వీడీ సతీశన్‌కు అత్యధిక అవకాశాలు
తాను సీఎం రేసులో ఉన్నానని ధీమాగా చెప్పిన రమేశ్ చెన్నితల
అధిష్టానం మెప్పు పొందిన కేసీ వేణుగోపాల్‌కూ చాన్స్
లెఫ్ట్ కూటమి పరిపాలనా కోటగోడలను బద్దలుకొడుతూ పదేళ్ల తర్వాత కేరళలో అధికారపీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి ఎట్టకేలకు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధంచేసుకుంది. అయితే రాష్ట్రపరిపాలనా రథాన్ని ముందుండి నడిపించే రథసారథి ఎవరనే చర్చ ఇప్పుడు మొదలైంది. గతంలో కేరళ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షనేతగా ఉండి సీఎం పినరయి విజయన్ ప్రభుత్వ వైఫల్యాలను విజయవంతంగా ఎండగట్టిన వీడీ సతీశన్‌కు సీఎం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఊహాగానాలు ఎక్కువయ్యాయి.
అయితే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ అగ్రనాయకుడు రాహుల్‌గాందీకి అత్యంత సన్నిహిత నేతగా మెలుగుతున్న కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే ఆస్కారముందని కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేశ్ చెన్నితల సైతం సీఎం రేసులో ముందుకు దూసుకుపోతున్నారని కేరళ మీడియా కోడైకూస్తోంది. పార్టీ నేతలందర్నీ సమన్వయం చేసే సత్తా, పరిపాలనా అనుభవం, ఢిల్లీలో మాట నెగ్గించుకురాగల పరపతి ఉన్న నేతకే సీఎం పదవి దక్కే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిలో ఎవరిని సీఎం పదవి వరిస్తుందనేది కేరళలో చర్చనీయాంశమైంది. ఈ ముగ్గురు కీలకనేతల గురించి క్లుప్తంగా..
వీడీ సతీశన్
వీడీ సతీశన్ ఐదేళ్లుగా విపక్షనేతగా కొనసాగుతూ ప్రజసమస్యలపై అసెంబ్లీలో ప్రజావాణిని బలంగా విన్పించి ఓటర్లలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీఎంగా ఈయనకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పార్టీ మద్దతు కూడా ఉంది. సతీశన్ సీఎం అయితే మైనార్టీల బాగోగులనూ పట్టించుకుంటారని ఐయూఎంఎల్ అధ్యక్షుడు పనక్కడ్ సాదిఖ్‌అలీ తంగల్ అన్నారు. పినరయి విజయన్ ప్రభుత్వహయాంలో జరిగిన అవినీతి, బంధుప్రీతి, అసమర్థ పాలనపై సతీశన్ ప్రజాక్షేత్రంలో బలంగా ఎండగట్టారు. యువకుడిగా కేరళ స్టూడెంట్స్ యూనియన్‌లో సభ్యునిగా ఉన్నకాలం నుంచి లాయర్‌గా తర్వాత కాంగ్రెస్‌నేతగా పాతికేళ్లకుగాపైగా కేరళ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఎర్నాకులం ఈయనకు పెట్టని కోట. పార్టీ అధిష్టానం వద్ద సైతం సతీశన్‌కు మంచి పేరుంది. పరవూర్‌లో సీపీఐ నేత టైసన్ మాస్టర్‌పై భారీ మెజారీ్టతో గెలిచి ప్రజల్లో తనకున్న ఆదరణను మరోసారి నిరూపించుకున్నారు.
రమేశ్ చెన్నితల
70 ఏళ్ల రమేశ్ చెన్నితల సొంత రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం గడించారు. పారీ్టకి గతంలో రాష్ట్ర అధ్యక్షునిగా సేవలందించారు. గత యూడీఎఫ్ ప్రభుత్వంలో రాష్ట్ర హోం, విజిలెన్స్ శాఖమంత్రిగా పనిచేశారు. విద్యార్థి నేతగా ఉంటూ ఈస్థాయికి ఎదిగారు. 1982లోనే విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐకి ఆలిండియా అధ్యక్షునిగా పనిచేశారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్‌కు సైతం అధ్యక్షునిగా చేశారు. కేరళ అసెంబ్లీలో గతంలో విపక్షనేతగా ఉంటూ ప్రభుత్వవిధానాలపై ఉద్యమించారు. సతీశన్ కంటే ముందు విపక్షనేతగా పనిచేసిన కాలంలో యూడీఎఫ్ కూటమి మిత్రపక్షాల మధ్య ఐక్యత పెంచడంలో సపలమయ్యారు. జిల్లా నేతలను సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. తాజా ఎన్నికల్లో హరిపాద్ నియోజకవర్గంలో సీపీఐ నేత జిస్మన్‌పై భారీ మెజారీ్టతో నెగ్గారు. అలప్పుజ జిల్లాలో గెలిచిన ఏకైక యూడీఎఫ్ అభ్యర్థి ఈయనే. తద్వారా జిల్లాపై తనకు ఎంత పట్టు ఉందనేది నిరూపించుకున్నారు.
కేసీ వేణుగోపాల్
అటు ఢిల్లీలో ఇటు కేరళలో నెగ్గుకురాగల విలక్షణమైన నేపథ్యమున్న నేతగా కేసీ వేణుగోపాల్ నిలిచారు. అలప్పుజ నుంచి గతంలో ఎంపీగా గెలిచారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం అత్యంత కీలకమైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(వ్యవస్థాగతం) హోదాలో కొనసాగుతూ అగ్రనాయకులు సోనియా గాం«దీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీలకు కుడిభుజంగా ఉన్నారు. కేఎస్‌యూ, యూత్ కాంగ్రెస్ విభాగాల్లో కష్టపడిపనిచేసి ఏఐసీసీ పదవి పొందేస్థాయికి ఎదిగారు. రాష్ట్ర నేతలకు, కేంద్ర నాయకత్వానికి మధ్య సంధాన కర్తగా ఉంటూ చాన్నాళ్లుగా చక్కటి సమన్వయం సాధించారు. అధినాయకత్వానికి దగ్గరగా ఉన్న కారణంగా ఈయనకు సీఎం పదవి దక్కినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని రాజకీయపండితులు విశ్లేషిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


