Mount Everest expedition
-
ఎవరెస్ట్‌పై వందేమాతరం
న్యూఢిల్లీ: భారత రక్షణ రంగ చరిత్రలో 2026 మే 21వ తేదీ ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. దేశ సరిహద్దులను కాపాడే వీర వనితలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అపూర్వమైన రికార్డు సాదించారు. ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)కు చెందిన మొట్టమొదటి పూర్తి మహిళా బృందాలు వేర్వేరుగా ఒకే రోజు ఎవరెస్ట్‌పై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి అ రుదైన జంట రికార్డును నెలకొల్పారు. దేశంలోని యువతులకు, మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. శత్రువుల నుంచి దేశాన్ని రక్షించడమే కాదు ప్రకృతి విసిరే కఠిన సవాళ్లను సైతం ఎదుర్కొని విజయం సాధించడంలో ఎవరికీ తీసిపోమని నిరూపించారు. ఎవరెస్ట్‌పై మార్మోగిన వందేమాతరం సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన 60వ అవతరణ దినోత్సవం సందర్భంగా మిషన్ వందేమాతరం పేరుతో మొట్టమొదటిసారిగా పూర్తిగా మహిళలతో ఎవరెస్ట్ యాత్రను చేపట్టింది. గురువారం ఉదయం 8.00 గంటలకు ఈ బృందం ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకుంది. వీరి బృందంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరు లద్దాఖ్‌కు చెందిన కౌసర్ ఫాతిమా, పశ్చిమబెంగాల్‌కు చెందిన మూన్‌మూన్ ఘోష్, ఉత్తరాఖండ్‌కు చెందిన రబేకా సింగ్, కార్గిల్‌కు చెందిన త్సెరింగ్ చోరోల్ అనే కానిస్టేబుళ్లు. ఎవరెస్ట్‌పైన సాధారణంగా నిలబడటానికే ప్రాణవాయువు అవసరముంటుంది. అలాంటిది, అత్యంత ప్రమాదకరమైన ఆ ప్రదేశంలో వీరంతా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వీరి ఘటనను చాటుతూ బీఎస్ఎఫ్ ఒక ప్రకటన విడుదల చేసింది. నారీ శక్తి అజేయ సంకల్పానికి, పట్టుదలకు ఇది నిదర్శనమని, మహిళా సాధికారతకు తార్కాణమని తెలిపింది. ఐటీబీపీ మొదటి మహిళా బృందం ఘనత ఐటీబీపీ చరిత్రలోనే ఇది మొట్టమొదటి పూర్తి మహిళా అంతర్జాతీయ పర్వతారోహణ యాత్ర. మొత్తం 14 మంది సభ్యులతో కూడిన ఈ టీమ్‌లో 11 మంది మహిళా పర్వతారోహకులు, ముగ్గురు సాంకేతిక నిపుణులు ఉన్నారు. వీరంతా నేపాల్ వైపు ఉన్న కఠినమైన సౌత్ కోల్ రూట్ గుండా ప్రయాణించి గురువారం ఉదయం 6.52 గంటలకు ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారు. ఈ మహిళా జవాన్లు కేవలం రికార్డు కోసమే కాకుండా ‘క్లీన్ హిమాలయ–సేవ్ గ్లేసియర్’నినాదాన్ని వినిపించారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఎవరెస్ట్ పరిసర ప్రాంతాలలో పేరుకుపోయిన ప్లాస్టిక్, ఇతర కుళ్లిపోని వ్యర్థాలను సేకరించి, పర్యావరణ స్పృహ ను చాటారు. ‘ఎవరెస్ట్ శిఖరంపై చరిత్ర నెలకొల్పాం. అత్యంత కఠినమైన వాతావరణం, తక్కువ ఆక్సిజన్ స్థాయిలు, 8వేల మీటర్లకు మించి ఎత్తులో ఉండే భయంకరమైన డెత్ జోన్‌ను అధిగమించి మా 11 మంది మహిళా సైనికులు ఈ మైలురాయిని అందుకున్నారు. ఇది మన దేశానికి ఎంతో గర్వకారణమైన క్షణం’అని ఐటీబీపీ పేర్కొంది. ఈ విజయంతో ఐటీబీపీ ఇప్పటివరకు ఐదుసార్లు ఎవరెస్ట్ సహా ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన 14 శిఖరాలకుగాను ఆరింటి(ఎవరెస్ట్, కాంచనగంగ, మకాలు, లోట్సే, ధౌలగిరి, మనస్లు)ని విజయవంతంగా అధిరోహించినట్లయింది. -
నేను క్షేమంగానే ఉన్నా: నీలిమ
-
పర్వతారోహణకు వెళ్లిన నీలిమ క్షేమం!
కఠ్మండు: ఈనెల 18 వ తేదీన ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లి.. ఆపై ఆచూకీ గల్లంతైన హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నీలిమ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 21 మంది బృందంతో కలిసి ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లిన నీలిమ ఆచూకీ లభించినట్లు సమాచారం. నీలిమ తన మిత్రుల ద్వారా కుటుంబ సభ్యులకు క్షేమ సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో ఎవరెస్ట్‌పైనున్న టింగ్‌బోచి అనే బేస్‌క్యాంప్‌నకు చేరుకుంటారనగా... భూకంపం సంభవించడంతో నీలిమ బృందం ఆచూకీ గల్లంతయిన సంగతి తెలిసిందే. అయితే వీరు చేరుకోవాల్సిన బేస్‌క్యాంప్‌లో భూకంప ప్రభావం అంతగా లేదనిసమాచారం. ఈ బృందంలో వివిధ దేశాలకు చెందిన మొత్తం 21 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో కొందరు అమెరికాకు చెందినవారు. వీరిలో కొందరు తాము సురక్షితంగానే ఉన్నట్లు అమెరికాలోని తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలిసింది. -
ఎవరెస్టంత ఆశతో...
సాఫ్ట్వేర్ ఇంజినీర్ నీలిమ రాక కోసం ఎదురుచూపులు క్షేమంగా తిరిగి రావాలంటూ.. బంధుమిత్రుల ప్రార్థనలు మా బిడ్డ ఎంతో ధైర్యవంతురాలు: తల్లిదండ్రులు తండ్రి పేరులోని ‘శౌర’ను తన చిరునామాగా మార్చుకుంది. అణువణువునా సాహసాన్ని... స్థైర్యాన్ని నింపుకుంది. అటు సాహస కృత్యాలలోనూ.. ఇటు కళల్లోనూ ప్రత్యేకతను చాటుకుంది. ఈ విశిష్టతలే ఆమెను ఎవరెస్ట్ శిఖరం వైపు అడుగులు వేయించాయి. ఆ సాహస నారి పేరు నీలిమ. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్. వీరి ఎవరెస్ట్ శిఖర యాత్ర సమయంలోనే దురదృష్టవశాత్తూ భూకంపం సంభవించడం... ఆమెతో ఉన్న బృందం ఆచూకీ తెలియక అందరిలోనూ ఆందోళన. నీలిమ రాకకోసం ఎంతో ఆశతో అంతా ఎదురు చూస్తున్నారు. మెహిదీపట్నం:మొక్కవోని దీక్ష.. కొండలు పిండిచేసే ఆత్మవిశ్వాసం.. ఆ యువతి సొంతం. ప్రపంచంలో అత్యున్నతమైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనుకున్న క్రమంలో ఆ సాహస మహిళ ఆచూకీ గల్లంతైంది. దీంతో మెహిదీపట్నంలోని ఆమె కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎవరెస్ట్ శిఖర అధిరోహణలో ఉన్న నీలిమ పూదోట సురక్షితంగా నగరానికి తిరిగిరావాలని వారంతా కోటి దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. సాహస కృత్యాలపై చిన్నప్పటి నుంచి ఆసక్తి కనబరిచే నీలిమకు భరతనాట్యంలోనూ ప్రవేశం ఉంది. నగరంలోని రవీంద్రభారతిలో అనేకప్రదర్శనలిచ్చి... ఆహూతుల మన్ననలు పొందడం విశేషం. ఇటీవల కేంద్ర మంత్రి జయంతీ నటరాజన్ పిలుపు మేరకు చెన్నైలో భరతనాట్య ప్రదర్శన ఇచ్చి...