ఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపణలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భవానీపురంలోని ఓ స్టాంగ్ రూమ్ వద్దకు చేరుకున్న సీఎం మమతా బెనర్జీ.. ఈవీఎంలను తారుమారు చేసే కుట్ర జరుగుతుందంటూ ఆరోపించారు.
దాదాపు మూడు గంటల పాటు స్ట్రాంగ్ రూమ్ వద్దే ఉన్న మమతా.. ఈవీఎంలను తాకాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు. ఎన్నికల అధికారులు లేకుండా స్ట్రాంగ్ రూమ్‌లోకి వెళుతున్నారన్నారు. ‘‘మేము చట్టాని గౌరవిస్తున్నాము. నేను ఒక్క ఆదేశమిస్తే 10 వేల మంది కార్యకర్తలు వస్తారు’’ అంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు.
రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు మరో రెండు రోజులే సమయం ఉండగా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గంటల తరబడి స్ట్రాంగ్‌రూమ్‌లోనే గడపడం, ఆమె పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టడం చర్చనీయాంశమైంది. రెండో, చివరి దశ పోలింగ్ ముగిసిన కొద్దిసేపటికే.. తమ పార్టీ ప్రతినిధుల సమక్షం లేకుండానే బ్యాలెట్ బాక్సులను తెరిచారని తృణమూల్ ఆరోపించింది. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలించేందుకు మమతా బెనర్జీ తన ఎన్నికల ఏజెంట్‌తో కలిసి కోల్‌కతాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్‌కు వెళ్లారు. అక్రమాలు జరిగాయని ఆమె ఆరోపించారు.
దాదాపు నాలుగు గంటల పాటు స్ట్రాంగ్‌రూమ్‌లో గడిపిన తర్వాత.. ఆమె రాత్రి 12:07 గంటలకు బయటకు వచ్చి తీవ్ర ఆరోపణలు చేశారు. "ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి అక్రమాలకు పాల్పడినా సహించేది లేదు. పారదర్శకత కోసం మీడియా కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించాను. ప్రజల ఓట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఫిర్యాదులు అందడంతోనే తాను అక్కడికి వచ్చానని మమతా బెనర్జీ అన్నారు.
ఈ ఆరోపణలను ఎన్నికల కమిషన్ (EC) కొట్టివేసింది. అన్ని నిబంధనలను పాటిస్తూ స్ట్రాంగ్‌రూమ్‌లను సురక్షితంగా సీల్ చేశామని.. ఎటువంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేసింది. బీజేపీ సీనియర్ నేత తపస్ రాయ్ మాట్లాడుతూ ఓటమి భయంతోనే తృణమూల్.. అబద్ధపు ప్రచారాలు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని.. ఈ ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదన్నారు.



