
ఢిల్లీ హైకోర్టులో కరిష్మా కపూర్ కుమార్తె, కుమారుడి పిటిషన్
సవతి తల్లి నకిలీ విల్లు సృష్టించిందని ఆరోపణ
న్యూఢిల్లీ: తమ తండ్రి దివంగత సంజయ్ కపూర్ ఆస్తుల్లో వాటా కోసం బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ కుమార్తె, కుమారుడు న్యాయ పోరాటం ప్రారంభించారు. తండ్రి ఆస్తుల్లో తమకు రావాల్సిన వాటా దక్కేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగే అవకాశం ఉంది. సంజయ్ కపూర్‌కు రూ.30,000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం. మరణానికి ముందు ఈ ఏడాది మార్చి 21వ తేదీన ఆయన రాసినట్లు చెబుతున్న విల్లు నకిలీదని కరిష్మా కపూర్ కుమార్తె, కుమారుడు ఆరో పించారు.
ఆస్తులు మొత్తం కొట్టేయడానికి తమ సవతి తల్లి ప్రియా కపూర్(ప్రియా సచ్‌దేవ్) కుట్ర చేస్తోందని పేర్కొన్నారు. తన వ్యక్తిగత ఎస్టేట్ మొత్తం ప్రియా కపూర్ కు దక్కేలా సంజయ్ కపూర్ విల్లు రాసినట్లు సమాచారం. అయితే, ఆ విల్లును కుట్ర పూరితంగా సృష్టించారని, అది నిజమైన విల్లు కాదని కరిష్మా కపూర్ కుమార్తె, కుమారుడు తేల్చిచెప్పారు. దాని గురించి తమ తండ్రి సంజయ్ కపూర్ కానీ, సవతి తల్లి ప్రియా కపూర్ కానీ గతంలో ఎన్నడూ చెప్పలేదని వెల్లడించారు. ఇప్పుడు ప్రియా కపూర్ దురుద్దేశంతోనే హఠాత్తుగా నకిలీ విల్లును తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. సంజయ్ కపూర్‌కు సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ బయటపెట్టేలా ప్రియా కపూర్‌ను ఆదేశించాలని హైకోర్టును కోరారు.
ఏమిటీ వివాదం?
ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ తొలుత నందితాను వివాహం చేసుకున్నారు. 1996 నుంచి 2000 సంవత్సరం దాకా వారు కలిసున్నారు. విడాకుల తర్వాత సంజయ్ కపూర్ 2003లో కరిష్మా కపూర్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వారికి ఇద్దరు పిల్లలు సమైరా, కియాన్ ఉన్నారు. 2016లో అభిప్రాయభేదాల వల్ల సంజయ్ కపూర్, కరిష్మా విడిపోయారు. అనంతరం 2017 ప్రియా సచ్‌దేవ్‌ను సంజయ్ పెళ్లాడారు. సంజయ్ కపూర్ ఈ ఏడాది జూన్ 12న హఠాత్తుగా మృతిచెందిన సంగతి తెలిసిందే. లండన్‌లో పోలో ఆడుతుండగా గొంతులోకి తేనెటీగ దూసుకెళ్లింది.
దాంతో ఆయన గుండెపోటుకు గురై కన్నుమూశారు. తన కుమారుడి మరణంపై అనుమానాలున్నాయని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని సంజయ్ తల్లి రాణి కపూర్ యూకే ప్రభుత్వాన్ని కోరారు. సంజయ్ మరణం తర్వాత ఆయన ఆస్తులపై వివాదం మొదలైంది. రెండో భార్య సంతానం, మూడో భార్య మధ్య పోరాటం సాగుతోంది. మరోవైపు ఇన్నాళ్లూ ప్రియా సచ్‌దేవ్‌గానే ఉన్న మూడో భార్య ఇటీవలే తన పేరును ప్రియా కపూర్‌గా మార్చుకోవడం గమనార్హం. అంతేకాకుండా తన అత్త రాణి కపూర్‌పై ఒత్తిడి తెచ్చి కొన్ని రకాల పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్లు ప్రియా కపూర్‌పై ఆరోపణలు వస్తున్నాయి.