దుస్సాహసానికి దిగితే ప్రకటనలతో సరిపెట్టబోం
ఆపరేషన్ సింధూర్ మన సత్తాకు నిదర్శనం
జాతీయ భద్రతా సదస్సులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ వ్యాఖ్యలు
ఇంటర్నేషనల్ టెర్రరిజానికి కేంద్రమంటూ పాక్‌పై ధ్వజం
భద్రత, రక్షణ రంగానికి ఏఐ ఎంతో కీలకమని వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రదాడులు జరిగినప్పుడు దౌత్య ప్రకటనలతో సరిపెట్టే పాత ధోరణికి భారత్ పూర్తిగా స్వస్తి పలికిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మాటలతో సరిపెట్టుకోదని, కఠినమైన చర్యల ద్వారా ఉగ్రవాదంపై చిత్తశుద్ధిని ఇప్పటికే నిరూపించుకుందన్నారు. ఇందుకు ’ఆపరేషన్ సింధూర్’ప్రత్యక్ష నిదర్శనమని ఆయన ఉద్ఘాటించారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతా సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ కీలక ఉపన్యాసం చేశారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్న ప్రభుత్వ కఠిన వైఖరిని ఆయన నొక్కిచెప్పారు.
ఉగ్రవాదానికి మతం రంగు ప్రమాదకరం
ఉగ్రవాదం అనేది వక్రీకరించిన, వికృత మనస్తత్వం నుంచి పుడుతుందని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. దానికి మతం రంగు పులమడం, నక్సలిజం లాంటి హింసాత్మక భావ జాలంతో ముడిపెట్టి సమరి్థంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. పాకిస్తాన్ తీరుపై ఆయన పరోక్షంగా మండిపడ్డారు. ‘భారత్, పాకిస్తాన్ ఒకేసారి స్వాతంత్య్రం పొందాయి. నేడు భారత్ ఐటీ(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) రంగంలో ప్రపంచ గుర్తింపు పొందగా, పాక్ మాత్రం మరో ఐటీ (ఇంటర్నేషనల్ టెర్రరిజం)కి కేంద్ర బిందువుగా మారింది’అని ఎద్దేవా చేశారు.
మన షరతుల మేరకే ఆపరేషన్ సింధూర్
‘ఆపరేషన్ సింధూర్’భారత త్రివిధ దళాల సమన్వయానికి, శక్తికి అద్దం పడుతుందని రక్షణ మంత్రి అభివర్ణించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ కలిసి ఒకే ప్రణాళికతో పనిచేశాయని తెలిపారు. కేవలం 72 గంటల్లోనే ముగిసిన ఈ ఆపరేషన్‌ను భారత్ పూర్తిగా తన సొంత నిర్ణయం, షరతుల మేరకే ప్రారంభించి, ముగించిందని స్పష్టం చేశారు. మనపై దాడి చేసిన వారిని మాత్రమే కచి్చతత్వంతో లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారు. అణుదాడి బెదిరింపులకు భారత్ భయపడ
లేదని, నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించిందని ఆయన వివరించారు.
సైన్యంలో ఏఐ.. సుదర్శన్ అద్భుతం
ఆధునిక యుద్ధతంత్రంలో ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కేంద్ర బిందువుగా మారిందని మంత్రి వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్‌లో వాడిన బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థల నుంచి నిఘా ఆపరేషన్ల వరకు ఏఐని సమర్థవంతంగా వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఏఐను ’ఆగ్మెంటెడ్ ఇన్‌ఫాంట్రీ’గా అభివర్ణించిన ఆయన, ఇదిసైనికుల సామర్థ్యాన్ని ఎన్నో రెట్లు పెంచుతోందన్నారు. ఆధునిక ముప్పులను ఎదుర్కొనేందుకు వీలుగా సైన్యం ‘రుద్ర’బ్రిగేడ్లు, ‘భైరవ్’బెటాలియన్లు, ‘శక్తిబాణ్’ఆరి్టలరీ రెజిమెంట్లు, ‘దివ్యాస్త్ర’బ్యాటరీలను ఏర్పాటు చేసిందని చెప్పారు. ఏఐ వినియోగానికి ‘సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్’ఒక గొప్ప ఉదాహరణ అని వివరించారు. రక్షణ రంగ పెన్షనర్ల కోసం రూపొందించిన ’స్పర్శ్’పోర్టల్‌లోనూ ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ల ద్వారా సేవలను సులభతరం చేశామన్నారు.
ఏఐతో ముప్పూ ఎక్కువే
ఏఐతో ప్రయోజనాలతో పాటు డీప్‌ఫేక్‌లు, సైబర్ దాడులు, స్వయంప్రతిపత్తి కలిగిన ఆయుధ వ్యవస్థల రూపంలో ప్రమాదకరమైన సవాళ్లు కూడా వస్తున్నాయని రాజ్‌నాథ్ హెచ్చరించారు. ఏఐ నియంత్రణ తప్పితే వినాశనానికి దారితీస్తుందని, అంతర్జాతీయ సహకారంతోనే దీనిని సమర్థవంతంగా వినియోగించుకోగలమని స్పష్టం చేశారు. ‘ఏఐ ఫర్ ఆల్’అనే మంత్రంతో భారత్ ముందుకెళ్తోందని, ఇటీవలే ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ను సైతం విజయవంతంగా నిర్వహించిందని చెప్పారు సదస్సులో రక్షణ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్, డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వి. కామత్, చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ పాల్గొన్నారు.
రక్షణ ఎగుమతుల్లో ఆల్ టైమ్ రికార్డ్
ఆపరేషన్ సింధూర్ తర్వాత స్వదేశీ ఆయుధాలు, రక్షణ ఉత్పత్తులపై ప్రపంచ దేశాల దృక్పథంలో సానుకూల మార్పు వచ్చిందని రాజ్‌నాథ్ వెల్లడించారు. 2025–26లో దేశ రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ.38,424 కోట్లకు చేరుకున్నాయని, గత ఏడాదితో పోలిస్తే ఇది 62.66 శాతం ఎక్కువని వివరించారు. యూరప్‌లోని ప్రధాన కంపెనీలు సైతం భారతీయ ప్రైవేట్ రక్షణ సంస్థలతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నాయన్నారు.


