ఆరుగురికి ‘యూకే’ వైరస్‌

India reports 6 cases of new Covid-19 strain as UK returnees positive - Sakshi

బ్రిటన్‌ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో గుర్తింపు

న్యూఢిల్లీ: యూకేలో బయటపడి యూరప్‌ను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌ భారత్‌లో  కనిపించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. యూకే నుంచి వచ్చిన ఆరుగురు ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా వీరికి కరోనా కొత్త స్ట్రెయిన్‌ పాజిటివ్‌గా తేలిందని ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో ముగ్గురి శాంపిల్స్‌ను బెంగళూరు నిమ్‌హాన్స్‌లో, ఇద్దరివి హైదరాబాద్‌ సీసీఎంబీలో, ఒకరిది పుణెలోని ఎన్‌ఐవీలో పరీక్షించగా, అన్నింటిలో యూకే వేరియంట్‌ జీనోమ్‌ కలిగిన కరోనా రకం సార్స్‌– సీఓవీ–2 కనిపించినట్లు వివరించింది. ప్రస్తుతం వీరందరినీ ఆయా రాష్ట్రప్రభుత్వాల ఆధ్వర్యంలో ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపింది. కొత్త వేరియంట్‌ కలకలం నేపథ్యంలో భారత్‌కు యూకే నుంచి వచ్చే విమానాలన్నింటినీ ప్రభుత్వం డిసెంబర్‌ 23 నుంచి 31 వరకు నిషేధించింది.  

విదేశీయాత్రికులకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌
డిసెంబరు 9 నుంచి 22 మధ్య విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుల్లో కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిన వారందరికీ ప్రభుత్వం జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ నిర్వహించనుంది. కరోనా నెగెటివ్‌ వచ్చిన వారిని ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం పరీక్షించి, రాష్ట్ర, జిల్లా నిఘా అధికారుల పర్యవేక్షణలో ఉంచుతారని తెలిపింది. యూకే స్ట్రెయిన్‌ సహా కొత్తరకం వైరస్‌లను గుర్తించేందుకు చర్యలు చేపట్టాము. జీనోమ్‌ పరీక్షల కోసం  10 ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. దేశంలోకి కొత్త వేరియంట్‌ రాకముందే దాదాపు 5వేల జీనోమ్‌ పరీక్షలు చేశాం. ఈ సంఖ్యను క్రమంగా పెంచుతాం’ అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 23 మధ్యలో యూకే నుంచి భారత్‌లోని వివిధ ప్రాంతాలకు 33వేల మంది వచ్చారని కేంద్రం తెలిపింది. వీరిందరినీ ఆయా రాష్ట్రాలు ట్రేస్‌ చేసి పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించాయని, వీరిలో 114 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైందని తెలిపింది.
 
వైరస్‌ కొత్త రకంపైనా వ్యాక్సిన్ల ప్రభావం
కోవిడ్‌–19 వ్యాక్సిన్లు కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌పైనా పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు వైరస్‌ వేరియంట్ల నుంచి రక్షణ కల్పించడం లేదనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని వివరించింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ కేసులు నమోదవుతున్న యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే), దక్షిణాఫ్రికాల నుంచి ఇందుకు సంబంధించిన ఎలాంటి సమాచారమూ లేదని వెల్లడించింది.

యూకే విమానాలపై నిషేధం కొనసాగింపు?
యునైటెడ్‌ కింగ్‌డమ్, భారత్‌ మధ్య విమానాల రాకపోకలపై విధించిన సస్పెన్షన్‌ను కొనసాగించే అవకాశం ఉందని విమానయాన మంత్రి హర్‌దీప్‌ చెప్పారు. త్వరలో దీనిపై స్పష్టతనిస్తామన్నారు. విమానాశ్రయాల ప్రైవేటీకరణ తదుపరి రౌండ్‌ను 2021లో ఆరంభించవచ్చని ఏఏఐ చైర్మన్‌ అర్వింద్‌ సింగ్‌ చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top