అక్కడి వారిని అబ్బురపరిచారు. ఏటా హైదరాబాద్‌లోని బెంగాలీ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించే దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భరతనాట్య ప్రదర్శనతో పాటు దుర్గాదేవి అవతారంలో అందరినీ మంత్రముగ్థులను చేయడం ఆమె ప్రత్యేకత అని మిత్రులు ‘సాక్షి’కి తెలిపారు. ఆమె తండ్రి శౌరయ్య న్యాయవాది. తల్లి పాప పశుసంవర్థక శాఖలో జాయింట్ డెరైక్టర్‌గా పని చేస్తున్నారు. మెహిదీపట్నంలోనే పుట్టి పెరిగిన నీలిమ ప్రాథమిక, హైస్కూలు విద్యాభ్యాసం గన్‌ఫౌండ్రిలోని రోజరీ కాన్వెంట్లో పూర్తి చేశారు. మెహిదీపట్నంలోని సెయింట్‌ఆన్స్ కళాశాలలో ఇంటర్ చదివారు. గండిపేట్‌లోని ఎంజీఐటీలో బీటెక్ పూర్తి చేశారు. గత ఏడేళ్లుగా కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. వృత్తిలోనూ డైనమిక్‌గా ఉండే నీలిమ తోటివారితో కలుపుగోలుగా ఉంటారని... ఆమెకు సాహసాలంటే ఇష్టమని మిత్రులు తెలిపారు. కఠిన పరీక్షలు ఎదుర్కొని... ఎవరెస్ట్ శిఖరం అధిరోహణకు వెళ్లేందుకు నీలిమ కఠిన పరీక్షలను సైతం ఎదుర్కొన్నారు. సాహస యాత్రను ఏర్పాటు చేసిన వీరాంబులెస్ సంస్థ మూడు నెలల పాటు శిఖరాధిరోహణకు సంబంధించి ఫిట్నెస్, బ్రీతింగ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిసింది. అన్నింటా నెగ్గి ఆమె ఎవరెస్ట్ శిఖర అధిరోహణకు బయలుదేరడం అందరినీ అబ్బురపరుస్తోంది. సురక్షితమేనా? మరికొన్ని గంటల్లో ఎవరెస్ట్‌పైనున్న టింగ్‌బోచి అనే బేస్‌క్యాంప్‌నకు చేరుకుంటారనగా... భూకంపం సంభవించడంతో నీలిమ బృందం ఆచూకీ గల్లంతయ్యింది. అయితే వీరు చేరుకోవాల్సిన బేస్‌క్యాంప్‌లో భూకంప ప్రభావం అంతగా లేదనిసమాచారం. ఈ బృందంలో వివిధ దేశాలకు చెందిన మొత్తం 21 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో కొందరు అమెరికాకు చెందినవారు. వీరిలో కొందరు తాము సురక్షితంగానే ఉన్నట్లు అమెరికాలోని తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలిసింది. కానీ పూర్తి వివరాలు తెలియరాలేదు. నీలిమ సురక్షితంగా నగరానికి చేరుకోవాలని ఆమె మిత్రులు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు దేవుణ్ణి ప్రార్థిస్తూ... ఆమె క్షేమ సమాచారం కోసం తపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో మానవతా దృక్పథంతో స్పందించాలని కోరుతున్నారు. ఆదివారం రాత్రి నీలిమ తల్లిదండ్రులు శౌరయ్య, డాక్టర్ పాపలు ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎవరెస్టంత ధైర్యాన్ని నింపుకున్న తమ కూతురు ఎన్ని అవాంతరాలైనా దాటుకుని వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి సాహసంతో అన్ని రంగాల్లో దూసుకుపోయిన తమ బిడ్డ తప్పక తిరిగి రావాలని దేవుణ్ణి వేడుకుంటున్నట్లు చెప్పారు.


