చెన్నై: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్(ఎన్‌డీపీఎస్) చట్టం కింద పదేళ్ల జైలు శిక్ష పడిన ఎ విఘ్నేష్ అనే వ్యక్తిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అతని సహ నిందితుని వాంగ్మూలం ఆధారంగా శిక్ష విధించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఉదంతంలో తప్పుడు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన ముగ్గురు పోలీసులు.. బాధితునికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
2021 నాటి ఈ కేసు వివరాల్లోకి వెళితే.. మధురైలోని తిదిర్ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి.. మెల్వాసల్ సమీపంలో ఎ. విఘ్నేష్ సహా కొంతమంది వ్యక్తులు 24 కిలోల గంజాయిని తీసుకెళ్తున్నారని సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారందినీ అరెస్టు చేశారు. అనంతరం మధురై స్పెషల్ కోర్టు నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే విఘ్నేష్ దీనిని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. ఈ కేసులో సహ నిందితుడి ఒప్పుకోలు తప్ప, నేరంలో నిందితుడి ప్రమేయానికి సంబంధించి ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలను లేవని కోర్టులో అతని తరపు న్యాయవాది వాదించారు.
కేసును విచారించిన న్యాయమూర్తి కె. రామకృష్ణన్ మాట్లాడుతూ.. నిష్పాక్షిక విచారణ నిందితుల ప్రాథమిక హక్కు అని అన్నారు. నిందితుడు విఘ్నేష్ నుండి పోలీసులు ఎటువంటి వస్తువులు స్వాధీనం చేసుకోలేదని విచారణలో తేలిందన్నారు. సంఘటన జరిగిన ప్రదేశంలో విఘ్నేష్ ఉన్నాడనేందుకు ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొన్నారు. అందుకే విఘ్నేష్‌ను దోషిగా నిర్ధారించడానికి కోర్టు నిరాకరిస్తున్నదని స్పష్టం చేశారు
తిదిర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో నాడు విధుల్లో ఉన్న పోలీసు అధికారులు పనరాజ్, సెంథిల్‌కుమార్, మహమ్మద్ ఇద్రిస్ తదితరులు ట్రయల్ కోర్టులో తప్పుడు సాక్ష్యం ఇచ్చి, విఘ్నేష్‌ను దోషిగా నిర్ధారించేందుకు కుట్ర పన్నడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ముగ్గురు పోలీసు అధికారులు బాధితుడు విఘ్నేష్‌కు సంయుక్తంగా రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఈ ముగ్గురు పోలీసుల ప్రవర్తనపై దర్యాప్తు చేయాలని కోర్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Rajasthan: మంటల్లో మరో బస్సు.. ఇద్దరు మృతి


