కేరళ సీఎం ఎంపికలో అదే అనిశ్చితి | Kerala Chief Minister choice leaves Congress flustered | Sakshi
Sakshi News home page

కేరళ సీఎం ఎంపికలో అదే అనిశ్చితి

May 12 2026 4:50 AM | Updated on May 12 2026 4:50 AM

Kerala Chief Minister choice leaves Congress flustered

నేడు సీనియర్‌ నేతలతో ఢిల్లీలో తుది మంతనాలు 

బుధవారం కల్లా స్పష్టత వస్తుందంటున్న కాంగ్రెస్‌ వర్గాలు 

జాప్యంపై ఐయూఎంఎల్‌ అసంతృప్తి

న్యూఢిల్లీ/తిరువనంతపురం: కేరళ తదుపరి సీఎం ఎవరన్న దానిపై సోమవారం కూడా ఊహాగానాలు, సస్పెన్స్‌ కొనసాగుతోంది. కాగా, ఈ సందిగ్ధానికి చెక్‌ పెట్టేందుకు అత్యున్నత నాయకత్వం నడుం బిగించింది. కేరళ మాజీ పీసీసీ అధ్యక్షులతోపాటు సీనియర్‌ నేతలతో చివరిగా చర్చలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ సమావేశాలతో సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై స్పష్టత రానుందని చెబుతున్నారు. 

మంగళవారం ఢిల్లీలో జరిగే చర్చలకు అధిష్టానం కబురందుకున్న వారిలో ఎంఎం హస్సన్, వీఎం సుధీరన్, ఎం. రామచంద్రన్, కె.మురళీధరన్, కన్నూర్‌ ఎంపీ కె.సుధాకరన్‌ ఉన్నారు. వీరితో కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే, ముఖ్యనేత రాహుల్‌ గాంధీ చర్చలు జరుపుతారు. ఒకట్రెండు రోజుల్లోనే వ్యవహారం కొలిక్కి వస్తుందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. 48 గంటల్లోనే దీనిపై స్పష్టత రానుందని ఓ నేత తెలిపారు. 

సీఎం రేసులో ఉన్న రమేశ్‌ చెన్నితాల, ఏఐసీపీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) కేసీ వేణుగోపాల్, గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న వీడీ సతీశన్‌లతో రాహుల్, ఖర్గేలు చర్చలు జరిపిన తర్వాత కూడా కాంగ్రెస్‌ అంతిమ నిర్ణయం తీసుకోలేకపోవడం గమనార్హం. ఈ జాప్యంపై యూడీఎఫ్‌లోని కీలక పక్షమైన ఐయూఎంఎల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అనిశ్చితి ఇలాగే కొనసాగితే పరిణామాలు వేరుగా ఉంటాయని హెచ్చరిస్తోంది. 

ఆలస్యం కారణంగా ప్రజలతోపాటు తమ కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని ఐయూఎంల్‌ మలప్పురం జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ హమీద్‌ తెలిపారు. ఎంపికలో కాలయాపనపై రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు బదులిచ్చారు. ‘అసెంబ్లీ గడువు ఈ నెల 23వ తేదీ వరకు ఉంది. ఎంతకంత కంగారు?’అని ప్రశ్నించారు. ‘పార్టీ హైకమాండ్‌ తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా పార్టీ శ్రేణులకే కాదు, యూడీఎఫ్‌ భాగస్వామ్య పక్షాలకు కూడా సంతృప్తికలిగించేదిగా ఉండాలి. ఇదొక ప్రజాస్వామిక ప్రక్రియ’అని రమేశ్‌ చెన్నితాల పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement