గేమ్‌ఛేంజర్‌.. కీర్తన | Keerthana Youngest Minister In Tamil Nadu CM Vijay Cabinet, Read Full Story To Know About Her In Telugu | Sakshi
Sakshi News home page

గేమ్‌ఛేంజర్‌.. కీర్తన

May 12 2026 9:38 AM | Updated on May 12 2026 6:23 PM

Keerthana youngest minister CM Vijay cabinet Tamil Nadu

సాక్షి, చెన్నై :  సీఎం విజయ్‌ కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌. కీర్తన గురించిన చర్చ తమిళనాట ప్రధాన అంశంగా మారింది. 29 ఏళ్ల ఈ ’యువ తుపాన్‌’.. 5 భాషల్లో ప్రావీణ్యం..సాధించి ఉండడంతో ఆమె గురించిన ఆసక్తికర అంశాలను తెలుసుకునే వారు పెరిగారు. ఆదివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె సోమవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవసరమైన ధృవీకరణ పత్రాన్ని మరచి పోవడంతో ఆమెపై చర్చ మరింత ఊపందుకుంది. 

రాజకీయ వ్యూహకర్త నుండి మంత్రి వరకు.. 
విరుదునగర్‌ జిల్లా శివకాశి నియోజకవర్గం నుండి విజయం సాధించిన కీర్తన, కేవలం రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు, ఒక సమర్థవంతమైన పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌ (రాజకీయ వ్యూహకర్త). ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రఖ్యాత రాజకీయ సలహా సంస్థలైన ఐప్యాక్, షోటైమ్‌ కన్సల్టింగ్‌లో డిజిటల్‌ క్యాంపెయిన్‌ స్ట్రాటజిస్ట్‌గా పనిచేశారు. కీర్తన తన వృత్తిపరమైన ప్రయాణంలో దేశంలోని హేమాహేమీలైన రాజకీయ నాయకుల వద్ద పనిచేశారు. 

చదువు ..భాషా నైపుణ్యం 
విరుదునగర్‌ ప్రభుత్వ పాఠశాలలో తమిళ మీడియంలో ప్రాథమిక విద్యను అభ్యసించిన కీర్తన, మదురై కామరాజ్‌ యూనివర్సిటీలో బీఎస్సీ మ్యాథ్స్, పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ పూర్తి చేశారు. ఈమెకు తమిళం, తెలుగు, ఇంగ్లీష్‌ హిందీ, మలయాళం వంటి 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం ఉంది. ముఖ్యంగా విజయ్‌ సిద్ధాంతాలను దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆమె హిందీ నేర్చుకోవడం విశేషం.

శివకాశిలో సరికొత్త రికార్డు  
2026 ఎన్నికల్లో శివకాశి నియోజకవర్గం నుండి పోటీ చేసిన కీర్తన, తన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ అభ్యర్థి అశోకన్‌ను 11,670 ఓట్ల మెజారిటీతో ఓడించారు. గత 70 ఏళ్లలో  శివకాశి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన మొదటి మహిళా ఎమ్మెల్యేగా ఆమె చరిత్ర సృష్టించారు. రాజకీయ నేపథ్యం గానీ, ధన బలం గానీ లేకపోయినా.. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంటే విజయ్‌  పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుంది అనడానికి తానే ∙నిదర్శనం అని కీర్తన వ్యాఖ్యానిస్తున్నారు. సామాన్య కుటుంబం నుండి వచ్చి, రాజకీయ వ్యూహకర్తగా అనుభవం గడించి, నేడు ఏకంగా రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించిన కీర్తన ప్రయాణం తమిళనాడులోని ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకంగా మారినట్లయ్యింది.

 

Advertisement
 
Advertisement
Advertisement