ఎవరెస్ట్‌పై వందేమాతరం  | ITBP all-women teams completes first mount Everest | Sakshi
Sakshi News home page

ఎవరెస్ట్‌పై వందేమాతరం 

May 23 2026 4:18 AM | Updated on May 23 2026 4:18 AM

ITBP all-women teams completes first mount Everest

ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్‌ మొట్టమొదటి మహిళా బృందాల సాహసయాత్ర

న్యూఢిల్లీ: భారత రక్షణ రంగ చరిత్రలో 2026 మే 21వ తేదీ ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. దేశ సరిహద్దులను కాపాడే వీర వనితలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి అపూర్వమైన రికార్డు సాదించారు. 

ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ), సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌)కు చెందిన మొట్టమొదటి పూర్తి మహిళా బృందాలు వేర్వేరుగా ఒకే రోజు ఎవరెస్ట్‌పై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి అ రుదైన జంట రికార్డును నెలకొల్పారు. దేశంలోని యువతులకు, మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. శత్రువుల నుంచి దేశాన్ని రక్షించడమే కాదు ప్రకృతి విసిరే కఠిన సవాళ్లను సైతం ఎదుర్కొని విజయం సాధించడంలో ఎవరికీ తీసిపోమని నిరూపించారు. 

ఎవరెస్ట్‌పై మార్మోగిన వందేమాతరం 
సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) తన 60వ అవతరణ దినోత్సవం సందర్భంగా మిషన్‌ వందేమాతరం పేరుతో మొట్టమొదటిసారిగా పూర్తిగా మహిళలతో ఎవరెస్ట్‌ యాత్రను చేపట్టింది. గురువారం ఉదయం 8.00 గంటలకు ఈ బృందం ఎవరెస్ట్‌ శిఖరాన్ని చేరుకుంది. వీరి బృందంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. 

వీరు లద్దాఖ్‌కు చెందిన కౌసర్‌ ఫాతిమా, పశ్చిమబెంగాల్‌కు చెందిన మూన్‌మూన్‌ ఘోష్, ఉత్తరాఖండ్‌కు చెందిన రబేకా సింగ్, కార్గిల్‌కు చెందిన త్సెరింగ్‌ చోరోల్‌ అనే కానిస్టేబుళ్లు. ఎవరెస్ట్‌పైన సాధారణంగా నిలబడటానికే ప్రాణవాయువు అవసరముంటుంది. అలాంటిది, అత్యంత ప్రమాదకరమైన ఆ ప్రదేశంలో వీరంతా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వీరి ఘటనను చాటుతూ బీఎస్‌ఎఫ్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. నారీ శక్తి అజేయ సంకల్పానికి, పట్టుదలకు ఇది నిదర్శనమని, మహిళా సాధికారతకు తార్కాణమని తెలిపింది.  

ఐటీబీపీ మొదటి మహిళా బృందం ఘనత 
ఐటీబీపీ చరిత్రలోనే ఇది మొట్టమొదటి పూర్తి మహిళా అంతర్జాతీయ పర్వతారోహణ యాత్ర. మొత్తం 14 మంది సభ్యులతో కూడిన ఈ టీమ్‌లో 11 మంది మహిళా పర్వతారోహకులు, ముగ్గురు సాంకేతిక నిపుణులు ఉన్నారు. వీరంతా నేపాల్‌ వైపు ఉన్న కఠినమైన సౌత్‌ కోల్‌ రూట్‌ గుండా ప్రయాణించి గురువారం ఉదయం 6.52 గంటలకు ఎవరెస్ట్‌ శిఖరాన్ని చేరుకున్నారు. 

ఈ మహిళా జవాన్లు కేవలం రికార్డు కోసమే కాకుండా ‘క్లీన్‌ హిమాలయ–సేవ్‌ గ్లేసియర్‌’నినాదాన్ని వినిపించారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఎవరెస్ట్‌ పరిసర ప్రాంతాలలో పేరుకుపోయిన ప్లాస్టిక్, ఇతర కుళ్లిపోని వ్యర్థాలను సేకరించి, పర్యావరణ స్పృహ ను చాటారు. ‘ఎవరెస్ట్‌ శిఖరంపై చరిత్ర నెలకొల్పాం. 

అత్యంత కఠినమైన వాతావరణం, తక్కువ ఆక్సిజన్‌ స్థాయిలు, 8వేల మీటర్లకు మించి ఎత్తులో ఉండే భయంకరమైన డెత్‌ జోన్‌ను అధిగమించి మా 11 మంది మహిళా సైనికులు ఈ మైలురాయిని అందుకున్నారు. ఇది మన దేశానికి ఎంతో గర్వకారణమైన క్షణం’అని ఐటీబీపీ పేర్కొంది. ఈ విజయంతో ఐటీబీపీ ఇప్పటివరకు ఐదుసార్లు ఎవరెస్ట్‌ సహా ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన 14 శిఖరాలకుగాను ఆరింటి(ఎవరెస్ట్, కాంచనగంగ, మకాలు, లోట్సే, ధౌలగిరి, మనస్లు)ని విజయవంతంగా అధిరోహించినట్లయింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement