ఎవరెస్టంత ఆశతో... | Software engineer Neelima missing in Mountaineering at Nepal | Sakshi
Sakshi News home page

ఎవరెస్టంత ఆశతో...

Apr 27 2015 1:50 AM | Updated on Oct 22 2018 7:50 PM

ఎవరెస్టంత ఆశతో... - Sakshi

ఎవరెస్టంత ఆశతో...

తండ్రి పేరులోని ‘శౌర’ను తన చిరునామాగా మార్చుకుంది. అణువణువునా సాహసాన్ని... స్థైర్యాన్ని నింపుకుంది.

 సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
 నీలిమ రాక కోసం ఎదురుచూపులు
 క్షేమంగా తిరిగి రావాలంటూ..
 బంధుమిత్రుల ప్రార్థనలు
 మా బిడ్డ ఎంతో
 ధైర్యవంతురాలు: తల్లిదండ్రులు
 
 తండ్రి పేరులోని ‘శౌర’ను తన చిరునామాగా మార్చుకుంది. అణువణువునా సాహసాన్ని... స్థైర్యాన్ని నింపుకుంది. అటు సాహస కృత్యాలలోనూ.. ఇటు కళల్లోనూ ప్రత్యేకతను చాటుకుంది. ఈ విశిష్టతలే ఆమెను ఎవరెస్ట్ శిఖరం వైపు అడుగులు వేయించాయి. ఆ సాహస నారి పేరు  నీలిమ. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. వీరి ఎవరెస్ట్ శిఖర యాత్ర సమయంలోనే దురదృష్టవశాత్తూ భూకంపం సంభవించడం... ఆమెతో ఉన్న బృందం ఆచూకీ తెలియక అందరిలోనూ ఆందోళన. నీలిమ రాకకోసం ఎంతో ఆశతో అంతా ఎదురు చూస్తున్నారు.
 
 మెహిదీపట్నం:మొక్కవోని దీక్ష.. కొండలు పిండిచేసే ఆత్మవిశ్వాసం.. ఆ యువతి సొంతం. ప్రపంచంలో అత్యున్నతమైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనుకున్న క్రమంలో ఆ సాహస మహిళ ఆచూకీ గల్లంతైంది. దీంతో మెహిదీపట్నంలోని ఆమె కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎవరెస్ట్ శిఖర అధిరోహణలో ఉన్న నీలిమ పూదోట సురక్షితంగా నగరానికి తిరిగిరావాలని వారంతా కోటి దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. సాహస కృత్యాలపై చిన్నప్పటి నుంచి ఆసక్తి కనబరిచే నీలిమకు భరతనాట్యంలోనూ ప్రవేశం ఉంది. నగరంలోని రవీంద్రభారతిలో అనేకప్రదర్శనలిచ్చి...  ఆహూతుల మన్ననలు పొందడం విశేషం. ఇటీవల కేంద్ర మంత్రి జయంతీ నటరాజన్ పిలుపు మేరకు చెన్నైలో భరతనాట్య ప్రదర్శన ఇచ్చి...అక్కడి వారిని అబ్బురపరిచారు. ఏటా హైదరాబాద్‌లోని బెంగాలీ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించే దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భరతనాట్య ప్రదర్శనతో పాటు దుర్గాదేవి అవతారంలో అందరినీ మంత్రముగ్థులను చేయడం ఆమె ప్రత్యేకత అని మిత్రులు     ‘సాక్షి’కి తెలిపారు.
 
 ఆమె తండ్రి శౌరయ్య న్యాయవాది. తల్లి పాప పశుసంవర్థక శాఖలో జాయింట్ డెరైక్టర్‌గా పని చేస్తున్నారు. మెహిదీపట్నంలోనే పుట్టి పెరిగిన నీలిమ ప్రాథమిక, హైస్కూలు విద్యాభ్యాసం గన్‌ఫౌండ్రిలోని రోజరీ కాన్వెంట్‌లో పూర్తి చేశారు. మెహిదీపట్నంలోని సెయింట్‌ఆన్స్ కళాశాలలో ఇంటర్ చదివారు. గండిపేట్‌లోని ఎంజీఐటీలో బీటెక్ పూర్తి చేశారు. గత ఏడేళ్లుగా కాగ్నిజెంట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. వృత్తిలోనూ డైనమిక్‌గా ఉండే నీలిమ తోటివారితో కలుపుగోలుగా ఉంటారని... ఆమెకు సాహసాలంటే  ఇష్టమని మిత్రులు తెలిపారు.
 
 కఠిన పరీక్షలు ఎదుర్కొని...
 ఎవరెస్ట్ శిఖరం అధిరోహణకు వెళ్లేందుకు నీలిమ కఠిన పరీక్షలను సైతం ఎదుర్కొన్నారు. సాహస యాత్రను ఏర్పాటు చేసిన వీరాంబులెస్ సంస్థ మూడు నెలల పాటు శిఖరాధిరోహణకు సంబంధించి ఫిట్‌నెస్, బ్రీతింగ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిసింది. అన్నింటా నెగ్గి ఆమె ఎవరెస్ట్ శిఖర అధిరోహణకు బయలుదేరడం అందరినీ అబ్బురపరుస్తోంది.
 
 సురక్షితమేనా?
 మరికొన్ని గంటల్లో ఎవరెస్ట్‌పైనున్న టింగ్‌బోచి అనే బేస్‌క్యాంప్‌నకు  చేరుకుంటారనగా... భూకంపం సంభవించడంతో నీలిమ బృందం ఆచూకీ గల్లంతయ్యింది. అయితే వీరు చేరుకోవాల్సిన బేస్‌క్యాంప్‌లో భూకంప ప్రభావం అంతగా లేదనిసమాచారం. ఈ బృందంలో వివిధ దేశాలకు చెందిన మొత్తం 21 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో కొందరు అమెరికాకు చెందినవారు. వీరిలో కొందరు తాము సురక్షితంగానే ఉన్నట్లు అమెరికాలోని తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలిసింది. కానీ పూర్తి వివరాలు తెలియరాలేదు. నీలిమ సురక్షితంగా నగరానికి చేరుకోవాలని ఆమె మిత్రులు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు దేవుణ్ణి ప్రార్థిస్తూ... ఆమె క్షేమ సమాచారం కోసం తపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో మానవతా దృక్పథంతో స్పందించాలని కోరుతున్నారు. ఆదివారం రాత్రి నీలిమ తల్లిదండ్రులు శౌరయ్య, డాక్టర్ పాపలు ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎవరెస్టంత ధైర్యాన్ని నింపుకున్న తమ కూతురు ఎన్ని అవాంతరాలైనా దాటుకుని వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి సాహసంతో అన్ని రంగాల్లో దూసుకుపోయిన తమ బిడ్డ తప్పక తిరిగి రావాలని దేవుణ్ణి వేడుకుంటున్నట్లు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement