14 నెలలైనా.. హామీల అమలులో అదే కాలయాపన | Kishan Reddy comments over congress party | Sakshi
Sakshi News home page

14 నెలలైనా.. హామీల అమలులో అదే కాలయాపన

Mar 12 2025 4:17 AM | Updated on Mar 12 2025 4:17 AM

Kishan Reddy comments over congress party

రూ.1.5 లక్షల కోట్లు కావాలని కేంద్రానికి లేఖ రాయడం చిన్నపిల్లల నవ్వులాటలా ఉంది 

నన్ను ఎవరు తిట్టినా వారి విజ్ఞతకే వదిలేశాను : కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు ప్రకటించి, అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఆ హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పార్టీ బీజేపీ అని, తాము చేయలేకపోయిన హామీలను ఇంకొకరి మీద వేసి, వారు అడ్డుకుంటున్నారు అని ఎప్పుడూ ఎవరినీ నిందించలేదని పరోక్షంగా సీఎం రేవంత్‌రెడ్డిని కిషన్‌రెడ్డి విమర్శించారు. 

కొత్త ప్రాజెక్టుల పేరు మీద రూ. 1.5 లక్షల కోట్లు కావాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం చిన్నపిల్లల నవ్వులాటలా ఉందని ఎద్దేవా చేశారు. ఆర్థిక వనరులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని కిషన్‌రెడ్డి సూచించారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో భారతీయ పురాతన చేతివృత్తుల వైభవాన్ని గుర్తుచేస్తూ రచించిన ‘వూట్జ్‌: ద ఫర్‌గాటెన్‌ మెటల్‌ క్రాఫ్ట్‌ ఆఫ్‌ డెక్కన్‌’పుస్తకాన్ని కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, తన వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రజల దృష్టి మళ్లించడానికి కొత్త ప్రాజెక్టుల రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు అడుగుతున్నారని విమర్శించారు. ఇది దివాలాకోరు విధానం, బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రూ. 7.5 లక్షల కోట్లు అప్పు చేసిందని, తమకు తెలియదని, రాష్ట్ర అప్పు రూ.3.5 లక్షల కోట్లే అనుకున్నానని రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి తప్పుబట్టారు. 

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నానని, హామీలు అమలు చేయలేకపోతున్నానంటూ ముఖ్యమంత్రి మాట మార్చడం రాహుల్‌గాం«దీ, రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థతకు అద్దం పడుతోందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు తామే హామీ ఇచ్చామని, తప్పకుండా అమలు చేస్తామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా, మహిళలకు ఇచ్చిన హామీలు, జాబ్‌ కేలండర్, నిరుద్యోగ భృతి, రైతులు, కౌలు రైతులకు ఆర్థిక సహాయం, పెన్షన్లు సహా ఇచి్చన అన్ని హామీల గురించి ప్రస్తావిస్తామన్నారు. 

వీటన్నింటి గురించి శాసనసభలో చర్చిస్తే బాగుంటుందని కిషన్‌రెడ్డి సూచించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో రాష్ట్రాన్ని దోపిడీ చేశారని, రియల్టర్లను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోతామన్న భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తనపై వ్యక్తిగత విమర్శలు చేశారన్నారు. తనను ఎవరు తిట్టినా వారి విజ్ఞతకే వదిలేస్తానని చెప్పారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement