భారత్‌కు ఇరాన్ మంత్రి..! ఇంధన కొరత వేళ మనకెన్ని లాభాలంటే? | Iran FM Araghchi likely to visit India for BRICS | Sakshi
Sakshi News home page

భారత్‌కు ఇరాన్ మంత్రి..! ఇంధన కొరత వేళ మనకెన్ని లాభాలంటే?

May 11 2026 3:05 PM | Updated on May 11 2026 3:24 PM

Iran FM Araghchi likely to visit India for BRICS

న్యూఢిల్లీ: ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ మే 14-15 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యే అవకాశమున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అమెరికా-ఇరాన్‌ యుద్ధం, భౌగోళిక-రాజకీయ ప్రాధాన్యం పెరిగిన సమయంలో ఆయన పర్యటన జరుగుతుంది. బ్రిక్స్ వేదికలో భారత్‌-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న అనుబంధానికి దీన్ని సంకేతంగా భావిస్తున్నారు.

ఇరాన్ 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలతో కలిసి బ్రిక్స్‌లో చేరింది. ఇరాన్ న్యాయ, అంతర్జాతీయ వ్యవహారాల ఉప విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాదీ కూడా ఈ వారం జరిగే బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యే అవకాశమున్నట్లు ఇరానియన్ వర్గాలను ఉటంకిస్తూ గతంలో కథనాలు వచ్చాయి. భారత్ ఈ ఏడాది జనవరి 1న అధికారికంగా బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది. బ్రెజిల్ నుంచి ఈ బాధ్యతలు భారత్ తీసుకుంది. 2012, 2016, 2021 తర్వాత భారత్ బ్రిక్స్‌కు నాలుగోసారి అధ్యక్షత వహిస్తోంది.

రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ కూడా బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటారని రష్యా విదేశాంగ శాఖ ఏప్రిల్ 29న తెలిపింది. మే 14-15 తేదీల్లో లావ్రోవ్ భారత్‌లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ ఎక్స్‌లో వెల్లడించింది. టాస్ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ప్రస్తుత అంతర్జాతీయ అంశాలు, ప్రపంచ పాలన బలోపేతం వంటి అవకాశాలపై చర్చలకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మారియా జఖరోవా తెలిపారు.

“మే 14-15 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే పూర్తి స్థాయి బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ హాజరవుతారు” అని ఆమె చెప్పారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశం, ప్రస్తుత అంతర్జాతీయ అంశాలు, ప్రపంచ పాలన బలోపేత అవకాశాలపై చర్చలకు కీలక వేదికగా నిలుస్తుందని టాస్, జఖరోవాను ఉటంకిస్తూ తెలిపింది.

ముఖ్యంగా ప్రపంచ మెజారిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాల అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు పేర్కొంది. “ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ సదస్సు సన్నాహకాలలో వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతంపై ప్రత్యేక దృష్టి ఉంటుంది” అని ఆమె అన్నారు.

ఇదిలా ఉండగా, బ్రిక్స్ మధ్యప్రాచ్యం-ఉత్తర ఆఫ్రికా ఉప విదేశాంగ మంత్రులు, ప్రత్యేక ప్రతినిధుల సమావేశం ఏప్రిల్ 23-24 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగింది. ప్రస్తుత ప్రాంతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. బ్రిక్స్‌లో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్య దేశాలుగా ఉన్నాయి. 

ప్రపంచ, ప్రాంతీయ ప్రాధాన్య అంశాలు, రాజకీయ-ఆర్థిక పాలన అంశాలపై సంప్రదింపులు, సహకారానికి ఇది కీలక వేదికగా ఉంది. 2026 బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత్ “బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ” అనే అంశాన్ని మార్గదర్శకంగా తీసుకుంది. 2025లో రియో డీ జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని ప్రస్తావించిన ప్రజాకేంద్ర, మానవతా ప్రథమ విధానాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.

భారత్‌కు ఇది ఎందుకు కీలకం?
ఈ ఏడాది బ్రిక్స్ అధ్యక్ష దేశంగా ఉన్న భారత్.. సభ్య దేశాల భిన్న అభిప్రాయాల మధ్య సమతుల్యత పాటించే అవకాశం ఉంది. సున్నితమైన భౌగోళిక-రాజకీయ అంశాలపై విభేదాలు తలెత్తకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పశ్చిమ ఆసియా అంశాలపై సభ్య దేశాల మధ్య గతంలో ఏకాభిప్రాయం కుదరని సందర్భాలు ఉన్నాయి. ఇరాన్‌తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా గల్ఫ్ భాగస్వామ్య దేశాలతో కూడా భారత్‌కు బలమైన సంబంధాలు ఉన్నాయి. దీంతో బ్రిక్స్‌లో ఏకాభిప్రాయం సాధించడం దౌత్యపరంగా సున్నిత అంశంగా మారింది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ అబుదాబీ పర్యటనకు వెళ్లే అవకాశముంది.  

హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరా అంతరాయాలపై చర్చలు కొనసాగుతున్న సమయంలో అరాఘ్చీ పర్యటన సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఇరాన్, భారత్‌ నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తున‍్నాయి. విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్‌తో కూడా ఇరాన్‌ పలుమార్లు చర్చలు జరిపింది. గల్ఫ్ ఉద్రిక్తతల్లో ఏ సైనిక కూటమికీ మద్దతుగా నిలవకుండా భారత్ దౌత్య సంబంధాలను కొనసాగిస్తోంది. ప్రాంతీయ స్థిరత్వం, ఇంధన సరఫరా భద్రతపై భారత్ ప్రధాన దృష్టి పెట్టింది.

Advertisement
 
Advertisement
Advertisement