
న్యూఢ్లిల్లీ: జనరేషస్ జెడ్ నిరసనలతో నేపాల్ అట్టుడుకిపోతోంది. ఈ నేపధ్యంలో అక్కడున్న పర్యాటకులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అక్కడ చిక్కుకుపోయిన ఒక పర్యాటకురాలు తనను కాపాడాలంటూ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఉపాసన గిల్‌గా తనను పరిచయం చేసుకున్న ఆమె తనకు ఎదురైన భయానక అనుభవాలను పంచుకున్నారు.
‘నేను స్పాలో ఉండగా, నేను బస చేసిన హోటల్‌కు నిరసనకారులు నిప్పంటించారు. కర్రలు చేత పట్టుకుని కొందరు పరిగెడుతూ అందరినీ భయపెట్టారు. వాలీబాల్ లీగ్‌ను నిర్వహించడానికి నేను నేపాల్‌కు వచ్చాను. దయచేసి నాకు సహాయం చేయాలని భారత రాయబార కార్యాలయాన్ని అభ్యర్థిస్తున్నాను. నేను ఇక్కడ నేపాల్‌లోని పోఖ్రాలో చిక్కుకుపోయాను. నేను బస చేసిన హోటల్ దగ్ధమయ్యింది. వస్తువులన్నీ నా గదిలోనే ఉండిపోయాయి.హోటల్ మొత్తం తగలబడింది. నేను ప్రాణాలతో తప్పించుకోగలిగాను. ఇక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రతిచోటా రోడ్లపై మంటలు చెలరేగుతున్నాయి. ఆందోళనకారులు ఇక్కడి పర్యాటకులను విడిచిపెట్టడం లేదు. ప్రతిచోటా నిప్పు పెడుతున్నారు. దయచేసి మాకు సహాయం చేయండి. ఇక్కడ నాతోపాటు చాలా మంది ఉన్నారు’ అని ఆ భారత మహిళ వీడియోలో మొరపెట్టుకున్నారు.
సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని ప్రభుత్వ అవినీతిపై తిరుగుబాటుగా మారాయి. సోమవారం రాత్రి ఆలస్యంగా సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ, భారీ నిరసనల నేపథ్యంలో ప్రధాని ఓలి రాజీనామా చేశారు. ప్రదర్శనకారులు పలు ప్రభుత్వ భవనాలను ముట్టడించి, పార్లమెంటుతో పాటు పలువురు ఉన్నత స్థాయి అధికారుల ఇళ్లను తగలబెట్టారు. కాగా కాఠ్మండులోని భారత రాయబార కార్యాలయం.. నేపాల్‌లోని పరిస్థితులు చక్కబడే వరకూ ప్రయాణాలను వాయిదా వేయాలని కోరింది.