చేసిన హద్దుల ప్రకారం గ్రామాలు ఏపీకి చెందినవేనని స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందుతాయని 1990 జూలై 7న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అక్కడ మలిదశ ఉద్యమం ప్రారంభమైంది.


మరాఠీ మాట్లాడే వారు ఎక్కువగా ఉన్నారని, భాషా ప్రాతిపదికన విభజించాలని న్యాయవాది, రాజురా ఎమ్మెల్యే వామన్‌రావు చటప్ ప్రజలతో కలిసి ఆందోళన చేశారు. అసెంబ్లీలోనూ సమస్యను లేవనెత్తారు. వివాదాస్పద గ్రామాలు భాషాపరంగా తమకు చెందుతాయని ‘మహా’సర్కార్ 1993 ఆగస్టు 5న 1990 నాటి పాత ఉత్తర్వులను రద్దు చేసింది. దీనిపై 1996 ఏప్రిల్ 3న అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం హైకోర్టులో రిట్ పిటిషన్‌ను వేసింది. అక్కడి ప్రభుత్వం అదే ఏడాది ఏప్రిల్ 30న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ 10338/96 దాఖలు చేసింది. కేసు వెనక్కి తీసుకోవాలని సుప్రీంకోర్టు 1997 ఫిబ్రవరి 12న ఏపీకి ఉత్తర్వులు జారీ చేసింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిట్ పిటిషన్‌ను ఆగస్టు 21న బేషరతుగా వెనక్కి తీసుకుంది. అయితే ఆ ఉత్తర్వులపై స్థానిక ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదు. దీంతో ఇరు రాష్ట్రాలూ తమ పాలనను కొనసాగిస్తున్నాయి. ఇరు ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఎన్నికల్లోనూ ప్రజలు ఓటు వేస్తున్నారు. 1965 నుంచి ఆయా గ్రామాలు మహారాష్ట్రలోని నోకేవాడ, పుడ్యాన్‌మోదా గ్రామ పంచాయతీలో ఉండగా, 1990లో మళ్లీ పరంధోళి, అంతాపూర్ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి గ్రామాలను విడదీసింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ కూడా పరంధోళి, అంతాపూర్ గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది.
ఇరు రాష్ట్రాల పాలన
ప్రస్తుతం 14 గ్రామాలు ఇరు రాష్ట్రాల పాలనలో కొనసాగుతున్నాయి. ప్రజలకు రెండేసి రేషన్ కార్డులు, ఓటరు కార్డులు ఉన్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల ఆధ్వర్యంలో పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. గతంలో పరంధోళి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా నిర్మించలేదు. పట్టాల కోసం 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా సమస్యకు పరిష్కారం లభించలేదు. గ్రామాలను అనుసంధానిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పించింది. ఇరవై శాతం గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం అటవీ హక్కు పత్రాలు అందించింది. డెబ్భైయ్ శాతం ఉన్న ఎస్సీలు, 10 శాతం ఉన్న బీసీలకు హక్కులు కల్పించకపోవడంతో.. వారిలో చాలామంది మహారాష్ట్రలో కలుస్తామని చెబుతున్నారు.

రెండు రాష్ట్రాల రేషన్ కార్డులు చూపిస్తున్న మహిళలు
పట్టాలిస్తేనే..
నలభయ్యేళ్లుగా సాగు చేస్తున్నా నేటికీ భూములకు పట్టాలు లేవు. ఇరు ప్రభుత్వాలు కూడా స్పందించకపోవడంతో సంక్షేమ పథకాలు అందడం లేదు. ప్రజలు పేదరికంలో బతుకుతున్నారు. ఏ ప్రభుత్వం సాగు భూములకు పట్టాలిస్తే ఆ రాష్ట్రంలో కొనసాగుతాం.
:::కాంబ్డె లక్ష్మణ్, మాజీ సర్పంచ్, పరంధోళి
‘మహా’సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
మహారాష్ట్ర సర్కారు 14 గ్రామాలు తమవే అని ప్రకటించిన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. మరాఠీ మాట్లాడే మేమంతా భాషా ప్రాతిపదికన మహారాష్ట్రలోనే ఉంటా మని 1980 నుంచి పోరాటం చేస్తున్నాం. గ్రామాలు మహారాష్ట్రకు చెందినవని 1997లోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
:::రాందాస్ రన్‌వీర్, సామాజిక కార్యకర్త, ముకదంగూడ
తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాం
తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. అటవీ భూములకు హక్కు పత్రాలు ఇచి్చంది. త్వరలో ఇందిరమ్మ ఇళ్లు కూడా అందనున్నాయి. తాగునీరు, సాగునీరు తదితర సౌకర్యాలు కలి్పస్తోంది. మా గ్రామాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాం.
:::హడ్సె బాజీరావు, ఇంద్రానగర్
:::కెరమెరి (ఆసిఫాబాద్), సాక్షి ప్రతినిధి