సీఎంగా రాజీనామా చేసినా కానీ.. పార్టీపై పట్టు కోసం సిద్ధరామయ్య ప్రయత్నాలు సాగిస్తున్నారు. డీకే శివకుమార్‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వకుండా సిద్ధరామయ్య చక్రం తిప్పుతున్నారు. ఢిల్లీలో వరుసగా పార్టీ పెద్దలతో సుదీర్ఘ భేటీలు జరుపుతున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ లేకుండా కోఆర్డినేషన్ కమిటీ వేయాలంటూ సిద్ధరామయ్య కొత్త మెలిక పెట్టారు.
కేబినెట్‌లో తన వర్గానికి చెందిన 15 మంది ఉండేలా సిద్ధరామయ్య ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తన మనుషులకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వాలని హైకమాండ్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తన కొడుక్కి వైద్య, విద్య వంటి ప్రాధాన్యత గల పోస్టు ఇవ్వాలంటున్న సిద్ధరామయ్య.. కర్ణాటక కాంగ్రెస్‌లో తన ప్రాధాన్యం తగ్గకుండా రాజ్యసభకు వెళితే రాష్ట్రంలో తన పట్టుపోతుందని భయం పడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉంటేనే అహిందా వర్గాలు.. పార్టీకి అండగా ఉంటాయని హైకమాండ్‌ను సిద్ధరామయ్య ఒప్పించారు.
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజ్యసభకు పంపిస్తామంటూ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆఫర్ వచ్చిందని.. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని వినమ్రంగా ఆ వినతిని తోసిపుచ్చినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని, ప్రజలు తమకు ఐదేళ్లపాటు పదవీకాలం ఇచ్చారని, ఇంకా రెండేళ్ల కాలం మిగిలి ఉందని, అప్పటివరకు వారి కోసం కోసం పని చేయాల్సి ఉందని అధిష్టానానికి చెప్పినట్లు ఆయన వెల్లడించారు.
ఇదిలా ఉండగా, సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్యకు మద్దతుగా ఆయన అనుచరులు, అభిమానులు రాష్ట్రవ్యాప్తగా ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే తమ నాయకుడికి అనుకూలంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం వైఖరిపై మండిపడ్డారు. సిద్ధరామయ్యతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే కురుబ సామాజిక వర్గం నాయకులు సైతం సిద్ధరామయ్య రాజీనామాను వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని, పదవిలో కొనసాగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల ప్రకారమే సిద్ధరామయ్య రాజీనామా చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.


