జస్టిస్‌ వర్మ రాజీనామా  | Justice Yashwant Varma Resignation As Allahabad High Court Judge | Sakshi
Sakshi News home page

జస్టిస్‌ వర్మ రాజీనామా 

Apr 11 2026 4:27 AM | Updated on Apr 11 2026 6:18 AM

Justice Yashwant Varma Resignation As Allahabad High Court Judge

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రాజీనామా లేఖ  

‘తీవ్రమైన ఆవేదన’తో తప్పుకుంటున్నానని వెల్లడి 

స్పీకర్‌ ఓం బిర్లా నియమించిన కమిటీకి  మరో లేఖ  

విచారణలో పాల్గొంటే న్యాయ వ్వవస్థకు అపకారం చేసినట్లేనని స్పష్టీకరణ  

పార్లమెంట్‌లో అభిశంసన ప్రక్రియ నిష్ఫలమైనట్లేనంటున్న అధికారులు  

న్యూఢిల్లీ/అలహాబాద్‌: అభిశంసన ప్రక్రియను ఎదుర్కొంటున్న అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్‌ వర్మ(57) తన పదవికి రాజీనామా చేశారు. గత సంవత్సరం ఢిల్లీలోని నివాసంలో ఆయన నోట్ల కట్టలతో దొరికిపోయిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలున్న జస్టిస్‌ వర్మను పదవి నుంచి తొలగించడానికి పార్లమెంట్‌లో అభిశంసన ప్రక్రియను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా రాజీనామా చేయడం సంచలనాత్మకంగా మారింది. గురువారం తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపించారు. 

‘తీవ్రమైన ఆవేదన’తో తక్షణమే రాజీనామా చేస్తున్నానని, ఇన్నాళ్లూ న్యాయమూర్తిగా సేవలందించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. న్యాయమూర్తి పదవికి జస్టిస్‌ వర్మ రాజీనామా సమరి్పంచడంతో ఆయనపై లోక్‌సభ ప్రారంభించిన అభిశంసన చర్యలు నిష్ఫలమైనట్లేనని అధికారులు శుక్రవారం తెలిపారు. వాస్తవానికి ఆయన పదవీ కాలం 2031 జనవరి 5 దాకా ఉంది. పార్లమెంట్‌ తనపై వేటు వేసేదాకా ఆగకుండా ముందుగానే పదవి నుంచి తప్పుకున్నారు. లోక్‌సభ నియమించిన కమిటీ నేతృత్వంలో జరుగుతున్న విచారణ ప్రక్రియ నుంచి సైతం వైదొలిగినట్లేనని చెబుతున్నారు.  

రెండుసార్లు ఎదురుదెబ్బ  
జస్టిస్‌ వర్మ గత ఏడాది ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2025 మార్చి 14న రాత్రి 11.35 గంటల సమయంలో ఆయన అధికారిక నివాసంలో అగి్నప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. జస్టిస్‌ వర్మ ఇంట్లో మంటలు ఆర్పుతుండగా ఒక గదిలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు లభించాయి. కొన్ని కాలిపోయిన స్థితిలో కనిపించాయి. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు హైకోర్టు అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. 

ఈ ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. వివరణ ఇవ్వాలని జస్టిస్‌ వర్మను సీజేఐ ఆదేశించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్‌ వర్మను అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. నోట్ల కట్టలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సుప్రీంకోర్టు ఆయనను అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేసింది. న్యాయపరమైన విధులు అతడికి అప్పగించవద్దని ఆదేశించింది.

 జస్టిస్‌ వర్మ తప్పుచేసినట్లుగా సుప్రీంకోర్టు నియమించిన అంతర్గత దర్యాప్తు కమిటీ తేల్చింది. పదవి నుంచి తొలగించాలని సిఫార్సు చేసింది. కానీ, పదవి నుంచి తప్పుకోవడానికి నిరాకరించారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. దాంతో అతడిపై అభిశంసన చర్యలు ప్రారంభించాలంటూ ప్రభుత్వానికి సీజేఐ విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు అంతర్గత దర్యాప్తు కమిటీ నివేదికను కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన జస్టిస్‌ వర్మకు ఎదురుదెబ్బ తగిలింది. అతడి పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. అభిశంసన చర్యలు ప్రారంభిస్తూ గత ఏడాది ఆగస్టు 12న లోక్‌సభలో ఒక తీర్మానం ఆమోదించారు. 

అవినీతి ఆరోపణలపై దర్యాప్తు కోసం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటును సవాలు చేస్తూ జస్టిస్‌ వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ ఏడాది జనవరి 16న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పార్లమెంటరీ కార్యకలాపాలకు ఆటంకం కలిగించడానికి చట్టంలోని నిబంధనను ఆయుధంగా ఉపయోగించరాదని తేల్చిచెప్పింది. దాంతో అభిశంసనకు అడ్డంకులు తొలగిపోయాయి. ఘోర పరాభవం తప్పదని తేలడంతో జస్టిస్‌ వర్మ రాజీనామా చేశారు.  

ఇకపై విచారణలో పాల్గొనలేను  
తనపై నిందలు వేస్తూ జరుగుతున్న ప్రచారానికి బాధితుడిగా మారానని పేర్కొంటూ జస్టిస్‌ వర్మ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నియమించిన విచారణ కమిటీకి లేఖ రాశారు. అందులో తన ఆవేదనను వ్యక్తం చేశారు. విచారణ నుంచి తాను వైదొలగడానికి గల కారణాలను వివరించారు. తన నివాసంలో దొరికిన డబ్బుకు మూలం ఎక్కడుందంటూ ‘సమాధానం చెప్పలేని’ప్రశ్నకు సమాధానం చెప్పమని ఒత్తిడి చేశారని తెలిపారు. జడ్జిగా 11 ఏళ్ల వృత్తి జీవితంలో తనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదన్నారు. 

ప్రస్తుతం జరుగుతున్న విచారణలో ఇంకా పాల్గొంటే తనకే కాకుండా న్యాయ వ్వవస్థకు సైతం అపకారం చేసినవాడినవుతానని ఉద్ఘాటించారు. అందుకే ఈ విచారణ నుంచి తక్షణమే వైదొలుగుతున్నానని లేఖలో స్పష్టంచేశారు. పదవిలో ఉన్న ఒక న్యాయమూర్తికి జరిగిన అన్యాయాన్ని చరిత్ర ఎప్పటికైనా నమోదు చేస్తుందన్న ఆశతో ఉన్నానని తెలియజేశారు. జస్టిస్‌ వర్మ రాజీనామాపై స్పీకర్‌ ఓం బిర్లా స్పందించారు. అతడి రాజీనామా గురించి రాష్ట్రపతికి మాత్రమే తెలుసని వ్యాఖ్యానించారు. 1992 ఆగస్టు 8న అడ్వొకేట్‌గా న్యాయవాద వృత్తి ఆరంభించిన జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ హైకోర్టు న్యాయమూర్తి స్థాయికి ఎదిగారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement