
ప్రస్తుత మార్కెట్ 54.3 బిలియన్ డాలర్లు
2030 నాటికి 103.5 బిలియన్ డాలర్లకు
భారత సెమీకండక్టర్ మార్కెట్ విలువ ప్రస్తుత సంవత్సరంలో 54.3 బిలియన్ డాలర్లకు చేరవచ్చని.. 2030 నాటికి 13.8 శాతం వార్షిక వృద్ధి రేటుతో 103.5 బిలియన్ డాలర్లకు చేరుతుందని స్టాఫింగ్ కంపెనీ ‘క్వెస్ కార్ప్’ నివేదిక తెలిపింది. ‘ది చిప్ క్యాటలిస్ట్: ఇండియాస్ ఎమర్జింగ్ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్’ పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. భారీ స్థాయిలో వినియోగ మార్కెట్‌గా ఉన్న భారత్, ప్రపంచ సామర్థ్య కేంద్రంగా అవతరిస్తోంది.

అయితే ఈ రంగం నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సెమీకండక్టర్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 80 శాతం మందికి.. 10 సంవత్సరాల కంటే తక్కువ అనుభవం ఉంది. మధ్య స్థాయి, సీనియర్ రోల్స్‌లో నిపుణుల కొరత ఉంది. 55కుపైగా ఉన్న సెమీకండక్టర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్‌లో (జీసీసీ) 60 వేల పైచిలుకు ఇంజనీర్లు పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ పరిశ్రమలో 2030 నాటికి నిపుణుల సంఖ్య 4,00,000లకు చేరనుంది. తద్వారా నిపుణుల సంఖ్య విషయంలో ప్రపంచంలో యూఎస్ తర్వాత భారత్ రెండో స్థానాన్ని ఆక్రమించనుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్