పంజాబ్‌లో కిసాన్‌ మహా పంచాయత్‌

Kisan mahapanchayat held in Punjab - Sakshi

రాష్ట్రంలో తొలిసారిగా రైతు సంఘాల బలప్రదర్శన 

14న దేశవ్యాప్తంగా కొవ్వొత్తులు/కాగడాల ర్యాలీ

16న కిసాన్‌/మజ్దూర్‌ దినం

సంయుక్త కిసాన్‌ మోర్చా నిర్ణయం

జాగ్రాన్‌(లూధియానా):  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్, హరియాణా వంటి రాష్ట్రాల్లోనే జరిగిన కిసాన్‌ మహా పంచాయత్‌కు తాజాగా పంజాబ్‌ వేదికగా మారింది. లూధియానా జిల్లాలోని జాగ్రాన్‌ మార్కెట్‌లో గురువారం నిర్వహించిన కిసాన్‌ మహాపంచాయత్‌లో 40 రైతు సంఘాలు బలప్రదర్శన నిర్వహించాయి. 30 వేల మందికిపైగా రైతులు పాల్గొన్నారు. పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, ఇతర వాహనాలపై తరలివచ్చారు. సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో 40 రైతు సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చాయి.

కొత్త వ్యవసాయ చట్టాలు రైతాంగాన్ని సర్వనాశనం చేస్తాయని భారతీయ కిసాన్‌ యూనియన్‌(రాజేవాల్‌) అధ్యక్షుడు బల్బీర్‌సింగ్‌ రాజేవాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కిసాన్‌ మహా పంచాయత్‌లో ఆయన ప్రసంగించారు. రైతన్నల పోరాటం గురించి ఆందోళన జీవులంటూ తేలికగా మాట్లాడిన ప్రధాని∙మోదీ అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో మాట మార్చారని అన్నారు. రైతులది పవిత్ర పోరాటం అంటున్నారని గుర్తుచేశారు. ‘మోదీ పెద్ద అబద్ధాలకోరు, నాటకాల రాయుడు’ అని రాజేవాల్‌ మండిపడ్డారు. వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని వెల్లడించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై తప్పుడు చట్టాలు తెచ్చిందని దుయ్యబట్టారు.

ఇది ప్రజా పోరాటం
కొత్త సాగు చట్టాలతో కార్పొరేట్‌ వ్యాపారులకు లాభం తప్ప రైతులకు ఒరిగేదేమీ ఉండదని రాజేవాల్‌ విమర్శించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులంతా శాంతియుతంగా పోరాటం కొనసాగించాలని, విజయం తప్పకుండా వరిస్తుందని పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్‌ మోర్చా నిర్ణయం మేరకు తదుపరి పోరాట కార్యాచరణను రాజేవాల్‌ ప్రకటించారు. పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన వారికి నివాళిగా ఈ నెల 14న దేశవ్యాప్తంగా కొవ్వొత్తులు/కాగడాల ర్యాలీ నిర్వహిస్తామన్నారు. సర్‌ చోటూరామ్‌ను స్మరించుకుంటూ ఈ నెల 16న కిసాన్‌/మజ్దూర్‌ దినం పాటిస్తామని వెల్లడించారు. 18న దేశవ్యాప్తంగా నాలుగు గంటల పాటు రైల్‌ రోకో చేపడతామని వివరించారు. సుదీర్ఘపోరాటానికి సిద్ధం కావాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌(ఏక్తా ఉగ్రహన్‌) అధ్యక్షుడు జోగీందర్‌ సింగ్‌ రైతులకు సూచించారు. కాంట్రాక్టు వ్యవసాయం, ప్రత్యామ్నాయ మార్కెటింగ్‌ వంటివి తామెప్పుడూ ప్రభుత్వాన్ని కోరలేదని పేర్కొన్నారు. వాటిని తీసుకురావాల్సిన అవసరం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు.  

అవసరమైతే సవరణలు: మంత్రి రాజ్‌నాథ్‌
నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నేతలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ పునరుద్ఘాటించారు. ఈ చట్టాల్లో అవసరమైతే ప్రభుత్వం సవరణలు చేస్తుందని అన్నారు. మధ్యప్రదేశ్‌లో పలు చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించాక రాజ్‌నాథ్‌ మాట్లాడారు. ప్రభుత్వ చర్యలతో సాధారణ రైతన్నల్లో కొత్త విశ్వాసం, ఉత్సాహం వచ్చిందని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top