సూళ్లూరుపేట: ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్‌కు సంబంధించి దేశీయంగా అభివృద్ధి చేసిన సీ25 క్రయోజెనిక్ దశలో తొలిసారిగా కొత్త ప్రయోగం చేశారు. రాకెట్ నుంచి ఉపగ్రహం వేరుపడి కక్ష్యలోకి చేరిన తర్వాత రాకెట్‌లోని క్రయోజెనిక్ దశ థ్రస్ట్ చాంబర్‌ను మళ్లీ మండించినట్లు (రీఇగ్నైటెడ్) ఎల్‌వీఎం3 మిషన్ డైరెక్టర్ టి.విక్టర్ జోసెఫ్ చెప్పారు. ఇదొక కీలకమైన ప్రయోగమని పేర్కొన్నారు. భవిష్యత్తులో జరుగబోయే రాకెట్ ప్రయోగాల్లో బహుళ ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లోకి ప్రవేశపెట్టేందుకు దోహదపడుతుందని వివరించారు.
క్రయోజెనిక్ ఇంజన్‌ను మళ్లీ మండించే ప్రక్రియను ఇస్రో సైంటిస్టులు విజయవంతంగా నిర్వహించారని విక్టర్ జోసెఫ్ పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో 50 రాకెట్ ప్రయోగాలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ ఆదివారం తెలిపారు. మరో ఏడాది కాలంలో శ్రీహరికోటలో ఒక ప్రయోగ వేదిక, తమిళనాడులోని కులశేఖరపట్నంలో మరో ప్రయోగ వేదిక ఏర్పాటు చేసి ఏడాదికి కనీసం 10 ప్రయోగాలు చేస్తామని ఆయన చెప్పారు. 2026 మార్చి నెలలోగా ఏడు ప్రయోగాలను నిర్వహించనున్నామని స్పష్టంచేశారు.
ప్రధాని అభినందనలు
సీఎంఎస్–03 శాటిలైట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఇస్రో సైంటిస్టులకు అభినందనలు తెలియజేశారు. మన అంతరిక్ష రంగం మనకు ఎంతో గర్వకారణమని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.


