INS Rajput: ‘రాజ్‌పుత్‌’కు వీడ్కోలు

INS Rajput Decommissioned On Friday After 41 Years Of Service - Sakshi

నేడు యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ సేవల నుంచి నిష్క్రమణ

భారత నౌకాదళంలో నాలుగు దశాబ్దాలుగా సేవలందించిన

మొదటి డిస్ట్రాయర్‌ యుద్ధనౌక 

కీలక ఆపరేషన్స్‌లో ముఖ్య భూమిక

సాక్షి, విశాఖపట్నం: ‘రాజ్‌ కరేగా రాజ్‌పుత్‌...’  అనే నినాదంతో నాలుగు దశాబ్దాల పాటు సాగర జలాల్ని భద్రతా వ్యవహారాల్లో పాలించిన ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ సేవల నుంచి నిష్క్రమించనుంది. భారత నౌకాదళానికి చెందిన మొట్టమొదటి డిస్ట్రాయర్‌ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ని విశాఖ నేవల్‌ డాక్‌యార్డులో శుక్రవారం డీ కమిషన్‌ చేయనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 41 ఏళ్ల పాటు అవిశ్రాంత సేవలు అందించిన రాజ్‌పుత్‌కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు తూర్పు నౌకాదళం ఏర్పాట్లు చేసింది.

నాదెజ్నీ(ఆశ) పేరుతో 1961లో సోవియట్‌ యూనియన్‌లోని నికోలావ్‌ (ప్రస్తుతం ఉక్రెయిన్‌ ఉంది)లో ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ నిర్మాణాన్ని చేపట్టారు. 1977, సెప్టెంబర్‌ 17న సేవలు ప్రారంభించగా.. 1980, మే 4న తేదీన జార్జియాలోని యూఎస్‌ఎస్‌ఆర్‌లో భారత రాయబారి ఐ.కె.గుజ్రాల్‌ సమక్షంలో ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌గా పేరు మార్చి.. భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టి... జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి భారత సముద్ర జలాల్లో తిరుగులేని శక్తిగా మారింది. మొట్టమొదటి గైడెడ్‌ క్షిపణి డిస్ట్రాయర్‌గా 41 ఏళ్ల పాటు రాజ్‌పుత్‌ సుదీర్ఘ సేవలందించింది.

పలు ఆపరేషన్లలో...
దేశాన్ని ఎల్లపుడూ సురక్షితంగా ఉంచే లక్ష్యంతో ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ అనేక కార్యకలాపాల్లో పాల్గొంది. ఐపీకేఎఫ్‌కు సహాయంగా ఆపరేషన్‌ అమన్, శ్రీలంక తీరంలో పెట్రోలింగ్‌ విధుల కోసం ఆపరేషన్‌ పవన్, మాల్దీవుల బందీ పరిస్థితులను పరిష్కరించేందుకు అపరేషన్‌ కాక్టస్, లక్షద్వీప్‌కు చెందిన క్రోవ్‌నెస్ట్‌ ఆపరేషన్‌లో రాజ్‌పుత్‌ పాల్గొంది. వివిధ సందర్భాల్లో ద్వైపాక్షిక, బహుపాక్షిక విన్యాసాల్లో పాల్గొంది. 41 ఏళ్ల ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ ప్రస్థానంలో 31 మంది కమాండింగ్‌ ఆఫీసర్లుగా వ్యవహరించారు.
బ్రహ్మోస్‌ క్రూయిజ్‌ క్షిపణికి ట్రయల్‌ ప్లాట్‌ఫామ్‌గా రాజ్‌పుత్‌ సేవలందించింది.
2005లో ధనుష్‌ బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాన్ని కూడా రాజ్‌పుత్‌ నుంచి ట్రాక్‌ చేశారు.
2007 మార్చిలో పృథ్వి–3 క్షిపణిని ఈ యుద్ధ నౌక నుంచి పరీక్షించారు.

డాక్‌యార్డులో వీడ్కోలు
నౌకాదళానికి అవిశ్రాంత సేవలం దించిన.. రాజ్‌పుత్‌కు ఘన వీడ్కోలు పలకను న్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విశాఖలోని నేవల్‌ డాక్‌యార్డ్‌లో జరిగే ఈ వీడ్కోలు కార్యక్రమాన్ని కోవిడ్‌ నిబంధనల ప్రకారం అతి తక్కువ మంది సమక్షంలో నిర్వహించనున్నారు. సూర్యాస్తమయ సమయంలో భారత నావికాదళం నుంచి ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ నిష్క్రమించనుంది. రాజ్‌పుత్‌లో విధులు నిర్వర్తించిన పలువురు అధికారుల్ని సత్కరించేందుకు తూర్పు నౌకాదళం ఏర్పాట్లు పూర్తి చేసింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top